చూపులకు తెల్లగా ఉంటుంది. మీగడ తెట్టెలతో నాలిక మీద వేసుకోగానే కరిగి కమ్మటి అనుభూతినిస్తుంది. మండు వేసవిలో దాహార్తిని తీర్చే గొప్ప అమృతపు జల్లు - ఈ చల్ల. కవ్వపు చిలికిడికి చిదిమిన గడ్డపెరుగు చిక్కని మజ్జిగవుతుంది. నురగలు తేల్లిన ఈ మజ్జిగ నోరూరిస్తుంది. ఈ చల్లలో రుచితో బాటు ఔషధగుణాలు వున్నాయి. ఎండాకాలంలో గుటక గుటకలో దాహాన్ని తీర్చి, సేదతీర్చి చలువను చేకూర్చే చల్లనయిన చల్ల వల్ల లాభాలెన్నో వున్నాయి.
చల్లలో ఆరోగ్యాన్నిచ్చే మంచి లక్షణాలెన్నో వున్నాయి. కాల్షియంని అందించే ఆరోగ్యగనితో పోలుస్తారు చల్లని. ఫాస్ఫరస్, పొటాషియం, ప్రొటీన్స్‌తో పాటు ఇందులో విటమిన్ బి కూడా మనకు లభ్యమౌతుంది. మధ్యాహ్నాలు ఆకలేసినప్పుడు తినే నూనే వంటకాలు చేసే హానికంటే ఒక గ్లాసు మజ్జిగ తాగితే శరీరానికి చేకూరే మేలు అధికంగా వుంటుంది.ఎండాకాలంలో కుండలో దాచుకునే పలుచటి చల్ల తాగడం వల్ల వడదెబ్బ తాకిడి వుండదు. గొంతెండిపోయే దాహార్తి బాధనుంచి ఉపశమనాన్నిస్తుంది. శరీరంలో తేమని పొడారిపోనీకుండా చేసే గుణం దీనిలో వుంటుంది కాబట్టి ఎండాకాలంలో దీన్ని సేవించడం వల్ల నీరసం వుండదు. ముఖ్యంగా వృద్ధులు తప్పకుండా రోజూ చల్ల తాగుతుండాలి చల్ల చేసే చలువని తల్లి చలువతో పోల్చవచ్చు.
పాలు మీగడలు, పెరుగు చల్లల రుచులలో ఇన్ని విలువయిన పోషకాలు వుండబట్టె కాబోలు.. వీటిని దొంగిలించి మరీ తినేవాడు ఆ నవనీతచోరుడు. అలనాడు రేపల్లె భామలు చల్లలమ్మేవారు. అమ్మనీకుండా అడ్డుపడే నల్లవాడ్ని దారివ్వమని వేడుకునేవారు. "మధురానగరిలో చల్ల నమ్మబోదు దారివిడుము కృష్ణా" అని.
'తక్రం,శక్రమపి దుర్లభం' అన్నారు ఆయుర్వేద వైద్యులు. చల్ల ఇంద్రుడికైనా దుర్లభమేనట. చల్లలో పది రకాలున్నాయి.
1. మధితం చల్ల- నీళ్ళు కలపకుండా పెరుగు చిలికితే వచ్చేది.
2. మిళితం చల్ల- ఒక వంతు పెరుగు, వంతున్నర నీరు కలిపి చిలికితే వచ్చేది.
3. గోళం చల్ల- ఒక వంతు పెరుగు, రెండు వంతుల నీరు కలిపి చిలికితే వచ్చేది.
4. షాడభం చల్ల- ఒక కప్పు పెరుగు, 5 కప్పుల నీళ్ళు కలిపి చిలికితే వచ్చేది.
5. కాలశేయం చల్ల- ఒక కప్పు పెరుగు, రెండు కప్పుల నీరు కలిపి చిలికితే వచ్చేది.
6. కరమధితం చల్ల- ఒక కప్పు పెరుగు, ఒక కపు నీళ్ళు కలిపి చేతి కవ్వంతో చిలికి చేసిన చల్ల.
7. ఉదశ్వితం చల్ల- ఒక కప్పు పెరుగు, పావుకప్పు నీరు కలిపి, చిలికి చేసిన చల్ల.
8. తక్రం చల్ల- ఒక కప్పు పెరుగు, అరకపు నీళ్ళు పోసి కవ్వంతో చిలికి చేసిన చల్ల.
9. దండాహతం చల్ల- ఒక కప్పు పెరుగు, రెండు కప్పుల నీరు పోసి కవ్వంతో చిలికి చేసిన చల్ల.
10. అతిమిళితం చల్ల- ఒక కప్పు పెరుగు, తొమ్మిది కప్పుల నీళ్ళు పోసి కవ్వంతో చిలికి చేసిన చల్ల.
అతిమిళితం తాగడం వల్ల మూలశంకవ్యాధి, ఫిస్ట్యుల వంటివి తగ్గుతాయి. ఉప్పేసిన చల్లలో ఇనపగరిటెతో వేసిన తాలింపుని ముంచి తీసిన చల్ల తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తవిరేచనాలు అరికడతాయి. ఒక గ్లాసుడు చల్లని రెండుతులాల బెల్లంతో కలిపి తాగడం వల్ల మూత్రకృచ్చం అనే రోగం తగ్గుతుంది. ప్రతిరోజూ ఉదయంపూట ఒక గోలికాయంత ఉసిరికాయ పచ్చడి, ఒక గ్లాసు తాజా చల్ల తాగితే రోజంతా ఉత్సాహంగా వుంటుంది.ఆవుపాల నుంచి తయారయిన చల్ల తాగడం వల్ల, రేచీకటి, కంటివ్యాధులు దరికిరావు.
ఉత్తి మజ్జిగ తాగాలంటే చాలామందికి నిరుత్సాహంగా వుంటుంది. అలాంటివారికి జీలకర్ర, అల్లం,పచ్చిమిరపకాయ, నిమ్మరసం,కర్వేపాకు,కొత్తిమిర,వెల్లుల్లి రెబ్బలతో చేసే కారం చల్ల, పంచదార, ఏలక్కాయ, కిస్మిస్‌తో చేసే తీయని లస్సీ ఇస్తే లొట్టలేసుకుంటూ తాగుతారు.
గోధుమపిండి లేదా మైదాపిండిలో చారెడు బియ్యంపిండి వేసి పుల్లమజ్జిగతో దోసెలపిండిలా కలుపుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీరతోపాటు ఉప్పు,కారం, పసుపు, చిటికెడు సోడా నాలుగు జీలకర్ర పోచలు వేసి బాగా కలిపి బాగాకాగిన పెనం మీద నూనె చుక్కలేసి పలుచగా దోసె వేసుకోవాలి. పుల్ల అట్టు సిద్ధం. ఈ అట్టుని పచ్చిమిరపకాయల కారంతోగానీ,అల్లం చట్నీతో కాని తింటే పుల్లపుల్లగా కారంకారంగా చాలా బాగుంటుంది.
ఒక కప్పు కమ్మటి పెరుగుతోపాటు కాసిన్ని మామిడిపండు ముక్కలువేసి తగిన పంచదార, చిటికెడు ఏలక్కాయ పొడి కలిపి మిక్సీలో తిప్పి ఐస్‌క్యూబ్స్ వేసి తాగితే చాలా రుచిగా ఉంటుంది. అరటిపండు గుజ్జు,పెరుగు, పంచదార కలిపి కూడ మంచి డ్రింక్ చేసుకోవచ్చు. ఇంకా మజ్జిగను ఎన్నో రకాల కూరలలో వాడతారు. నవరత్న ఖుర్మా, చోలే, మజ్జిగపులుసు పెరుగు పచ్చడి, ఆవడలు మొదలగునవి.
మాలిక పత్రిక జులై 2024 సంచిక విడుదల
5 months ago
0 వ్యాఖ్యలు