Featured Posts
పెరుగు పచ్చడి (రైతా)

కమ్మటి పెరుగు 2 కప్పులు
ఉల్లిపాయ 1
కొత్తిమిర 1 tsp
టొమాటో 1
ఉప్పు తగినంత
పెరుగు బాగా చిలికి, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ,టొమాటో,కొత్తిమిర,ఉప్పు వేసి బాగా కలిపి వడ్డించాలి.
మిర్చీ కా సాలన్

పొడవైన లావు పచ్చిమిరపకాయలు 1/4 kg
ఉల్లిపాయలు 2
అల్లం వెల్లుల్లి 2 tsp
పెరుగు 1/2 కప్పు
చింతపండు పులుసు 3 tsp
పల్లీలు 3 tsp
నువ్వులు 2 tsp
కొబ్బరిపొడి 3 tbsp
పసుపు 1/4 tsp
కారం పొడి 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
ముందుగా వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి పచ్చిమిరపకాయలను మెత్తబడేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించాలి. కొబ్బరిపొడి, పసుపు,కారం,వేయించిన నువ్వులు,పల్లీలు,అల్లం వెల్లుల్లి,చింతపండు పులుసు,పెరుగు,తగినంత ఉప్పు అన్నీ కలిపి మెత్తగా ముద్ద చేసుకోవాలి. లేత బంగారు రంగులో కొచ్చిన ఉల్లిపాయలలొ ఈ నూరిన ముద్ద వేసి అడుగంటకుండా వేయించి,కప్పు నీరు పోసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన మిరపకాయలు వేసి కలిపి నిదానంగ ఉడికించి నూనే తేలేవరకు ఉంచి దింపేయాలి. కావాలంటే మిరపకాయల బదులు వంకాయలు కూడా వాడుకోవచ్చు.
హైదరాబాదీ బిర్యానీ

మాంసం 1 1/2 kg
బాస్మతీ బియ్యం 1 kg
ఉల్లిపాయలు 1/4 kg
పెరుగు 1/4 kg
అల్లం వెల్లుల్లి ముద్ద 3 tsp
కొత్తిమిర 1/2 కప్పు
పుదీన 1/2 కప్పు
పచ్చిమిర్చి 3
పసుపు 1/4 tsp
కారం పొడి 1 tsp
ఏలకులు 6
లవంగాలు 10
దాల్చిన 2" ముక్క
షాజీర 2 tsp
గరం మసాలా పొడి 1 tsp
కేసర్ రంగు లేదా కుంకుమ పువ్వు
పాలు 1 కప్పు
ఉప్పు తగినంత
నూనె రెందు కప్పులు
ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా కరకరలాడేటత్తుగా వేయించి పెట్టుకోవాలి.అలాగే తరిగిన కొత్తిమిర ,పుదీనా కూడా. కొద్దిగా పచ్చివి తీసి పక్కన పెట్టుకోవాలి. వేయించిన ఉల్లిపాయ,కొత్తిమిర,పుదీనా,పెరుగు,కారంపొడి, పసుపు,మాంసానికి తగినంత ఉప్పు వేసి గ్రైండర్లో మెత్తగా ముద్ద చేసుకోవాలి.ఒక గిన్నెలో శుభ్రపరచిన మాంసం,నూరిన ముద్ద, పచ్చి కొత్తిమిర,పుదీనా, పచ్చిమిరపకాయలు,గరం మసాలా వేసి బాగా కలియబెట్టి కనీసం గంట నాననివ్వాలి. బియ్యం కడిగి పదినిమిషాలు నాననిస్తే చాలు. మందపాటి గిన్నె తీసుకొని 4 త్బ్స్ప్ నూనె(ఇంతకుముందు ఉల్లిపాయలు వేయించిందే) వేసి దానిమీద నానబెట్టిన మాంసం, మసాలా వేసి సమానంగా అడుగున పరచి పక్కన పెట్టుకోవాలి. ఇంకో పెద్ద గిన్నెలో బియ్యానికి మూడింతలు నీళ్ళు పోసి అన్నానికి తగినంత ఉప్పు వేసి మరిగించాలి. నీరు మరిగేటప్పుడు ఏలకులు,లవంగాలు,దాల్చిన చెక్క ముక్కలు, షాజీర వేయలి. బియ్యంలోని నీరంతా వడకట్టాలి. మరుగుతున్న నీటిలో ఈ బియ్యం వేసి సగం ఉడకగానే త్వరత్వరగా జల్లెడలో వడకట్టి మాంసంపై సమానంగా పరవాలి.పైన కొన్ని ఎర్రగా వేయించిన ఉల్లిపాయలు,సన్నగా తరిగిన కొత్తిమిర,పుదీనా కొద్దిగా,రెండు చెంచాల నెయ్యి,పాలు,కొద్ది పాలల్లో నానబెట్టిన కేసర్ రంగు అక్కడక్కడ వేసి, తడిపిన గోధుమపిండిని చుట్టలాగా చేసుకుని గిన్నె అంచులపై మొత్తం పెట్టి దానిమీద సమానమైన మూత పెట్టాలి. పొయ్యిమీద ఇనప పెనం పెట్టి వేడి చేసి దానిపై ఈ గిన్నె పెట్టి దాని మీద బరువైన రాయి కాని వేరే ఎదైనా వస్తువు కాని పెట్టాలి. దీనివల్ల ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. బిర్యానీ మొత్తం ఆవిరి మీదే ఉడికిపోతుంది. అరగంట తర్వాత ఇది తయారై గోధుమ పిండిని చీల్చుకుని ఆవిరి బయటకొస్తుంది ఘుమఘుమలతో.ఈ వంటకం మధ్య వేడి మీదే నిదానంగా చేసుకోవాలి. అన్నం వడ్డించడానికి తీసేటప్పుడు నిలువుగా తీసుకోవాలి. అప్పుడు వేరువేరు రంగులతో చూడముచ్చటగా కన్నులకింపుగా ఊరిస్తూ ఉంటుంది. ఉడికించిన గ్రుడ్లతో అలంకరించుకోవాలి.దీనికి కాంబినేషన్ పెరుగు పచ్చడి,బగారా బైగన్(గుత్తి వంకాయ) మిర్చీ కా సాలన్, ఖుర్బానీ కా మీటా,డబల్ కా మీటా.
ఈ బిర్యానీ మటన్, చికెన్ తో ఒకేవిధంగా చేసుకోవచ్చు.కాని మాంసం మంచిది లేతది చూసుకోవాలి.
చల్ల చేయ్ గొల్లభామ

చూపులకు తెల్లగా ఉంటుంది. మీగడ తెట్టెలతో నాలిక మీద వేసుకోగానే కరిగి కమ్మటి అనుభూతినిస్తుంది. మండు వేసవిలో దాహార్తిని తీర్చే గొప్ప అమృతపు జల్లు - ఈ చల్ల. కవ్వపు చిలికిడికి చిదిమిన గడ్డపెరుగు చిక్కని మజ్జిగవుతుంది. నురగలు తేల్లిన ఈ మజ్జిగ నోరూరిస్తుంది. ఈ చల్లలో రుచితో బాటు ఔషధగుణాలు వున్నాయి. ఎండాకాలంలో గుటక గుటకలో దాహాన్ని తీర్చి, సేదతీర్చి చలువను చేకూర్చే చల్లనయిన చల్ల వల్ల లాభాలెన్నో వున్నాయి.
చల్లలో ఆరోగ్యాన్నిచ్చే మంచి లక్షణాలెన్నో వున్నాయి. కాల్షియంని అందించే ఆరోగ్యగనితో పోలుస్తారు చల్లని. ఫాస్ఫరస్, పొటాషియం, ప్రొటీన్స్‌తో పాటు ఇందులో విటమిన్ బి కూడా మనకు లభ్యమౌతుంది. మధ్యాహ్నాలు ఆకలేసినప్పుడు తినే నూనే వంటకాలు చేసే హానికంటే ఒక గ్లాసు మజ్జిగ తాగితే శరీరానికి చేకూరే మేలు అధికంగా వుంటుంది.ఎండాకాలంలో కుండలో దాచుకునే పలుచటి చల్ల తాగడం వల్ల వడదెబ్బ తాకిడి వుండదు. గొంతెండిపోయే దాహార్తి బాధనుంచి ఉపశమనాన్నిస్తుంది. శరీరంలో తేమని పొడారిపోనీకుండా చేసే గుణం దీనిలో వుంటుంది కాబట్టి ఎండాకాలంలో దీన్ని సేవించడం వల్ల నీరసం వుండదు. ముఖ్యంగా వృద్ధులు తప్పకుండా రోజూ చల్ల తాగుతుండాలి చల్ల చేసే చలువని తల్లి చలువతో పోల్చవచ్చు.
పాలు మీగడలు, పెరుగు చల్లల రుచులలో ఇన్ని విలువయిన పోషకాలు వుండబట్టె కాబోలు.. వీటిని దొంగిలించి మరీ తినేవాడు ఆ నవనీతచోరుడు. అలనాడు రేపల్లె భామలు చల్లలమ్మేవారు. అమ్మనీకుండా అడ్డుపడే నల్లవాడ్ని దారివ్వమని వేడుకునేవారు. "మధురానగరిలో చల్ల నమ్మబోదు దారివిడుము కృష్ణా" అని.
'తక్రం,శక్రమపి దుర్లభం' అన్నారు ఆయుర్వేద వైద్యులు. చల్ల ఇంద్రుడికైనా దుర్లభమేనట. చల్లలో పది రకాలున్నాయి.
1. మధితం చల్ల- నీళ్ళు కలపకుండా పెరుగు చిలికితే వచ్చేది.
2. మిళితం చల్ల- ఒక వంతు పెరుగు, వంతున్నర నీరు కలిపి చిలికితే వచ్చేది.
3. గోళం చల్ల- ఒక వంతు పెరుగు, రెండు వంతుల నీరు కలిపి చిలికితే వచ్చేది.
4. షాడభం చల్ల- ఒక కప్పు పెరుగు, 5 కప్పుల నీళ్ళు కలిపి చిలికితే వచ్చేది.
5. కాలశేయం చల్ల- ఒక కప్పు పెరుగు, రెండు కప్పుల నీరు కలిపి చిలికితే వచ్చేది.
6. కరమధితం చల్ల- ఒక కప్పు పెరుగు, ఒక కపు నీళ్ళు కలిపి చేతి కవ్వంతో చిలికి చేసిన చల్ల.
7. ఉదశ్వితం చల్ల- ఒక కప్పు పెరుగు, పావుకప్పు నీరు కలిపి, చిలికి చేసిన చల్ల.
8. తక్రం చల్ల- ఒక కప్పు పెరుగు, అరకపు నీళ్ళు పోసి కవ్వంతో చిలికి చేసిన చల్ల.
9. దండాహతం చల్ల- ఒక కప్పు పెరుగు, రెండు కప్పుల నీరు పోసి కవ్వంతో చిలికి చేసిన చల్ల.
10. అతిమిళితం చల్ల- ఒక కప్పు పెరుగు, తొమ్మిది కప్పుల నీళ్ళు పోసి కవ్వంతో చిలికి చేసిన చల్ల.
అతిమిళితం తాగడం వల్ల మూలశంకవ్యాధి, ఫిస్ట్యుల వంటివి తగ్గుతాయి. ఉప్పేసిన చల్లలో ఇనపగరిటెతో వేసిన తాలింపుని ముంచి తీసిన చల్ల తాగడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తవిరేచనాలు అరికడతాయి. ఒక గ్లాసుడు చల్లని రెండుతులాల బెల్లంతో కలిపి తాగడం వల్ల మూత్రకృచ్చం అనే రోగం తగ్గుతుంది. ప్రతిరోజూ ఉదయంపూట ఒక గోలికాయంత ఉసిరికాయ పచ్చడి, ఒక గ్లాసు తాజా చల్ల తాగితే రోజంతా ఉత్సాహంగా వుంటుంది.ఆవుపాల నుంచి తయారయిన చల్ల తాగడం వల్ల, రేచీకటి, కంటివ్యాధులు దరికిరావు. 
ఉత్తి మజ్జిగ తాగాలంటే చాలామందికి నిరుత్సాహంగా వుంటుంది. అలాంటివారికి జీలకర్ర, అల్లం,పచ్చిమిరపకాయ, నిమ్మరసం,కర్వేపాకు,కొత్తిమిర,వెల్లుల్లి రెబ్బలతో చేసే కారం చల్ల, పంచదార, ఏలక్కాయ, కిస్మిస్‌తో చేసే తీయని లస్సీ ఇస్తే లొట్టలేసుకుంటూ తాగుతారు.
గోధుమపిండి లేదా మైదాపిండిలో చారెడు బియ్యంపిండి వేసి పుల్లమజ్జిగతో దోసెలపిండిలా కలుపుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీరతోపాటు ఉప్పు,కారం, పసుపు, చిటికెడు సోడా నాలుగు జీలకర్ర పోచలు వేసి బాగా కలిపి బాగాకాగిన పెనం మీద నూనె చుక్కలేసి పలుచగా దోసె వేసుకోవాలి. పుల్ల అట్టు సిద్ధం. ఈ అట్టుని పచ్చిమిరపకాయల కారంతోగానీ,అల్లం చట్నీతో కాని తింటే పుల్లపుల్లగా కారంకారంగా చాలా బాగుంటుంది.
ఒక కప్పు కమ్మటి పెరుగుతోపాటు కాసిన్ని మామిడిపండు ముక్కలువేసి తగిన పంచదార, చిటికెడు ఏలక్కాయ పొడి కలిపి మిక్సీలో తిప్పి ఐస్‌క్యూబ్స్ వేసి తాగితే చాలా రుచిగా ఉంటుంది. అరటిపండు గుజ్జు,పెరుగు, పంచదార కలిపి కూడ మంచి డ్రింక్ చేసుకోవచ్చు. ఇంకా మజ్జిగను ఎన్నో రకాల కూరలలో వాడతారు. నవరత్న ఖుర్మా, చోలే, మజ్జిగపులుసు పెరుగు పచ్చడి, ఆవడలు మొదలగునవి.
పుదీనా పుచ్చకాయ షర్బత్

పుచ్చకాయ 1 kg
పుదీనా ఆకులు 1 tbsp
మిరియాల పొడి 1/2 tsp
పంచదార 3 tsp
పుచ్చకాయలోని గుజ్జును వేరు చేసి పుదీనా ఆకులతో పాటు మిక్సీలో వేసి తిప్పి వడకట్టాలి.
అందులో కాస్త పంచదార , కాస్త మిరియాలపొడి, ఐసుముక్కలు వేసి సర్వ్ చేస్తే చాలా
రుచిగా ఉంటుంది.
కొబ్బరి పానీయం

కొబ్బరికాయలు 3
నిమ్మకాయలు 2
పంచదార పొడి 1 tbsp
అల్లం రసం 1 tsp
కొబ్బరికాయ నీటిని ఒక పాత్రలో ఉంచుకోవాలి. కొబ్బరిని ముక్కలుగా చేసి కొద్దిగా నీరు పోసి మిక్సీలో తిప్పాలి. తరువాత దానిని వడకట్టి కొబ్బరినీటిలో కలపాలి. ఇందులో పంచదార పొడి, అల్లం రసం, నిమ్మరసం కలపాలి ..చల్లని నీరు, ఐసు ముక్కలు వేసి సర్వ్ చేయాలి.
దానిమ్మ షర్బత్

దానిమ్మగింజలు 3 cups
ప్రిజర్వేటివ్ 3 gm
పంచదార 750 gm
సిట్రిక్ యాసిడ్3 gm
నీరు 750 ml
వెడల్పాటి గిన్నెలో నీరు పోసి అందులో పంచదార కలిపి వేడి చేసి తీగపాకం వచ్చేలా చేయాలి.
దానిమ్మగింజలను మిక్లీలో వేసి రసం తీయాలి. పాకం చలారిన తర్వాత దానిలో దానిమ్మ
రసం, సిట్రిక్ యాసిడ్ కలపాలి. కొంచెం నీటిలో ప్రిజర్వేటివ్ కలిపి ఈ మిశ్రమంలో వేసి బాగా
కలియబెట్టాలి.పూర్తిగా చల్లారాక సీసాల్లో నింపి భద్రప్రచుకోవాలి. దీనిలో చల్లటి నీరు, ఐసు
ముక్కలు వేసి సర్వ్ చేయాలి.
మామిడి రసం

పండిన మామిడిపండ్లు 1 kg
పాలు 1/2 lit
పంచదార 200 gm
ఏలకులపొడి 1 tsp
ఒక్క గట్టి మామిడిపండు పక్కన పెట్టుకుని మిగతావన్ని ముక్కలు కోసి గ్రైండర్‍లో వేసి పాలు, పంచదార కలిపి తిప్పి ఒక గిన్నెలో తీసుకొని ఏలకులపొడి, చిన్నగా కోసిన మామిడి ముక్కలు వేసి కలిపి ఫ్రిజ్‍లో పెట్టి చల్లగా సర్వ్ చేయాలి.
నిమ్మ రసం

నిమ్మకాయలు 2 1/2 kg
ప్రిజర్వేటివ్ చిటికెడు
నీరు 1 lit
పంచదార 1 1/2 kg
సిట్రిక్ యాసిడ్ 3 gm
నిమ్మరసం తీసి ఉంచుకోవాలి. వెదల్పాటి గిన్నెలో నీరు తీసుకొని పంచదార వేసి బాగా కలిపి తీగపాకం వచ్చేవరకు వేడి చేయాలి. గిన్నెను దింపి బాగా చల్లారిన తర్వాత నిమ్మరసాన్ని వేసి కలియబెట్టాలి. కొంచెం నీటిలో ప్రిజర్వేటివ్ కలిపి ఈ మిశ్రమంలో వేసి బాగా కలియబెట్టాలి.సిట్రిక్ యాసిడ్ కూడా కలపాలి. పూర్తిగా చల్లారిన తర్వాత సీసాల్లో పోసి భద్రపరచుకోవాలి. చల్లని నీరు, ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి.
ప్లమ్ స్క్వాష్

ఆల్వుకార పండ్ల రసం 750 ml
నీరు 500 ml
సిట్రిక్ యాసిడ్ 10 gm
పంచదార 1 kg
ప్రిజర్వేటివ్ 3 చుక్కలు
ఎర్ర రంగు 5 చుక్కలు
వెడల్పాటి గిన్నెలో నీటిని తీసుకొని పొయ్యి మీద ఉంచి, దానిలో అల్బుకారా పండ్లను వేసి అవి మెత్తబడేవరకు ఉడికించాలి. అవి అతుక్కోకుండా కలుపుతూనే ఉండాలి. దింపి మిశ్రమం చల్లారాక వడగట్టాలి. దానిలో పంచదార కలిపి తీగపాకం వచ్చేవరకు మరిగించి సిట్రిక్ యాసిడ్ కలిపి గిన్నెను క్రిందకు దింపాలి. కొద్దిపాటి నీటిలో ప్రిజర్వేటివ్ కలిపి ఈ మిశమంలో వేసి బాగా కలియబెట్టాలి. తరువాత ఎర్రరంగువ్ేసి కలిపి సీసాల్లో పోసి భద్రపరచుకోవాలి.
పైనాపిల్ జ్యూస్

అనాస రసం 1 లీటరు
అనాస ఎస్సెన్స్ 2 gm
సిట్రిక్ యాసిడ్ 15 gm
నీరు 750 ml
పంచదార 1 kg
ప్రిజర్వేటివ్ 3 gm
పసుపు ఫుడ్ కలర్ 2-3 చుక్కలు
పంచదారను నీటిలో కరిగించి వడకట్టాలి. దానిని ఒక వెడల్పాటి గిన్నెలో తీసుకొని వేడి
చేయాలి. తీగపాకం వచ్చాక సిట్రిక్ యాసిడ్ కలిపి గిన్నెను దింపి పాకం చల్లారబెట్టాలి
అనాస ముక్కలు మిక్సీలో వేసి తిప్పి, వచ్చిన రసాన్ని కొలిచి పాకంలో వేసి కలపాలి.
కొంచెం నీటిలో ప్రిజర్వేటివ్ కలిపి ఈ మిశ్రమంలో కలపాలి. పసుపు రంగు, ఎస్సెన్స్
వేసి బాగా కలియబెట్టి. పూర్తిగా చలారాక శుభ్రమైన సీసాలో పోసి భద్రపరచుకోవాలి.
చల్లటి నీరు , ఐస్ ముక్కలువేసి సర్వ్ చేయాలి.
షాహి మధురసం
రూఅఫ్జా 40 ml
వెనిలా ఐస్‌క్రీం 1 చెంచా
లిమ్కా 1 బాటిల్
ఐస్ ముక్కలు
ముందుగా ఒక పెద్ద గ్లాసును ఫ్రిజ్‌లో ఉంచాలి. పది నిమిషాల తర్వాత గ్లాసును బయటకు తీసి కొన్ని ఐస్‌ముక్కలు వేసి ఉంచుకోవాలి. తరువాత దానిలో రూఅఫ్జా వేయాలి. పైన మరల కొన్ని ఐస్‌ముక్కలు వేసి లిమ్కాను కలపాలి. లిమ్కా అందులో కరుగుతున్నప్పుడు నది ఒడ్డున అలలులాగా నురగతో చూడటానికి అందంగా కనపడుతుంది.పైన ఒక చెంచాడు ఐస్‌క్రీం వేయాలి.
నిమ్మ-అల్లం పానీయం

అల్లం రసం 500 ml
నిమ్మ రసం 500 ml
పంచదార 1 1/2 kg
నీరు 750 ml
ప్రిజర్వేటివ్ 1 gm
అల్లం, నిమ్మరసం కలిపి వడకట్టాలి. అందులో 250gm పంచదార కలపాలి. అందువలన వగరు రాకుండా ఉంటుంది. అరకిలో పంచదార నీటిలో వేసి కైయబెట్టి కొంచెం వేడి చేయాలి. మరల రెండోసారి తీగపాకం వచ్చేవరకు వేడి చేసి దింపేసి చల్లారబెట్టాలి. చల్లారాక మిగిలిన పంచదార వేసి కలిపి, తయారు చేసి పెట్టుకున్న అల్లం,నిమ్మరసానికి కలపాలి. కొంచెం నీటిలో ప్రిజర్వేటివ్ కలిపి ఈ మిశ్రమంలో వేసి బాగా కలియబెట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఆ రసాన్ని శుభ్రమైన సీసాల్లో నింపి భద్రపరచుకోవాలి.
గుల్ బహార్ గులాబ్

గులాబీ రేకులు 250 gm
సిట్రిక్ యాసిడ్ చిటికెడు
గులాబీ ఎస్సెన్స్ 4 చుక్కలు
రాస్పబెర్రి కలర్ 4 చుక్కలు
పంచదార 1 1/2 kg
ప్రిజర్వేటివ్ చిటికెడు
నీరు 500 ml
వెడల్పాటి గిన్నెలో నీరు తీసుకొని గులాబీరేకులు కలిపి అవి కరిగి మెత్తబడేవరకు వేడి చేయాలి. క్రిందకు దించి బాగా కలియబెట్టి వడకట్టాలి. చల్లారిన తర్వాత మళ్ళీ మరిగించి పంచదార కలిపి తీగపాకం వచ్చేవరకు ఉంచి సిట్రిక్ యాసిడ్ వేసి బాగా కలియబెట్టి దింపేయాలి. చల్లారిన తరవాత ప్రిజర్వేటివ్, కలర్, ఎస్సెన్స్ వేసి కలపాలి. తయారైన గులాబీపానీయాన్ని శుభ్రమైన సీసాల్లో నింపి భద్రపరచుకోవాలి. ఇది చల్లని నీటిలోకాని, చల్లని పాలల్లో, కాని చల్లటి మజ్జిగలో కాని కలిపి సర్వ్ చేస్తే బావుంటుంది.
జామపండ్ల రసం

జామపండ్లు 500gm
నీరు 750 ml
ప్రిజర్వేటివ్ 3 gm
పంచదార 500 gm
గ్రీన్ ఫుడ్ కలర్ 1-2 చుక్కలు
సిట్రిక్ యాసిడ్ 10 gm
ఒక వెడల్పాటి గిన్నెలో నీరు తీసుకొని అందులో ముక్కలు చేసుకున్న జామపండ్ల ముక్కలు వేసి అవి మెత్తబడేవరకు ఉడికించి మెత్తగా గుజ్జుగా చేసి వడకట్టాలి. మళ్ళీ పొయ్యి మీద పెట్టి వేడి చేసి పంచదార కలిపి తీగపాకం వచ్చేవరకు కలియబెట్టి క్రిందకు దించాలి. పాకం చల్లబడిన తర్వాత కొంచెం నీటిలో ప్రిజర్వేటివ్, సిట్రిక్ యాసిడ్, కలర్ చుక్కలు చల్లరిన పాకంలో కలిపి ఆ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత శుభ్రమైన సీసాల్లో పోసి పెట్టుకోవాలి. ఈ జామ పానీయాన్ని చల్లని నీటిలో కలిపి సర్వ్ చేస్తే రుచిగా ఉంటుంది.
నల్ల ద్రాక్ష రసం

నల్లద్రాక్ష - 1 kg
నీరు - 1 lit
ప్రిజర్వేటివ్ - 1 1/2 gm
పంచదార - 1 kg
సిట్రిక్ ఆసిడ్ - 3 gm
నల్లద్రాక్షను బాగా కడిగి 4-5 గంటలపాటు నీటిలో ఉంచాలి.వెడల్పాటి గిన్నెలో నీరు తీసుకొని అందులో పంచదార వేసి తీగపాకం వచ్చేలా మరిగించి క్రిందకు దింపాలి. ఆ పాకం చల్లారిన తర్వాత దానిలో సిట్రిక్ యాసిడ్‌ను వేసి బాగా కలియబెట్టాలి. కడిగిన ద్రాక్షను మిక్సీలో తిప్పి రసం తీసి వడగట్టి పంచదార పాకంలో కలపాలి. కొద్దిపాటి నీటిలో ప్రిజర్వేటివ్ కలిపి దానిని పానీయంలో వేసి బాగా కలియబెట్టాలి. కావాలనుకుంటే రాస్పబెర్రి రంగు, ద్రాక్ష ఎస్సెన్స్ కలిపి శుభ్రమైన సీసాల్లో నిల్వ చేసుకోవాలి.
షర్బతీ కర్బూజ్
కర్బూజా 200 gm
పంచదార 100 gm
నిమ్మకాయలు 2
ఉప్పు చిటికెడు
నీరు 300 ml
కర్బూజాను ముక్కలుగా కోసి గింజలు తీసివేసి మిక్సీలో తిప్పాలి.అవసరమైతే
పంచదార వేసి బాగా కలిపి,ఉప్పు,నిమ్మరసం కలిపాలి. చల్లని నీరు,ఐసు ముక్కలు
వేసి సర్వ్ చేయాలి.
ఆరెంజ్ కూల్

కమలాఫలాల రసo - 750 ml
ప్రిజర్వేటివ్ - pinch
నీరు - 250 ml
పంచదార - 250 gm
నిమ్మరసం - 200 ml
బాణలి సెగపై ఉంచి పంచదార, నీరు కలిపి అది కరిగి లేత పాకం రాగానే దించి కమలాఫలాల
రసం,నిమ్మరసం కలిపి బాగా కలియబెట్టి చిటికెడు ప్రిజర్వేటివ్ కలిపి చల్లారాక నిల్వ
చేసుకోవాలి. అతిథులకు ఇచ్చేముందు చల్లని నీరు/ఐసు ముక్కలు వేసి సర్వ్ చేయాలి.
కర్బూజా ఠండక్

కర్బూజా రసం 3 cups
కమలారసం 1/2 cup
పంచదార 1/2 cup
అల్లం రసం 1 tsp
ద్రాక్షరసం 1/2 cup
నిమ్మ రసం 1/4 cup
పుదీనా పొడి 1 tsp
సోడా 1 bottle
పంచదార నీటిలో వేసి బాగా కలపాలి. మిగతా రసాలన్నీ కలిపి ఈ పంచదార నీటిని
పుదీనా పొడిని, చల్లని సోడా, ఐస్ ముక్కలు కలిపి వెంటనే అతిథులకు అందించాలి.















