Saturday, January 27, 2007

కూర పొడి

ఎండుమిరపకాయలు 10
ధనియాలు 100 gm
జీలకర్ర 2 tsp
పసుపు 1 sp
ఉప్పు తగినంత

పై వస్తువులని కొద్దిగా వేపి మిక్సీలో కాస్త బరకగా పొడి చేసుకుని
ఉంచుకోవాలి. ఏ కూరగాయలైనా (వంకాయ, దొండకాయ, బీరకాయ,
బెండకాయ,) ముక్కలుగా కోసి నూనెలో వేపి ఈ పొడి తగినంత చల్లి
ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుంటే సరి.

ఇడ్లీ పొడి

ఎండు మిర్చి 10
గుల్ల సెనగపప్పు 250 gm
ఎండుకొబ్బరి పొడి 50 gm
జీలకర్ర 1 tsp
ఉప్పు తగినంత
నూనె 2 tsp


బాణలిలో నూనె వేడి చేసి ఎండుమిర్చి, పప్పు, జీలకర్ర విడివిడిగా వేపి
తీసి చల్లారిన తర్వాత ఉప్పు,కొబ్బరి తురుము కలిపి మిక్సీలో మెత్తగా
పొడి చేసుకోవాలి.

రసం పొడి





ధనియాలు 100 gm
జీలకర్ర 25 gm
మిరియాలు 20 gm
పసుపు 1/4 tsp

పై వస్తువులన్ని కొద్దిగా వేపి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి
పెట్టుకోవాలి. రసం మరిగేటప్పుడు తగినంత రసం పొడి వేసి
చితక్కొట్టిన వెల్లుల్లి రేకలు తప్పకుండా వేయాలి. అప్పుడే రసం
రుచి వస్తుంది.

సాంబారు పొడి


కందిపప్పు 100 gm
ఎండుమిర్చి 50 gm
ధనియాలు 50 gm
సెనగపప్పు 25 gm
మినపప్పు 25 gm
జీలకర్ర 25 tsp
మిరియాలు 1 tsp
మెంతులు 1 tsp
పసుపు చిటికెడు
నూనె 1 tsp
ఉప్పు తగినంత



బాణలిలో ఒకచెంచా నూనె వేడి చేసి అన్నింటిని విడివిడిగా బాగా రంగు
వచ్చి కమ్మని వేగిన వాసన వచ్చేంత వరకు వేపి ఉప్పు కలిపి చల్లారిన
తర్వాత మెత్తగా మిక్సీలో పొడి చేసి నిల్వ చేసుకోవాలి.

కొబ్బరి కారం


ఎండుకొబ్బరి చిప్పలు 2
ఎండుమిర్చి 10
ధనియాలు అర కప్పు
వెల్లుల్లి 20 రేకలు
జీలకర్ర 4 tsp
కర్వేపాకు 5 రెబ్బలు
ఉప్పు తగినంత
పసుపు 1/2 tsp
నెయ్యి 2 tsp

బాణలిలో నెయ్యి వేడి చేసి ఎండు కొబ్బరి ముక్కలు దోరగా వేయించి
పక్కన ఉంచాలి. తర్వాత ధనియాలు, మిర్చి, కర్వేపాకు, జీలకర్ర
కూడా విడివిడిగా వేయించి చల్లారిన తర్వాత వాటికి వెల్లుల్లి ఉప్పు
జత చేసి మెత్తగా మిక్సీలో పొడి చేసుకోవాలి.

ధనియాల పొడి


ధనియాలు 100 gm
ఎండుమిర్చి 50 gm
మినపప్పు 25 gm
ఆవాలు 1 gm
వేరుసెనగపప్పు 25 gm
సెనగపప్పు 25 gm
చింతపండు అర నిమ్మపండంత
నూనె 4 tbsp
ఉప్పు తగినంత

బాణలిలో నూనే వేడి చేసి ఎండుమిర్చి, పప్పులు, ఆవాలు, చింతపండు
రెక్కలు విడివిడిగా వేపాలి.చల్లారిన తర్వాత ఉప్పు వేసి పొడి చేసుకోవాలి.

కొత్తిమీర పొడి


కొత్తిమీర 4 కట్టలు
జీలకర్ర 2 tsp
మినపప్పు 2 tsp
చింతపండు నిమ్మకాయంత
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
ఎండుమిరపకాయలు 6
మెంతులు 1/4 tsp
వెల్లుల్లి 6 రేకలు

కొత్తిమీర కట్టలు చివర కాడలు కట్ చేసి నీటిలో శుభ్రంగా చేసి పొడి
బట్ట మీద నీడలో బాగా ఆరనివ్వాలి.బాణలిలో నూనె వేసి కాగిన
తర్వాత ఎండుమిరపకాయలు, మినపప్పు, జీలకర్ర, మెంతులు,
చింతపండు రెక్కలు విడివిడిగా వేపి చల్లారనివ్వాలి.వీటికి ఆరిన
కొత్తిమీర, ఉప్పు , పసుపు,వెల్లుల్లి జత చేసి మిక్సీలో వేసి మెత్తగా
పొడి చేసుకోవాలి. వెడల్పాటి బాణలిలో కాస్త నెయ్యి వేడి చేసి
ఈ పొడిని నిదానంగా తడిలేకుండా వేపి చల్లరినతరవాత సీసాలో
వేసి ఉంచుకోవాలి.






Friday, January 26, 2007

మసాలా కారప్పొడి




ఎండుమిరపకాయలు 1 kg
ధనియాలు 250 gm
యాలకులు 50 gm
లవంగాలు 50 gm
దాల్చిన చెక్క 100 gm
షాజీర 50 gm
వెల్లుల్లి 100 gm
పసుపు 4 tsp


పై వస్తువులన్ని కలిపి మెత్తగా పొడి చేసుకుని కూరలలో వాడుకుంటే ప్రత్యేకమైన
రుచి వస్తుంది. మాంసాహారానికైతే ఇంకా బావుంటుంది.

కారప్పొడి




ఎండుమిరపకాయలు 1 కప్పు
ధనియాలు 1 కప్పు
మినపప్పు 1 కప్పు
కర్వేపాకు 1 కప్పు
వెల్లుల్లి 10 రేకలు
జీలకర్ర 2 చెంచాలు
మెంతులు 2 చెంచాలు
ఆవాలు 1 చెంచా
చింతపండు నిమ్మకాయంత
నూనె 1/4 కప్పు
పసుపు 1 tsp
ఉప్ప్పు తగినంత


బండీలో నూనె వేసి ఎండుమిరపకాయలు,ధనియాలు, మినపప్పు, కర్వేపాకు,
మెంతులు, ఆవాలు చివరగా జీలకర్ర, వెల్లుల్లి వేపి తీయాలి. చల్లారిన తర్వాత
వీటన్నింటికి ఉప్పు పసుపు కలిపి మిక్సీలో వేసి చ్వరగా చింతపండు వేసి
మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ఈ పొడిని మళ్ళీ ఓసారి
తడిలేకుండా వేయించుకుని నిల్వ చేసుకుంటే సరి.

పొదీనా పొడి



పుదీనా ఆకులు 2 కప్పులు
మినపప్పు 1 కప్పు
ఎండుమిరపకాయలు 8
వేరుశనగపప్పు 1 కప్పు
జీలకర్ర 4 చెంచాలు
శనగపప్పు 1 కప్పు
వెల్లుల్లి 12 రేకలు
ఉప్పు తగినంత
నూనె 1 tsp
నెయ్యి 3 tsp

పుదీనా ఆకులను కడిగి శుభ్రపరచి నీడలో ఆరనిచ్చి తడి లేకుండా చూసుకోవాలి.
ఒక చెంచా నూనె వేసి పప్పులన్నింటినీ విడి విడిగా వేపుకోవాలి. చివరలో జీలకర్ర,
ఎండుమిర్చి తర్వాత పుదీనా ఆకులు కూడా తడి పోయేలా వేపాలి. చల్లారిన
తర్వాత ఉప్పు వెల్లుల్లి వేపిన పదార్థాలన్నీ వేసి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
పొయ్యి మీద వెడల్పాటి బాణలి పెట్టి నెయ్యి వేడి చేసి ఈ పొడిని మళ్ళి ఓ సారి తడి
లేకుండా నిదానంగా వేపి డబ్బాలో వేసి నిల్వ చేసుకోవాలి. తగినంత ఉప్పు ఉండి
తడిలేకుండా ఉంటే ఈ పొడి కనీసం నెలరోజులు నిల్వ ఉంటుంది.

Thursday, January 25, 2007

చింతచిగురు పొడి

చింత చిగురు 100 gm
ధనియాలు 100 gm
ఎండుమిర్చి 5
వెల్లుల్లి 5 రేకలు
నూనె 1/4 కప్పు


చింతచిగురుని నలిపి పుల్లలు లేకుండా శుభ్రపరచాలి. బాండీలో నూనే
వేడి చేసి విడివిడిగా ఎండుమిర్చి, ధనియాలు, కర్వేపాకు, వెల్లుల్లి చివరలో
చింతచిగురు కూడా వేసి వేగనిచ్చి తీసి చల్లారనివ్వాలి. మొత్తం మిక్సీలో
వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. పులుపు సరిపోకుంటే కాస్త చింతపండు
రెక్కలు వేపి ఇందులో కలిపి పొడి చేసుకోవచ్చు.

గరం మసాలా


ధనియాలు 100 gm

యాలకులు 25 gm

లవంగాలు 25 gm

దాల్చిన 25 gm

షాజీర 25 gm


ధనియాలు కొద్దిగా వేపి అన్ని వస్తువులు కలిపి మెత్తగా పొడి చేసుకుని డబ్బాలో

దాచుకుని తడి తగలకుండా వాడుకోవాలి.ప్రతి కూరలో చివరగా చిటికెడు గరం

మసాలా చల్లితే సరి. మాంసాహారంలో కాస్త ఎక్కువగా వేయాలి.

Monday, January 22, 2007

ఉలవచారు



ఉలవలు 200 gm
చింతపండు పులుసు 3 tbsp
కరివేపాకు 2 tsp
నూనె 3 tbsp
పచ్చిమిర్చి4
ఉప్పు తగినంత
పసుపు 1/2 tsp
కొత్తిమిర 2 tsp

ఉలవలు శుభ్రపరచి కనీసం రెండుగంటలు నానబెట్టాలి. లేకపోతే రాత్రి నానబెట్టి
ఉదయం చేసుకుంటే సరి. నాలుగు గ్లాసుల నీళ్ళు పసుపు కాస్త నూనె వేసి
కుక్కర్లో మెత్తగా ఉడకబెట్టాలి. చల్లారిన తర్వాత మొత్తం మిశ్రమాన్ని గరిటతో
మెదిపి ఉప్పు చింతపండు పులుసు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు
మరగనిచ్చి కొత్తిమిర వేసి పోపు పెట్టాలి.

మకరందంతో జీవితం మధురం



తేనె ప్రకృతి ప్రసాదించిన దివ్యౌషధం.ఆరోగ్యప్రదాయినిగా, సౌందర్య సాధనంగా తేనెకి
ప్రాముఖ్యత ఉంది. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభ్యమయ్యే ఆహారపదార్థాలలో తేనె
ఉత్తమమైనది.ఎంతో పుష్టికరమైనది. తేనెకి ఉండే విశిష్ట లక్షణాలు అన్నీ ఇన్నీ కావు.
పసిపిల్లల నుంచి వృద్దుల వరకు అన్ని వయసులవారు తేనెని ఆస్వాదించవచ్చు.
ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. క్రమం తప్పకుండా ప్రతి రోజు తేనెని తీసుకుంటే
జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది. తేనెకి ఒక అరుదైన
గుణం ఉంది. రక్త నాళాల్లోకి త్వరగా ప్రవేశించి, రక్తంలో కలిసిపోయి సత్వరం శక్తిని
చేకూరుస్తుంది. వ్యాధుల నివారణలో, సౌందర్య పోషకత్వంలో తేనె విశిన్ష్టవంతమైనది.
పంచదార, బెల్లంకి బదులుగా తేనె వాడటం ఆరోగ్యకరం. పురుగుల్లాంటి కీటకాలు
కుట్టిన చోట మకరందాన్ని రాస్తే, త్వరగా ఉపశమనం లభిస్తుంది.గర్భిణీ స్త్రీలు
ప్రతిరోజూ తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయల్ని రోజుకొకటి చొప్పున తింటూ ఉంటే
పుట్టబోయే శిశువులకి ఎంతో బలవర్ధకం. అతిమూత్ర వ్యాధి ఉన్నవారు ప్రతిరోజు
రాత్రిపూట పడుకునే ముందు ఒక చెంచా తేనె పుచ్చుకుంటే, వ్యాధికి ఉపశమణం
లభిస్తుంది.ఓ కపు వేడినీటిలో రెండు చెంచాల తేనె కలిపి నెమ్మదిగా చప్పరిస్తుంటే
గొంతులో కఫం, దగ్గు తగ్గుతాయి.ప్రతిరోజు పరగడుపున రెండు ఔన్సుల తేనె
పుచ్చుకుంటే ఆరు నెలల్లో గుండె పని తీరు పెరిగి, దానికి పుష్టి చేకూరుతుంది.
వడదెబ్బ తగిలినప్పుడు తేనె నిమ్మరసం కలిపిన ద్రావణం ఎంతో
ఉపశమనాన్నిస్తుంది. ఓ కప్పు నీటిలో ఓ చెంచా తేనె కలిపి ప్రతిరోజు స్వీకరిస్తే
సుఖనిద్రపడుతుంది. అంతే కాదు అతిగా నిద్రని కూడా ఇది క్రమబద్ధం చేస్తుంది.
తేనెలో లవంగాన్ని అరగదీసి కళ్ళలో వేసుకుని ఓ కప్పు కాచిన పాలల్లో పటిక
బెల్లం,తేనెలు కలుపుకుని తాగితే ఎంతటి తీవ్రమైన తలనొప్పి అయినా ఇట్టే
తగ్గుతుంది. తేనెలో నీరుల్లిరసం కలిపి తాగితే శరీరచాయ కాంతివంతమవుతుంది.
గ్లాసు బార్లీ నీళ్ళలో రెండు చెంచాల తేనె కలిపి ప్రతిరోజు తాగితే సుఖవిరేచనం
అవుతుంది.టమోటా రసాన్ని, తేనెని కలిపి తీసుకుంటే రక్తశుద్ధి, వృద్ధి
అవుతుంది. తేనెలో కొంచెం మిరియాల చూర్ణం కలిపి సేవిస్తుంటే ఉబ్బసవ్యాధి
నయమవుతుంది.తేనె, పంచదార, ద్రాక్షరసం ఈ మూడింటిని సమభాగాలుంగా
కలిపి తీసుకుంటే అజీర్ణవ్యాధి తగ్గుముఖం పడుతుంది. అల్లపురసం,తేనె
సమభాగాలుగా కలిపి పుచ్చుకుంటే ఆకలి వృద్ధి అవుతుంది.తేనె,శొంఠిపొడి కలిపి
తీసుకుంటే గొంతునొప్పి, జలుబు,గొంతులో మంట నివారింపబడుతుంది. తేనెలో
కొంచెం కుంకుమపువ్వు వేసి రోజు సేవిస్తుంటే రక్త ప్రసరణ, రక్తవృద్ధి బాగా
జరుగుతుంది. చర్మానికి మెరుపు వస్తుంది. చల్లని నీటితో శుభ్రపరచుకొన్న
ముఖానికి తేనెపట్తించి పావుగంట తర్వాత కడిగేయాలి. దీనివల్ల ముఖం నునుపు
తేలుతుంది. వెంట్రుకలకు తేనె అంటుకుంటే అవి తెల్లబడాతాయనేది కేవలం
అపోహ మాత్రమే. పిల్లలకి ప్రతిరోజు అరచెంచా తాగిస్తే వారిలో రోగనిరోధక శక్తి
పెరుగుతుంది. జలుబు, ఇతర అలర్జీల నుంచి తప్పించికోవాలంటే ఉసిరిరసం,
తేనె కలిపి తీసుకోవాలి. తేనెలో పలు రకాల పోషకపాదార్థాలు మనకు లభిస్తాయి.
పిండిపాదార్థాలు, విటమిన్లు, మొదలగునవి. శరీరధర్మాల్ని నిర్వహించడానికి
ఉపయోగపడే ఖనిజధాతువులైన రాగి, మాంగనీస్, పొటాషియం,లాంటివి కూడా
తేనెతో లభిస్తాయి. ఎన్నెన్నో ఉపయోగాలున్న స్వచ్చమైన తేనె, అందాన్ని
ఆరోగ్యాన్ని సం రక్షించే వరదాయిని,మకన్రందాన్ని మనసారా ఆస్వాదించి దాని
వల్ల ఎన్నో ఉపయోగాలని అందుకుందాం. జీవనాన్ని మకరంద వాహినిలా
కొనసాగిద్దాం.

Friday, January 19, 2007

మీ సందేహం

మిగిలిపోయిన అన్నంతో చాల రకాలు చేయొచ్చు.fast to cook, category లో చూడండి.



ఇంకా సెనపపిండిని హిందీలో బేసన్ అంటారు, ఇంకా ఇంగ్లీషులో chickpea flour అంటారు.

మటన్ ఫ్రై


మాంసం 250 gm
ఉల్లిపాయలు 100 gm
పచ్చిమిర్చి 2
పసుపు 1/2 tsp
కారం పొడి 1 tsp
గరం మసాలా 1 tsp
కొత్తిమిర 1 tsp
కరివేపాకు 1 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
నూనె 4 tbsp

ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి తరిగిన
పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, పసుపు,కారం పొడి,కరివేపాకు వేసి కొద్దిగా వేపి మాంసం
ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి. నీరంతా
ఇగిరిపోయాక కప్పుడు నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి. మొత్తం కూరంతా
పొడి పొడిగా అయ్యేలా వేపి కొత్తిమిర,గరం మసాలా చల్లి కలిపి దింపేయాలి

రొయ్యల కూర


తాజా రొయ్యలు 250 gm
ఉల్లిపాయలు 100 gm
పచ్చిమిర్చి 6-8
పుదీన 1/2 కప్పు
కొత్తిమిర 1/2 కప్పు
అల్లం వెల్లుల్లి 2 tsp
గరం మసాలా 1 tsp
ఉప్ప్పు తగినంత
పసుపు 1/2 tsp
నూనె 4 tbsp

ముందుగా రొయ్యలు శుభ్రపరిచి ఉంచుకోవాలి. పచ్చిమిర్చి, పుదీనా కొత్తిమిర,
అల్లంవెల్లుల్లి కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి
సన్నగా తరిగిన ఉల్లిపాయలు దోరగా అయ్యేవరకు వేయించి ఈ ముద్దను,
పసుపు కూడా వేసి కొద్దిగా వేపి రొయ్యలు తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి
మూత పెట్టాలి. మసాలా బాగా వేగాకా గ్లాసుడు నీళ్ళు పోసి ఉడికించి నూనె
తేలగానే గరం మసాలా చల్లి దింపేయాలి.కావాలంటే రెండు పచ్చిమిర్చి తగ్గించి
కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు.

టొమాటో గ్రుడ్డు కూర


టొమాటోలు 250 gm
ఉల్లిపాయలు 1
పచ్చిమిర్చి 2
కరివేపాకు 1 tsp
అల్లం వెల్లుల్లి 1 tsp
కారం పొడి 1 tsp
పసుపు 1/4 tsp
గరం మసాలా 1/2 tsp
గ్రుడ్లు 2
నూనె 3 tbsp


ముందుగా ఉల్లిపాయ, టొమాటో లను సన్నగా తరిగి పెట్టుకోవాలి. బాణలిలో నూనె
వేడి చేసి ఉల్లిపాయలు వేసి గోధుమ వర్ణం వచ్చేవరకు వేపి పసుపు, కరివేపాకు,
పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేపి టొమాటోలు, కారం పొడి,
ఉప్పు అన్ని వేసి కలిపి మూత పెట్టాలి. ముక్కలు బాగా మగ్గిన తర్వాత గ్రుడ్లు
కొట్టి వేసి ఎక్కువ కలపకుండా మూత పెట్టాలి కొద్ది సేపు. అది ఉడికిన తర్వాత
గరం మసాలా చల్లి దించేయడమే.

Wednesday, January 17, 2007

సందేహాలు అడగండి

ఇందులో వంటకు, ఆహారము మొ//సందేహాలు అడగండి. చెప్పడానికి ప్రయత్నిస్తా.

Sunday, January 14, 2007

మిరపకోడి కూర


కోడి మాంసం 500 gm
పండుమిర్చి 6
ఉల్లిపాయలు 50 gm
అల్లం వెల్లుల్లి 2 tsp
లవంగాలు 4
జీలకర్ర 1/4 tsp
గరం మసాల 1/2 tsp
చింతపండు గుజ్జు 2 tbsp
ఉప్పు తగినంత
నూనె 50 gm

పండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ముద్ద,లవంగాలు, జీలకర్ర, కొన్ని ఉల్లిపాయల్ని
కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి తరిగిన
ఉల్లిపాయలను దోరగా వేయించండి. అ తర్వాత ఈ మసాలా ముద్దను కూడా వేసి
కొద్దిగా వేపి కోడిమాంసం ముక్కల్ని వేసి పసుపు తగినంత ఉప్పు వేసి బాగా
కలియబెట్టి మూత పెట్టి సన్నటి మంటపై ఉడికించండి. చికెన్ ఉడకగానే చింతపండు
గుజ్జు కొత్తిమిర వేసి కొద్దిసేపు ఉడికించి నూనె తేలగానే గరం మసాలా వేసి కలిపి
దింపేయండి. ఇది అన్నంతో గాని, చపాతితో గాని భలే ఉంటుంది.

పొంగలి పులిహోర


బియ్యం 300 gm
పెసరపప్పు 100 gm
పచ్చిమిర్చి 4
పసుపు 1/2 tsp
చింతపండుగుజ్జు 50gm
మినప్పప్పు 1 tsp
సెనగపప్పు 1 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/2 tsp
వేరుసెనగగుళ్ళు 3 tsp
ఎండుమిర్చి 5
కరివేపాకు 2 tsp
ఇంగువ చిటికెడు
నూనె 50 gm

ఒక గిన్నెలో బియ్యం, పెసరపప్పు కలిపి శుభ్రంగా కడిగి,ఓ పది నిమిషాలు నాననిచ్చి
స్టవ్ మీద పెట్టి కాస్త పొడిపొడిగా అయ్యేటట్టు వండుకోవాలి. ఈ అన్నాన్ని వెడల్పాటి
గిన్నెలో పరిచి పసుపు తగినంత ఉప్పు కాస్త నూనె వేసి కలపాలి.బాణలిలో నూనె
వేడి చేసి ఇంగువ వేసి , ఎండుమిర్చి,ఆవాలు,జీలకర్ర, మినప్పప్పు,సెనగపప్పు,
వేరుసెనగగుళ్ళు,కరివేపాకు వేసి దోరగా వేయించి చింతపండు పులుసు వేసి
ఉడికించి ఈ అన్నంలో వేసి బాగా కలియబెట్టి పదినిమిషాల తర్వాత ఆరగించండి.

Monday, January 08, 2007

కరివేపాకు పొడి

కరివేపాకు 1 కప్పు
ఎండుమిర్చి 4
జీలకర్ర 1 tsp
ధనియాలు 2 tsp
మినప్పప్పు 2 tsp
శనగపప్పు 2 tsp
వేరుశనగగుళ్ళు 4 tsp
తురిమిన పచ్చి కొబ్బరి 1/4 కప్పు
నెయ్యి 2 tsp
వెల్లుల్లి 5
చింతపండు 4 రెక్కలు
ఉప్పు తగినంత
నూనె 1 tsp


ముందుగా కరివేపాకును కడిగి ఆరబెట్టాలి. నూనె వేడి చేసి ఎండుమిర్చి, జీలకర్ర,
ధనియాలు, వెల్లులి రెబ్బలు, వేరుశనగగుళ్ళు, పప్పులు, చింతపండు అన్ని దోరగా
వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బాణలిలో కరివేపాకు కూడా కరకర లాడేలా
వేయించాలి. ఇవన్ని కలిపి తగినంత ఉప్పు వేసి పొడి చేసుకోవాలి. తర్వాత బాణలిలో
నెయ్యి వేడి చేసి ఈ పొడి, కొబ్బరి పొడి అన్ని కలిపి తడి ఆరిపోయి పొడి పొడిగా
అయ్యేదాకా వేయించి దింపేయాలి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వేడి అన్నంలో
మొదటి నాలుగు ముద్దలు ఈ పొడి వేసుకు తింటే ఆకలి పెరుగుతుంది. చపాతీ
బ్రెడ్ మీద కూడా వేసి తినొచ్చు.

రాజ్మా కూర


రాజ్మా 100 gm
ఉల్లిపాయలు 2
టొమాటోలు 4
పచ్చిమిర్చి 2
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
అల్లం వెల్లుల్లి 1 tsp
కొబ్బరిపొడి 2 tbsp
నూనె 4 tbsp
గరం మసాలా 1 tsp


ముందుగా రాజ్మా గింజలను కనీసం పది గంటలు నానబెట్టాలి. రాత్రి నానబెడితే
ప్రొద్దున చేసుకోవచ్చు. తర్వాత వాటిని రెండు గ్లాసుల నీళ్ళు పోసి తగినంత ఉప్పు
వేసి కుక్కర్లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. టోమాటోలు ముద్దగా రుబ్బి
పెట్టుకోవాలి. నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేయించాలి.
పసుపు,కారం పొడి, కరివేపాకు, అల్లంవెల్లుల్లి వేసి కొద్దిగా వేపి టోమాటో ముద్దను
కూడా వేపి ఉడికించిన రాజ్మ గింజలు, కొద్దిగా ఉప్పు కొబ్బరిపొడి గరం మసాలా
వేసి కలిపి మరో పది నిమిషాలు నూనె తేలేవరకు ఉడికించాలి. కొత్తిమిర చల్లి
దింపేయాలి. కావాలంటే ఇందులో బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు.

నిమ్మరసం పచ్చడి

నిమ్మరసం 250 ml
పచ్చళ్ళ కారం పొడి 25 gm
ఉప్పు 60 gm
పసుపు 1/2 tsp
జీలకర్ర పొడి 1 tsp
మెంతి పొడి 1/4 tsp
ఆవ పొడి 2 tsp
నూనె 50 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
ఎండుమిర్చి 3
ఇంగువ చిటికెడు


నిమ్మరసంలో ఉప్పు, కారంపొడి, పసుపు, జీలకర్రపొడి, మెంతి పొడి,
ఆవ పొడి అన్ని బాగా కలిపి ఉంచుకోవాలి. నూనె వేడి చేసి ఇంగువ,
ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కొద్దిగా వేపి ఈ మిశ్రమాన్ని వేసి
కొద్దిసేపు ఉడికించి దింపి చల్లారాక వాడుకోవాలి. ఈ పచ్చడి మరుసటి
రోజు తింటే కారం ఘాటు తగ్గుతుంది.

Sunday, January 07, 2007

అడగండిబాబు

అందరికీ నమస్కారం, నా బ్లాగును ఆదరిస్తున్నందుకు సంతోషం.మీకు కావల్సిన వంటకం గురించి ఇక్కడ చెప్పండి వీలైనంత త్వరగా ఆ వంటకాన్ని మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తా.

Saturday, January 06, 2007

చికెన్ రోస్ట్

చికెన్ 1 kg
ఉల్లిపాయలు 100 gm
అల్లం వెల్లుల్లి 2tsp
పసుపు 1tsp
ఎందుమిర్చి 8
గరం మసాలా 1 tsp
కొత్తిమిర 2 tsp
నూనె 50 gm

ముందుగా ఎండుమిరపకాయలు తొడిమలు తీసి అర కప్పుడు నీళ్ళలో నానబెట్టాలి
.అవి మెత్తబడిన తర్వాత మెత్తగా నూరి పెట్టుకోవాలి.నూనె వేడి చేసి తరిగిన
ఉల్లిపాయలు ఎర్రగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి,పసుపు, కారం ముద్ద వేసి కొద్దిగా
వేపి చికెన్ ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. చిన్న
మంటపై పూర్తిగా ఉడికేవరకు వేపి దింపేయాలి. నీరు పోయాల్సిన అవసరం ఉండదు.

మాంసం వేపుడు( మిరియాలపొడి )

మాంసం 250 gm
నూనె 50 gm
అల్లం వెల్లుల్లి 2 tsp
పసుపు 1/2 tsp
ఉల్లిపాయలు 2
మిరియాలపొడి 2 tsp


ముందుగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలను ఎర్రగా వేయించాలి. ఇప్పుడు
అల్లం వెల్లుల్లి కూడా వేసి కొద్దిగా వేపి మాంసం ముక్కలు, పసుపు, తగినంత
ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి అది బాగా వేగాక కప్పుడు నీళ్ళు పోసి ఉడికించాలి.
ఇప్పుడు మిరియాల పొడి వేసి కలిపి ఎర్రగా వేయించి దింపేయాలి.

మాంసం వేపుడు

మాంసం 250 gm
ఉల్లిపాయలు 3
పచిమిర్చి 2
కారం పొడి 2tsp
ధనియాలపొడి 2 tsp
గరం మసాల 1 tsp
కొబ్బ్బరి పొడి 2 tsp
గసగసాలు 1 tsp
అల్లం వెల్లుల్లి 1 tsp
నూనె 50 gm
పసుపు 1/2 tsp
ఉప్పు తగినంత

కొబ్బరి, గసగసాలు కలిపి, ముద్దగా నూరి పెట్టుకోవాలి.ఉల్లిపాయలు సన్నగా
తరిగాలి. మాంసం ముక్కలను కడిగి ఉప్పు,కారం, పసుపు, అల్లం వెల్లుల్లి అన్నీ
కలిపి ముక్కలకు పట్టించి రెండు గ్లాసుల నీళ్ళు పోసి పూర్తిగా ఉడికేవరకు ఉంచి
కొబ్బరి ముద్ద గరం మసాల పొడి వేసి కలిపి మళ్ళీ దగ్గర పడేవరకు ఉడికించాలి.
ఒక వెడల్పాటి బాణలిలో నూనే వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేపి
ఈ ముక్కలు మసాలాతో పాటు వేసి బాగా వేగిన తర్వాత కొత్తిమిర చల్లి దింపేయాలి.

Friday, January 05, 2007

చిట్కాలు

1. బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉంటే చారెడు ఉప్పు వేసి 10 నిమిషాలు
నాననిస్తే మట్టిగడ్డలు నీళ్ళలో కరిగిపోతాయి.

2. కూరలు తరిగేటప్పుడు కత్తిపీట క్రింద పాత పేపరు వేసుకుంటే, తరిగిన తొక్కలను
అలాగే పేపరుతో ఎత్తి బైట పారేయవచ్చు. లేకపోతే అనంతరం ఊడ్చుకోవడం
శ్రమ, టైం వేస్టూనూ.

3. కాయగూరల్ని ముందుగా నీటిలో శుభ్రంగా కడిగి, ఆ తరువాతనే తరగాలి.
అంతేగాని ముందుగా తరిగేసి,తరువాత కడగకూడదు.

4. ముందుగా కడిగినా కూడా అరటికాయ మొదలైనవాటిని తరిగి నీళ్ళలోనే
వేయాలి. ఇటువంటి కూరలు రెండుసార్లు శుభ్రపడవలసిందే.

5. కూరగాయముక్కల్ని పసుపు కలిపిన నీటిలో ఉంచితే ఏవైనా క్రిములు ఉంటే
అవి పైకి తేలిపోతాయి.

6. కూరలను మరీ సన్నగాను నాజూకుగానూ తరగకూడదు. అందువల్ల వాటిలోని
పోషకాంశాలు నశించే ప్రమాదముంది.

7. కొన్ని కూరలు తరిగేటప్పుడు చేతులు బంకగానో, పొరలు గానో వచ్చేస్తూనో
ఉంటాయి అరటి పనస వంటి కూరలు.తరిగేముందు చేతులకు కొంచెం నూనె
రాసుకుని తరిగితే ఆ విధంగా జరగదు.

8. కంద పెండలం వంటివి తరిగేటప్పుడు చేతుల్ని చింతపండు రసంలో
తడుపుకుంటే దురదలు పుట్టవు.

9. తరిగిన కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పు వేసి నలిపితే చేదు తగ్గుతుంది.

10. బంగాళాదుంపలు మెత్తబడినట్లయితే తరగబోయేముందు వాటిని ఒక అర
గంట ఐస్ వాటర్లో ఉంచితే గట్టిపడతాయి.

12. వంకాయలు, అరటికాయలు తరిగేటప్పుడు కొంచెం పెరుగు కలిపిన నీళ్ళలోకి
తరిగితే కనరెక్కకుండా ఉంటాయి.

13. వంకాయ ముక్కల్ని బియ్యం కడిగిన నీళ్ళలోకాని, ఉప్పు వేసిన నీళ్ళలో వేస్తే
కనరెక్కకుండాను, నల్లబడకుండానూ ఉంటాయి.

14. అరటిపువ్వును దంపేటప్పుడు పసుపు వేసి దంపితే నల్లబడదు.

15. ఉల్లిపాయలను ఒక అరగంట సేపు నీళ్ళలో నాననిచ్చి, ఆ తర్వాత తరిగితే
కళ్ళమ్మట నీళ్ళు రావు.లేదా ఫ్రిజ్లో పెట్టి తీసినా సరే.

16. కాలిఫ్లవర్ ను ఎప్పుడుగానీ చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు వేసిన గోరువెచ్చటి
నీళ్ళలో వేసి కొద్ది సేపు తర్వాత తీసి వండుకోవాలి. ఇలా చేస్తే అందులోని
క్రిములు చచ్చిపోతాయి.

17. ఉల్లిపాయ తరిగేటప్పుడు రెండువైపులా కోసి మధ్యకి తరిగితే పైనున్న పొర
త్వరగా వచ్చేస్తుంది.

18. వెల్లుల్లికి కొద్దిగా నూనె రాసి కొద్దిసేపు ఎండలో బెడితే పొట్టు తేలిగ్గా వస్తుంది.

19. నిమ్మకాయను నేలమీద పెట్టి అరచేత్తో అదిమి కాస్త మెత్తబడ్డాక కోస్తే రసం
పిండటం తేలికగా ఉంటుంది ఎక్కువ వస్తుంది కూడా.

20. పగిలిన గ్రుడ్డును కొంచెం వెనిగర్ కలిపిన నీళ్ళలో ఉడకబెడితె లోపలి ద్రవం
బైటకు రాకుండా బాగా ఉడుకుతుంది.

21. గ్రుడ్లను ఉడకబెట్టిన తర్వాత వెంటనే చన్నీళ్ళలో ఉంచితే పైపెంకు
ఒలవడం తేలికవుతుంది.

22. ఉడికిన గ్రుడ్లను చన్నీళ్ళలో ముంచిన కత్తితో కోస్తే బాగా తెగుతాయి.

23. కోడిగ్రుడ్లను అల్యూమినియం, లేదా వెండిపాత్రలలో పగలగొడితే
అందులోని సల్ఫర్ కారణంగా పాత్రలు నల్లబడతాయి.

24. తడిగా ఉన్న పాత్రలలోకి పగలగొడితే గ్రుడ్డులోని పసుపు భాగం పాత్రకు
అంటుకోకుండా ఉంటుంది.

25. ఆమ్లెట్లు వేసేముందు గిన్నెలో ఉప్పు కారం మసాలా అన్నీకలిపి కొద్దిగ
నీరుపోసి కలిపిన తర్వాత గ్రుడ్లను కొట్టి కలిపితే అవి సమానంగా కలుస్తాయి.

Tuesday, January 02, 2007

అందం-చందం పుదీనా




వంటకాల్లో రుచికోసం, వాసన కోసం సాధారణంగా పుదీనాను ఉపయోగిస్తుంటాం.
కానీ వాస్తవంగా పుదీనాలో ఆరోగ్యాన్ని కలిగించే ఔషధాలే కాకుండా సౌందర్య
పోషణకు కావాల్సిన లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.



* పుదీనాలో క్లోరోఫిల్ లో యాంటీసెప్టిక్ కెమికల్స్ ఉండడం చేత అవి నోటిలోని
క్రీములను నశింపజేసి చిగుళ్ళను గట్టిపరుస్తాయి.

* నోరు దుర్వాసన వేస్తుంటే ప్రతిరోజూ నాలుగైదు పుదీనా ఆకులను నములుతుండాలి.
* పుదీనా ఆకులను నీళ్ళలో మరిగించి పుక్కిలిస్తే చిగుళ్ళ వాపు తగ్గి రక్తం
కారడం ఆగిపోతుంది.
* పుదీనా కషాయంలో తేనె కలిపి తీసుకుంటే జీర్ణక్రియ సాఫీగా జరిగి ఆకలి
బాగా వేస్తుంది.
* వేసవిలో పుదీనా నమలడంవల్ల డీహైడ్రేషన్ నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు.
* పరగడుపున కొన్ని పుదీనా ఆకులను నమిలి తింటే కడుపులో ఉండే నులి
పురుగులు నశించడమే కాకుండా మలవద్దకం నుండి ఉపశమనం కలుగుతుంది.



* పుదీనా ఆకులను కళ్ళపై పెట్టుకుంటే కళ్ళ మంట, నీరు కారడం తగ్గుతుంది.
* గొంతు బొంగురుపోతే పుదీనా డికాక్షన్లో ఉప్పు కలుపుకుని పుక్కిలిస్తే గొంతు తిరిగి
మామూలు స్తితికి చేరుకుంటుంది.

* పుదీనా తినడంవల్ల ఒంట్లో వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇస్తుంది.
* కడుపులో ఉబ్బరంగా ఉంటే పుదీనా, సోంపులను కలిపి నీటిలో మరిగించి వడపోసి
తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.

* ఆహార పదార్థాలపై క్రిములు వాలకుండా పరిశుభ్రమైన వస్త్రాన్ని కప్పి దానిపై
పుదీనా రసాన్ని అద్దాలి.

* పెరట్లో పుదీనా పెంచడంవల్ల మిగతా చెట్లకు చీడ పట్టకుండా ఉంటుంది.
* నీటిలో పుదీనా ఆకులను వేసి స్నానం చేస్తే రక్తప్రసరణ బాగుండడమే కాకుండా శరీరం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది.
* పుదీనా ఆకును మరిగించిన నీటితో ముఖాన్ని రోజూ కడుగుతుంటే ముఖచర్మం కాంతివంతంగా తయారవుతుంది.
* తరచుగా పుదీనా రసాన్ని పెదవులకు రాసుకుంటే అవి మృదువుగా ఎర్రగా మరుతాయి.
* కాళ్ళ పగుళ్ళకు పుదీనా డికాషన్ రాస్తే త్వరగా నయమవుతాయి. * పుదీనా అకుల రసాన్ని ముఖానికి రుద్దుకుంటే మొటిమలు, మచ్చలు ఇట్టే మాయమవుతాయి.



Monday, January 01, 2007

గుమ్మడికాయ సెనగపప్పు కూర


గుమ్మడికాయ 250 gm
సెనగపప్పు 100 gm
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 3
పసుపు 1/4tsp
కారం పొడి 1tsp
ఉప్పు తగినంత
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
అల్లం వెల్లుల్లి 1 tso
నూనె 3 tsp


ముందుగా గుమ్మడికాయ చెక్కు తీసి చిన్న ముక్కలు చేసి పెట్టుకోవాలి.
సెనగపప్పును నీళ్ళు పోసి నానబెట్టాలి ..వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి
తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తబడేవరకు వేయించి పసుపు
అల్లం వెల్లుల్లి, కరివేపాకు,కారం,వేసి కొద్దిగా వేపి నీరు తీసేసిన పప్పును వేసి
తడి ఆరిపోయేవరకు వేపాలి. తర్వాత గుమ్మడికాయ ముక్కలు వేసి తగినంత
ఉప్పు వేసి కలిపి మూత పెట్టాఅలి. చిన్న సెగపై ఉడకనివ్వాలి. అవసరమైతే
కప్పుడు నీళ్ళు పోయాలి. ఉడికిన తర్వాత కొత్తిమిర చల్లి దింపేయాలి.

ముద్దపప్పు


కందిపప్పు
లెదాపెసరపప్పు 200 gm
పచ్చిమిర్చి 3
ఉల్లిపాయ 1
జీలకర్ర 2 tsp
వెల్లుల్లి 5
పసుపు 1/2 tsp
ఉప్పు తగినంత
నూనె 1 tsp
నెయ్యి 1 tsp
ఆవాలు 1/4tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp


ముందుగా పప్పు కడిగి కుక్కర్లో వేసి తగినన్ని నీళ్ళు పోసి, పసుపు, కొద్దిగా
నెయ్యి వేసి 4-5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. 1 1/2 tsp జీలకర్ర, వెల్లుల్లి
కలిపి దంచి పెట్టుకోవాలి. చల్లారిన పప్పులో ఈ ముద్ద, ఉప్పు, తరిగిన కొత్తిమిర
వేసి కలిపాలి. నూనె,నెయ్యి కలిపి వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాకా
తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేపి ఈ పప్పులో
వేసి కలిపి మూత పెట్టాలి.

పాలకూర పప్పు


కందిపప్పు 200 gm
సెనగపప్పు 50 gm
ఉల్లిపాయ 1
పాలకూర 2 కట్టలు
పచ్చిమిర్చి 3
పసుపు 1/2 tsp
కారం పొడి 1 tsp
ఉప్పు తగినంత
వెల్లుల్లి 5 రెబ్బలు
చింతపండుపులుసు 2 tbsp
కరివేపాకు 2 tsp
అల్లం వెల్లుల్లి 1 tsp
నూనె 2 tsp
నెయ్యి 1 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/2 tsp
ఎండు మిర్చి 2

ముందుగా కందిపప్పు, సెనగపప్పు, కడిగి కుక్కర్లో వేసి తగినన్ని నీళ్ళు పోసి పసుపు,
అర స్పూను నెయ్యి వేసి రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి దింపేయాలి.తర్వాత
ఇందులో తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పాలకూర, ఉప్పు, కారం, చింతపండు
పులుసు, అల్లం వెల్లుల్లి ముద్ద అన్నీ వేసి కలిపి మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఇంకో
మూడు విజిల్స్ వచ్చేవరకు ఉంచి దింపేయాలి. చల్లారిన తర్వాత నూనె మిగిలిన
నెయ్యి కలిపి వేడి చేసి ఆవాలు, జీలకర, ఎందుమిర్చి వేసి చిటపటాలాడాకా
వెల్లుల్లి రెబ్బలు వేసి ఎర్రబడ్డాక ఈ పప్పులో కలపాలి. అంతే ఘుమ ఘుమలాడే
పాలకూర పప్పు రెడీ.