Featured Posts
మసాలావడ

శనగపప్పు 200 gm
పచ్చిమిర్చి 4
ఉల్లిపాయ 1
కరివేపాకు ౨2రెబ్బలు
ఎదైనా ఆకుకూర 1 కప్పు
ఉప్పు తగినంత
పసుపు చిటికెడు
నూనె వేయించడానికి
శనగపప్పును రెండుగంటలపాటు నానబెట్టి , నీరు పోయకుండా గట్టిగా బరకగా
రుబ్బుకోవాలి. అందులో సన్నగా తరిగిన ఆకుకూర,ఉల్లిపాయ,పచ్చిమిర్చి,
కరివేపాకు,తగినంత ఉప్పు,పసుపు వేసి బాగా కలియబెట్టాలి. నూనె వేడి
చేయాలి. పప్పు ముద్దను చిన్న ఉండలు చేసుకుని మన అరచేతిపై కాని పాల
కవరుపైకాని వెడల్పుగా చేసి నూనేలో వేసి రెండువైపులా ఎర్రగా కాల్చి తినాలి.
ఆలూ బోండా

బంగాళదుంపలు 250 gm
ఉల్లిపాయలు 1
పచ్చిమిరపకాయలు 4
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 tsp
ఉప్పు తగినంత
పసుపు 1/4 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
నూనె 3 tsp
శనగపిండి 200 gm
ఉప్పు తగినంత
కార0 1 tsp
ధనియాలపొడి 2 tsp
వంట సోడా చిటికెడు
నూనె వేయించడానికి
శనగపిండిలో ఉప్పు, కారం, ధనియాలపొడి, వంటసోడా, నీళ్ళూ కలుపుతూ
గరిటజారుగా ఉండలులేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి.
౨ స్ఫునుల నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు,
సన్నగా తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిరపకాయముక్కలు,పసుపు వేసి మెత్త
బడేవరకు వేయించాలి.ఇప్పుడు ఉడికించి పొడి చేసి పెట్టుకున్న బంగాళదుంప
ముక్కలు,తగినంత ఉప్పు,కరివేపాకు వేసి కలిపి మూతపెట్టాలి.కొద్దిసేపు తర్వాత
కొత్తిమిర చల్లి దింపి చల్లారనివ్వాలి.
బంగాళదుంప కూరను చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. నూనె వేడి చేసి
ఒక్కొక్క ఉండను శనగపిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి ఎర్రగా కాల్చి వేడి
వేడిగా వడ్డించాలి.
మిరపకాయ బజ్జీ

లావు మిరపకాయలు 250 gm
శనగపిండి 250 gm
ఉప్పు తగినంత
కారం 1 tsp
గరం మసాలా 1 tsp
ధనియాల పొడి 2 tsp
వంట సోడా చిటికెడు
నూనె వేయించడానికి
పుదీనా 1/2 cup
నువ్వులు 1/4 cup
పచ్చిమిర్చి ౩
చింతపండు పులుసు 2 tbsp
మిరపకాయలను నిలువుగా చీల్చి గింజలు తీసేయాలి. మరిగే నీటిలో కొద్దిసేపు ఉంచి తేసేస్తే
కారం తగ్గుతుంది. నువ్వులు,పచ్చిమిర్చి, పుదీనా కాస్త వేయించి చింతపండు పులుసు కలిపి
మెత్తగ నూరి పెట్టుకుని మిరపకాయలలో కూరి పక్కన పెట్టుకోవాలి. శనగపిండిలో తగినంత
ఉప్పు,కారం, గరమ్ మసాలా, ధనియాలపొడి, వంట సోడా వేసి నీళ్ళు కలుపుతూ గరిటజారుగా
ఉండలు లేకుండా కలిపి అర గంట అలా ఉంచాలి. మళ్ళీ కలిపి కూరి పెట్టుకున్న మిరపకాయలను
ఒక్కొక్కటిగా వేడి నూనెలో ఎర్రగా కాల్చి వేడి వేడిగా టొమాటో సాస్ కాని ఆవకాయతో కాని తింటే
సూపర్‍గా ఉంటుంది.
కావాలాంటే మిరపకాయలలో కస్త వాము,చింతపండు పులుసు,ఉప్పు,కొబ్బరిపొడి కలిపి రుబ్బి
మిరపకాయలలో కూరొచ్చు.లేదా ఇంట్లో ఉన్న ఎదైనా పచ్చడి,చింతకాయపచ్చడి లాంటిది కూడా
కూరి పిండిలో ముంచి చేసుకోవచ్చు. బంగాళదుంప కూర చేసి అది కూడా మిరపకాయలలో కూరి
బజ్జీలు చేసుకోవచ్చు. అప్పుడు మిరపకాయలు చాలా లావుగా వస్తాయి.
రాగి అట్టు

మినప్పప్పు 100 gm
బియ్యపు పిండి 75 gm
రాగిపిండి 200 gm
పచ్చిమిరపకాయలు 4
నెయ్యి అర కప్పు
ఉప్పు తగినంత
మినప్పప్పును నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పు,
బియ్యపు పిండి, రాగిపిండి అన్నీ కలుపుకొని ఒక రాత్రంతా పిండిని పులవనివ్వాలి.
తెల్లవారి వేడి పెనం మీద దీనిని కొద్దిగా మందంగా అట్టు పోసుకోవాలి. ఒక వైపు
ఎర్రగా కాల్చి రెండవవైపు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా
కాల్చుకోవాలి. దీనికి కొబ్బరి పచ్చడి మంచి కాంబినేషన్.
పుల్లట్టు


బియ్యపు పిండి 250 gm
మైదా 100 gm
గడ్డపెరుగు 100 gm
జీలకర్ర 1 tsp
పచ్చిమిరపకాయలు 3
ఉల్లిపాయలు 1
వేరుశనగపప్పు 50 gm
నెయ్యి అర కప్పు
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 tsp
గడ్డపెరుగు బాగా చిలికి అందులో కొన్ని నీళ్ళు,కొద్దిగా ఉప్పు ,సన్నగా తరిగిన ఉల్లిపాయ
ముక్కలు,పచ్చిమిరపకాయ ముక్కలు, జీలకర్ర, వేరుశనగపప్పు, బియ్యపు పిండి,
మైదా వేసి ఉండలు లేకుండా మృదువుగా కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని సుమారు
నాలుగైదు గంటలపాటు పులవనిచ్చి ఆ తరువాతే అట్టు పోసుకోవాలి. అట్ల పెనం మీద
కాని గుంటల పెనం మీద కాని దీనిని కావలసిన పరిమాణములో పోసుకొని నెయ్యితో
కాల్చుకోవాలి. పిండి ఎంత పులిస్తే అంత రుచిగా ఉంటుంది.
సీమపురి అట్టు
బియ్యం 500 gms
ఉప్పుడు బియ్యం 500 gms
మినప్పప్పు 200 gms
పచ్చి శనగపప్పు 25 gms
మెంతులు 10 gms
ఉప్పు తగినంత
నూనె సరిపడ
ఉల్లిపాయలు 150 gms
అల్లం అంగుళం ముక్క
జీలకర్ర 1 tbsp
కారం పొడి 1 tsp
నిమ్మరసం 2 tsp
ఉప్పు తగినంత
పైన అలంకరించే వస్తువులలో నిమ్మరసం తప్పించి మిగతా అన్ని పదార్థాలను కలిపి
మెత్తగా రుబ్బుకోవాలి. ఆ తరువాతే నిమ్మరసం కలపాలి.
రెండు రకాల బియ్యాన్ని, మినప్పప్పు, శనగపప్పు, మెంతులు అన్నీ నాలుగైదు
గంటలపాటు నానబెట్టుకోవాలి. తరువాత మెత్తగా ,కొంచం గట్టిగా రుబ్బుకోవాలి.
దోసెను కొద్దిగా మందంగా పోసుకొని దాని మీద ముందుగా తయారుచేసుకున్న
మిశ్రమాన్ని పల్చగా చల్లి నెయ్యి వేసి ఒక వైపు ఎర్రగా కాల్చి, రెండో వైపు కొద్దిగా
కాల్చుకుంటే సరిపోతుంది.దీనికి చట్నీ లేకపోయినా బావుంటుంది.
దిబ్బరొట్టె
మినప్పప్పు 250 gm
బియ్యపురవ్వ 150 gm
ఉప్పు సరిపడ
నూనె 1/2 cup
మినప్పప్పును శుభ్రం చేసుకున్న తరువాత మూడు గంటలపాటు నానబెట్టి
మెత్తగా రుబ్బుకోవాలి. ఎక్కువ నీరు పోయకూడదు. రుబ్బిన ముద్దలో
బియ్యపు రవ్వను కలిపి తగినంత ఉప్పు కూడా కలిపి అవసరమనుకుంటే
కొద్దిగా నీరు కలుపుకోవాలి.మందపాటి బాణలిలో నూనె కొద్దిగా ఎక్కువ వేసి
అట్టు పోసుకోవాలి. తరువాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. దీనిని
వేరుశనగపప్పు చట్నీతో తింటే రుచిగా ఉంటుంది. బ్రెడ్ ఎలా ఉంటుందో
దిబ్బరొట్టె అంత మందంగా ఉంటుంది.
చల్లట్టు

బియ్యపు పిండి 200 gm
మైదా లేక గోధుమపిండి 100 gm
పచ్చిమిరపకాయలు 3
జీలకర్ర 1 స్పూను
కొత్తిమిర 1 tsp
మజ్జిగ 100 gm
ఉప్పు తగినంత
నూనె సరిపడ
బియ్యపు పిండి, మైదా లేదా గోధుమపిండి, తగినంత ఉప్పు వేసి మజ్జిగతో కలుపుకోవాలి
దోసె మాదిరిగా గరిటెజారుగా కాకుండా కొద్దిగా చిక్కగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రెండు
గంటలు నాననిచ్చి అట్టు వేసే ముందు అందులో జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ
ముక్కలు,కొత్తిమిర వేసి బాగా కలిపి మందంగా అట్టు పోసుకోవాలి. నూనె వేస్తూ రెండువైపులా
ఎర్రగా కాల్చుకోవాలి. వేడివేడిగా ఏ చట్నీతో వడ్డిస్తే సరి.
అట్లు

"పుల్లనీ పుల్లట్టు పంటికందగానే జివసచ్చిన జిహ్వకే జీవమొచ్చెరా" అంటూ సినీకవి
పాటకోసం పదాలు కట్టాడేమోగాని నిజంగానే అట్టురుచి అమోఘం. కొన్ని పులిసిపోతే
రుచిలో వెలిసిపోతాయంటారు. అట్లు మాత్రం రోజు మారే కొద్దీ తీరు మార్చుకుంటాయి.
ఆబగా తినమంటాయి. మామూలు పచ్చళ్ళు, సాంబారు దేంట్లోకయినా కమ్మగా
వుంటాయి. అట్లకాడ కనికట్టు చేస్తుందో, పెనం మాయ చేస్తుందో తెలియదు గాని
అట్లు మాత్రం అద్భుతం.
దక్షిణాది రాష్ట్రాలలో బియ్యం, మినప్పప్పుతో కలిపి చేసుకునే వెరైటీలలో దోసెకే
ప్రధమస్థానం. కన్నడీయులు, తమిళులు,ఆంధ్రులు అందరూ ఏకగ్రీవంగా పిలుచుకునే
దోసె అంటే ఆబాలగోపాలానికి ప్రియమే. దోసెతో పాటు మన రాష్ట్రంలో చేసుకునే మరో
వెరైటీ అట్లు. దోసెకి, అట్టుకి తయారీ విధానంలో కొద్దిపాటి తేడాతో పాటు అట్టు కొద్దిగా
మందంగా రెండువైపులా దోరగా కాలి నోరూరిస్తూ వుంటుంది. వీతన్నింటిలోకి
దిబ్బరొట్టె ఆంధ్రప్రదేశ్‍లోని పలు ప్రాంతాలలో చాలా ఫేమస్.చాలా రుచిగా ఉండడమేగాక
ఒక్కటి తిన్నా కడుపు నిండిపోతుంది. నిప్పులమీద మందపాటి గిన్నెలో తయారుచేసే
ఈ రొట్టెను ఆధునికులకన్నా సంప్రదయవాదులు ఎక్కువగా ఇష్టపడతారు. ఒక్కొక్క
ప్రాంతంలో ఒక్కో అట్టు ప్రత్యేకతను సంతరించుకుంది.
కరివేపాకు, కొత్తిమిర పచ్చడి

కొత్తిమిర - నాలుగు కట్టలు
కరివేపాకు - ౩ కట్టలు
పచ్చిమిరపకాయలు - ౪
చింతపండు పులుసు - ఒకటిన్నర స్పూను
ఉప్పు - తగినంత
నూనె - రెండు స్పూన్లు
కొత్తిమిర, కరివేపాకు రెండింటిని సన్నగా తరిగి పచ్చిమిరపకాయలు,ఉప్పు, చింతపండు
పులుసు కలిపి మెత్తగా రుబ్బి ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి పోపు దినుసులతో
తాలింపు పెట్టి అందులో రుబ్బిన పచ్చడి వేసి కలిపి రెండు నిమిషాలపాటు సన్నని సెగమీద
అలాగే ఉంచండి.ఆ తర్వాత వేడివేడి దోసెలతో వడ్డించండి.
పుదీనా పచ్చికొబ్బరి పచ్చడి

పుదీనా - రెండు కట్టలు
పచ్చికొబ్బరి - అర చిప్ప
పచ్చిమిర్చి - మూడు
చింతపండు పులుసు - రెండు స్పూన్లు
ఉల్లిపాయ - ఒకటి
ఉప్పు - తగినంత
నూనె - రెండు స్పూన్లు
ముందుగా పుదీనా అకులను కోసి, ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
బాణలిలో ఒక స్పూను నూనె వేడి చేసి అందులో పుదీనా, ఉల్లిపాయ ముక్కలు,
పచ్చిమిరపకాయల్ని వేసి వేయించి సన్నటి సెగ మీద బాగా మగ్గనివ్వండి. తర్వాత
దీనికి ఉప్పు, చింతపండు పులుసు, కొబ్బరి ముక్కల్ని కలిపి మెత్తగా రుబ్బి,పోపు
దినుసులతో తాలింపు పెట్టి దోసెలతో తినండి.
టొమాటో పచ్చడి

టొమాటోలు - ఆరు
ఉల్లిపాయలు - రెండు
ఉప్పు - తగినంత
కారం - అర స్పూన్
పసుపు - చిటికెడు
అల్లం వెల్లుల్లి - ఒక స్పూన్
ఆవాలు - పావు స్పూన్
జీలకర్ర - అర స్పూన్
కరివేపాకు - ఒక రెబ్బ
నూనె - రెండు స్పూన్లు
టొమాటోలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీలో మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు బాణలిలో
నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు రుబ్బిన ముద్ద వేసి
పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలియబెట్టి నిదానంగా నూనె
తేలేవరకు ఉడికించాలి.
గోల్డెన్ దోసె

బియ్యం - నాలుగు కప్పులు
మెంతులు - అర టీ స్పూన్
పెసరపప్పు - అర కప్పు
మినపప్పు - ఒక కప్పు
శనగపప్పు - అర కప్పు
పప్పులు, బియ్యం కలిపి కడిగి మెంతులు వేసి కనీసం నాలుగు గంటలు నానబెట్టాలి.
తరువాత మెత్తగా రుబ్బి ఎనిమిది గంటలన్నా అలా ఉంచాలి. తగినంత ఉప్పు వేసి
కలిపి పలుచగా దోసెలు వేయాలి. కరకరలాడే దోసె రెడీ.
ఎగ్ దోసె

మినప్పప్పు 1 కప్పు
బియ్యం 3 కప్పులు
మెంతులు 1 tsp
ఉప్పు తగినంత
మిరియాలపొడి 3 tsp
గ్రుడ్లు 3
నూనె 1/2కప్పు
బియ్యం,పప్పు,మెంతులు కలిపి ఆరుగంటలపాటు నానబెట్టి మెత్తగా రుబ్బి, ఉప్పు కలిపి
రాత్రంతా ఉంచాలి. గ్రుడ్లు ఉప్పు కలిపి బాగా గిలక్కొట్టి ఉంచుకోవాలి. లేదా అలానే కొట్టి
వేసుకోవచ్చు. వేడి పెనంపై దోసె వేసుకుని దానిపై గ్రుడ్డు కొట్టివేసి లేదా గిలక్కొట్టిన
మిశ్రమం వేసి నిదానంగా కాలనివ్వాలి.పైన చిటికెడు మిరియాల పొడి చల్లి రెండో వైపు
కూడా ఎర్రగా కాల్చి తినాలి.
తీపి దోసె

గోధుమ పిండి 4 కప్పులు
బియ్యపు పిండి 1 కప్పు
బెల్లం 2 కప్పులు
తాజా కొబ్బరి తురుము 1/2 కప్పు
యాలకుల పొడి 1 tsp
నెయ్యి 1/2 కప్పు
బియ్యం పిండి,గోధుమ పిండి రెండింటిని బాగా కలిపి ఉంచుకోవాలి. బెల్లాన్ని
నాలుగు కప్పుల నీటిలో వేసి వేడి చేయాలి. కాష్త చల్లారాక అందులో పిండి
మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా కలపాలి.ఇందులో తురిమిన కొబ్బరి,
యాలకుల పొడి వేసి బాగా కలియబెట్టాలి. వేడి పెనంపై నెయ్యి వేసి దోసెలు
వేసుకుని వేడి వేడిగా తినాలి.పిల్లలకు ఈ దోసెలతో జాం కలిపి ఇస్తే ఇష్టంగా
తింటారు.
గోధుమరవ్వ- మైదా దోసె

నానబెట్టిన గోధుమరవ్వ 2 కప్పులు
మైదా 2 కప్పులు
బియ్యపుపిండి 1/2 కప్పు
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 3
పుల్లటి పెరుగు 1 కప్పు
ఉప్పు తగినంత
కొత్తిమిర 2 tsp
గోధుమరవ్వ, మైదాలను 4 కప్పుల నీటిలో కలిపి 2 గంటలపాటు నానబెట్టాలి.
తర్వాత సన్నగ తరిగిన ఉల్లిపాయ,కొత్తిమిర,పచ్చిమిర్చి,పెరుగు,ఉప్పు వేసి
బాగా కలియబెట్టాలి. వేడి పెనంపై దోసెలు పోసుకుని టోమేటో సాస్‌తో వడ్డిస్తే
చాగా బావుంటుంది.
పేపర్ దోసె

మినప్ప్పప్పు 1/2 కప్పు
బియ్యం 4 కప్పులు
ఉప్పు తగినంత
జీలకర్ర 1 tsp
నూనె 1/2 కప్పు
మినప్పప్పు, బియ్యాన్ని విడివిడిగా ఆరుగంటలపాటు నానబెట్టాలి.తరువాత
విడిగానే మెత్తగా రుబ్బుకుని మరీ పలుచగా కాకుండా చేసుకుని రెండు
మిశ్రమాలను బాగా కలిపి తగినంత ఉప్పు వేసి రాత్రంతా వుంచాలి. జీలకర్రను
ముద్దగా చేసి రాత్రంతా నానిన మిశ్రమానికి కలిపి వేడి పెనంపై పేపర్‌లా పలుచగా
ఉండేలా దోసెలను వేసుకుని సన్నని సెగపై బంగారు రంగు వచ్చేవరకు కాల్చి
చట్నీ, సాంభార్‌తో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.
సెట్ దోసె

మినప్పప్పు 1 కప్పు
బియ్యం 3 1/2 కప్పులు
అటుకులు 1/2 కప్పు
ఉప్పు తగినంత
కరివేపాకు 2 రెబ్బలు
నూనె 1/2 కప్పు
మినప్పప్పు,బియ్యం,అటుకులు కలిపి ఆరుగంటలు నానబెట్టాలి. తరువాత మెత్తగా
రుబ్బి తగినంత ఉప్పు కలిపి చిన్న పరిమాణములో కాస్త మందంగా దోసెలు చేసుకుని
పైన తరిగిన కరివేపాకు వేసి కొబ్బరి చట్నీ,ఖుర్మాతో వడ్డించాలి.ఈ దోసెలకు కాస్త
నూనె ఎక్కువగా ఉంటేనే బావుంటుంది.
మైసూర్ మసాలా దోసె

మినప్పప్పు 2 కప్పులు
శనగపప్పు 2 కప్పులు
బియ్యం 1/4 కప్ప్పు
ఉప్పు తగినంత
ఎండుమిర్చి తగినన్ని
మసాలా దినుసులు
పసుపు 1/4 tsp
ఉడికించిన బఠాణీలు 1/2 కప్పు
పచ్చిమిర్చి 3
అల్లం చిన్న ముక్క
ఆవాలు 1/4 tsp
మినప్ప్పప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
కరివేపాకు 1 రెబ్బ
నూనె 2tbsp
బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసి కొద్దిగా వేపి సన్నగా
తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇప్పుడు తరిగిన
పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా వేపి బఠానీలు,తగినంత
ఉప్పు వేసి బాగా కలియబెట్టి దోసెలతో కలిపి తినాలి.
బియ్యం,పప్పులు విడివిడిగా కనీసం ఆరుగంటలు నానబెట్టి తరువాత మెత్తగా రుబ్బి,
తగినంత ఉప్పు, ఎండుమిరపకాయలు కలిపి మళ్ళీ రుబ్బుకోవాలి. పిండిని బాగా
కలియబెట్టి గరిటజారుగా చేసుకుని వేడి పెనంపై కొంచెం నూనె వేసి దోసెలు చేసుకుని
ముందు చేసిన కూరతో కలిపి వడ్డించాలి.
కీర దోసకాయ దోసె

మినప్పప్పు 1 గ్లాసు
బియ్యం 3 గ్లాసులు
మెంతులు 1/2 tsp
దోసకాయ గుజ్జు 1 కప్పు
ఉప్పు తగినంత
చట్నీ పొడి 2 tsp
కొత్తిమిర 2 tsp
మచ్చిమిరపకాయలు 2
నూనె సరిపడ
మినప్పప్పు, బియ్యం, మెంతులు కలిపి కనీసం ఆరుగంటలు నానబెట్టి మెత్తగా
రుబ్బుకోవాలి. ఇందులో కీరదోసకాయ గుజ్జుని కలిపి నాలుగు గంటలు పులియ
నివ్వాలి. తరువాత తగినంత ఉప్పు వేసి గరిటజారుగా కలుపుకుని వేడిపెనంపై
పలుచగా దోసెలు పోసుకుని చట్నీపొడి, కొత్తిమిర, సన్నగా తరిగిన పచ్చి
మిరపకాయ ముక్కలు వేసి రెండవవైపు కాల్చకుండా మడిచి తినేయడమే.
రవ్వ దోసె

బొంబాయిరవ్వ 1/4 kg
శనగపిండి 1/4 kg
బియ్యం పిండి 1/4 kg
మజ్జిగ 1/2 కప్పు
పచ్చిమిరపకాయలు 3
జీలకర్ర 1 tsp
కొత్తిమిర 1 tsp
ఉప్పు తగినంత
రవ్వ,శనగపిండి, బియ్యంపిండి మజ్జిగలో వేసి ఉండలు కట్టకుండా బాగా కలిపి,
అందులో సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు,జీలకర్ర కొత్తిమిర కలిపి కనీసం
అరగంట నానపెట్టి గరిటజారుగా కలుపుకుని పలుచగా దోసెలాగా పోసుకుని ఎర్రగా
కాల్చి చట్నీతో తీసుకుంటే రుచిగా వుంటాయి.
రాగి దోసె

రాగిపిండి 1/2 kg
ఉల్లిపాయలు 2
పచ్చిమిరపకాయలు 3
పుల్ల పెరుగు 1/4 kg
మినప్పప్పు 100 gm
ఉప్పు తగినంత
నూనె 1/2 కప్పు
రాగిపిండి,సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు,
మినప్పప్పు, ఉప్పు వేసి పుల్ల పెరుగు కలిపి దాదాపు నాలుగైదు గంటలు
నాననివ్వాలి. గరిటజారుగా కలుపుకోవాలి. వేడి పెనంపై దోసెలు వేసుకుని
పైన వెన్న, చిన్న బెల్లం ముక్క పెట్టి సర్వ్ చేస్తే బాగుంటుంది. దీనిని చట్నీ,
సాంబార్‌తో తీసుకోవచ్చు.
మసాలా దోసె

మినప్పప్పు 1 గ్లాసు
బియ్యం 3 గ్లాసులు
మెంతులు 1/ tsp
ఉప్పు తగినంత
నూనె 1/2 కప్పు
మసాలా కూరకు:
బంగాళాదుంపలు 1/4kg
పచ్చిమిరపకాయలు 2
కరివేపాకు 1 రెబ్బ
కొత్తిమిర 2 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినప్పప్పు 1/2 tsp
శనగపప్పు 1 tsp
పసుపు చిటికెడు
ఉల్లిపాయ 1
నూనె 3 tsp
పప్పు, బియ్యం,మెంతులు అన్నీ కలిపి కనీసం నాలుగు గంటలు నానబెట్టి మెత్తగా
రుబ్బి ఆరుగంటలపాటు పులియనివ్వాలి.తరువాత తగినంత ఉప్పు వేసి కలిపి
ఉంచుకోవాలి.
బంగాళదుంపలు ఉడకపెట్టి పైతోలు తీసి కావల్సిన సైజులో ముక్కలుగా చేసి
పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి పోపు సామాను వేసి చిటపటలాడాక
కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి అవి మెత్తబడేవరకు
వేయించి చిదిమిపెట్టుకున్న బంగాళదుంప ముక్కలు,పసుపు, ఉప్పు వేసి బాగా
కలియబెట్టి అవసరమైతే కొద్దిగా నీరు చల్లి ఐదు నిమిషాలపాటు వేయించాలి.దించే
ముందు కొత్తిమిర చల్లి తీసి పక్కన పెట్టుకోవాలి.
రుబ్బిపెట్టుకున్న పిండితో దోసె వేసి ఎర్రగా కాల్చి తిరగేయకుండా పైభాగాన గరిటెడు
మసాలాకూర వేసి మధ్యకి మడిచి కిందకి దింపేయాలి.
సాదా దోసె

మినప్పప్పు 1 గ్లాసు
బియ్యం 3 గ్లాసులు
మెంతులు 1/2 tsp
చక్కెర్ చిటికెడు
ఉప్పు తగినంత
నూనె 1/2 కప్పు
ముందుగా మినప్పప్పు, బియ్యం,విడివిడిగా నానపెట్టాలి.మెంతులు బియ్యంలో
కలిపాలి. కనీసం నాలుగు గంటలు నాననివ్వాలి. తరువాత గరిటెజారుగా మెత్తగా
రుబ్బుకోవాలి. ఈ పిండిని బాగా కలిపి కణీసం ఆరు గంటలు అలా వదిలేసి
పులియనివ్వాలి. తరువాత ఇందులో తగినంత ఉప్పు వేసి బాగా కలిపి వేడి పెనంపై
దోసెలను పోసుకోవాలి. బంగారు రంగు వచ్చేవరకు కాల్చి చట్నీతో సర్వ్ చేస్తే
రుచిగా ఉంటాయి.
దోసె క్యాంపస్

దోసెల పుట్టినిల్లు భారతదేశం. శతాబ్దాల చరితగల చవులూరే దోసెను
కాలగమనంలోమనదేశంలోనేగాక యావత్ ప్రపంచంలో ఉపాహారంగా ప్రాంతీయ
రుచులకనుగుణంగా తయారుచేస్తున్నారు.దోసెను ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా
తయారుచేస్తారు. ఎలా తయారు చేసినా రుచి మాత్రం అమోఘం. అద్వితీయం.
అన్నం కూడా మానేసి మళ్లీ మళ్లీ తినాలనిపించే దోసెలను ఎన్నో రకాలుగా
తయారు చేసుకోవచ్చు. తమిళనాడులో చేసే సెట్‌దోసె తింటే ఇక అన్నం కూడా
తినబుద్ధి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో చేసే మసాలా దోసెకి కర్నాటకలో తయారుచేసే
మసాలా దోసెకి కొద్దిగా తేడా ఉంది. మన దగ్గర మసాలా దోసెకి ఎర్ర చట్నీ వేస్తారు.
అదే దావణగేరేలో మసాలా దోసె సాదాసీదాగా కనిపిస్తుంది. ఇక్కడా కన్నా
అక్కడ కొద్దిగా మందంగా చేస్తారు. కొన్ని ప్రాంతాలలో మసాలాదోసె మీద వెన్నతో
పాటు కేరట్,ఉల్లిపాయ,కొత్తిమిర తురుము వేసి తయారుచేస్తారు.కాకా
హోటళ్ళనుంచి కార్పొరేట్ హోటళ్ళదాకా తిరుగులేని పాత్ర వహిస్తున్న వివిధ
దోసెల తయారీవిధానాలు
మీకోసం.
దోసెల తయారీలో కొన్ని చిట్కాలు.
*. దోసెల పిండిని కలియబెట్టే సమయంలో రెండూ చిటికెల పంచదార వేసి కలిపితే దోసెలు
అందంగా, కరకరలాడుతూ వుంటాయి.
*. దోసె రుచిగా ఉండాలంటే బియ్యం,పప్పుల పిండితో పాటు ఒక చిన్న చెంచాడు మెంతిపొడి
కలపాలి.లేదా బియ్యంలోనే చెంచాడు మెంతులు కలిపి నానబెట్టాలి.
*. దోసెలు పెనానికి అతుక్కోకుండా వుండాలంటే ఒక దోసె వేసి తీసిన ప్రతి సారీ సగం కోసిన
ఉల్లిపాయతో పెనాని రుద్దాలి. అలా చేస్తే దోసె పెనానికి అతుక్కోకుండా బాగా వస్తుంది.
*. అదేవిధంగా దోసెలు రావాలంటే మరో ప్రక్రియ కూడా ఉంది. దోసె వేసే ముందు చెక్కు
తీయని పెద్ద అరటికాయ ముక్కతో పెనాన్ని రుద్దాలి.
*. దోసె/ఊతప్పం మందంగా తయారవాలంటే బియ్యంతోపాటు అరకప్పు అటుకులు
కూడా కలపాలి.
*. ఒక చెంచాడు తినేసోడాను పిండిలో కలిపి దోసె వేస్తే కరకరలాడుతూ రుచికరంగా ఉంటుంది.
*. చలికాలంలో దోసెపిండిలో ఒక చిన్న చెంచాడు 'ఈనో సాల్ట్ ' కలిపితే త్వరగా పులిసి,
దోసె కొంచెం పుల్లగా కూడా ఉంటుంది.
*. ఒక పెద్ద వంకాయను సగానికి కోసి, నూనెలోముంచి దానితో వేడి పెనాన్ని రుద్ది,దోసె
వేస్తే పెనానికి అతుక్కోకుండా నీట్‌గా వచ్చి, దోసె కరకరలాడుతూ ఉంటుంది.
చలిమిడి
బియ్యం ఒక కప్పు
బెల్లం అర కప్పు
పచ్చికొబ్బరి పావు చిప్ప
గసగసాలు రెండు చెంచాలు
యాలకులు మూడు
నెయ్యి నాలుగు చెంచాలు
ఒక రోజు ముందు బియ్యం కడిగి నానబెట్టుకోవాలి. బియ్యం జల్లెడలో పోసి వడకట్టి
రోట్లో లేదా గ్రైండర్లో పొడి చేసుకుని జల్లించి తడి ఆరిపోకుండా దగ్గరగా నొక్కి పెట్టుకోవాలి.
పిండి ఆరిపోకూడదు. కొబ్బరికాయ చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.
బాణలిలో నెయ్యి వేడి చేసి కొబ్బరిముక్కలు ఎర్రగా వేయించి పక్కన ఉంచి, గసగసాలు
కూడా వేయించి తీసుకోవాలి.యాలకులు పొడి చేసి పెట్టుకోవాలి. బెల్లం తురిమి,
పావు కప్పు నీరు పోసి ఉడికించి, మరీ లేత కాకుండా మరీ ముదురు పాకం కాకుండా
చేసి యాలకుల పొడి, నెయ్యి కలిపి క్రిందకు దించి కొద్దికొద్దిగా బియ్యం పిండి వేస్తూ
గరిటతో ఉండలు లేకుండా కలుపుతూ చివరగా కొబ్బరిముక్క్లలు,గసగసాలు కూడా
కలిపి మూతపెట్టి ఉంచాలి. అంతే రుచికరమైన చలిమిడి రెడీ..
అటుకుల ఉప్మా

అటుకులు 200gm
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 2
ఎండుమిర్చి 2
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
కరివేపాకు 2 రెబ్బలు
కొత్తిమిర 2 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
పచ్చి కొబ్బరి తురుము 3 tsp
దీనికి లావు అటుకులు ఐతేనే బాగుంటుంది. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి
ఎండుమిర్చి, పోపు సామాను వేసి కొద్దిగా వేపి పసుపు, తరిగిన ఉల్లిపాయ,
పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కొద్దిగా వేపాలి. అటుకులను నీళ్ళలో వేసి తీసి నీళ్ళన్నీ
పిండేసి ఈ పోపులో వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి.
రెండు నిమిషాల తర్వాత కొత్తిమిర,కొబ్బరి తురుము చల్లి దింపేయాలి.వేడిగానే తినాలి.
అటుకుల ఛుడువా

సన్న అటుకులు 150 gm
ఎండుమిర్చి 4
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/2 tsp
పుట్నాలపప్పు 2 tbsp
వేరుశనగగుళ్ళూ 4 tbsp
సన్నగా తరిగిన కొబ్బరిముక్కలు 3 tbsp
కరివేపాకు 2 రెబ్బలు
కారం 1 tsp
పసుపు 1 tsp
ధనియాలపొడి 2 tsp
పంచదార 1 tsp
ఉప్పు తగినంత
నూనె 4 tbsp
ఇది తక్కువ నూనెతో చేసుకోవచ్చు. ముందుగా వెడల్పాటి బాణలిలో చెంచాడు నూనె వేడి
చేసి చిటికెడు పసుపు వేసి సగం అటుకులు వేసి బాగా కలియబెట్టి కొద్దిసేపు పచ్చిదనం
పోయేదాకా నిదానంగా వేపాలి.అవి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా అటుకులు
కూడా చేసి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు బాణలిలో రెండు చెంచాల నూనె వేడి చేసి ఎండుమిర్చి,
ఆవాలు, జీలకర్ర, పుట్నాలపప్పు, వేరుశనగగుళ్ళు కరివేపాకు, కొబ్బరి ముక్కలు
వేసి కొద్దిగా వేపి వేయించి పెట్టుకున్న అటుకులు కలిపి, తగినంత ఉప్పు, కారం,
ధనియాలపొడి, చెంచాడు పంచదార వేసి అన్ని బాగా కలియబెట్టి తీసి చల్లారిన తర్వాత
డబ్బాలో వేసి పెట్టుకోవాలి.
ఆలూపోహా

అటుకులు 200 gm
బంగాళదుంపలు 2
పచ్చిమిర్చి 4
అల్లము చిన్నముక్క
ఉల్లిపాయ 1
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/2 tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
పసుపు చిటికెడు
ఉప్పు సరిపడ
ఎండుమిర్చి 2
కరివేపాకు 1 రెబ్బ
నూనె 4 tsp
బంగాళదుంపలు ఉడికించి ముక్కలు చేసి పెట్టుకోవాలి.ఉల్లిపాయ,పచ్చిమిర్చి, అల్లం
సన్నగా తరిగి ఉంచుకోవాలి.పొయ్యిమీద బాణలి పెట్టి నూనె వేడి చేసి ఎండుమిర్చి,
పోపుసామానంతా వేసి కొద్దిగా వేపి పసుపు,కరివేపాకు, ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,
అల్లం, బంగాళదుంప ముక్కలు వేసి బాగా వేపాలి.ఇప్పుడు అటుకులను నీళ్ళలో వేసి
తీసేసి నీళ్ళు పిండేసి పోపులో వేసి తగినంత ఉప్పు వేసి అన్ని బాగా కలియబెట్టి మూత
పెట్టాలి. రెండునిమిషాల తర్వాత వేడిగా తినేయడమే.
అటుకుల పులిహార

అటుకులు 200 gm
నూనె 4 tsp
పచ్చిమిర్చి 2
అల్లం చిన్న ముక్క
వేరుశనగ గుళ్ళు3 tbsp
పసుపు 1/4 tsp
ఎండుమిర్చి 2
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/2 tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
కరివేపాకు రెండు రెబ్బలు
కొత్తిమిర 2 tsp
నిమ్మకాయలు 2
ఉప్పు తగినంత
ముందు అటుకులను బాగుచేసుకుని అట్టే పెట్టుకోవాలి. అల్లము, పచ్చిమిర్చి సన్నగా
తరిగిపెట్టుకోవాలి.బాణలి పొయ్యిమీద పెట్టుకుని నూనె వేడి చేసి ఎండు మిర్చి,ఆవాలు,
జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి బాగా వేగిన తర్వాత అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు
పసుపు వేసి కొద్దిగా వేపాలి. ఈలోపు అటుకులను నీళ్ళలో వేసి వెంటనే తీసి నీళ్ళు పిండేసి
పోపులో వేసి తగినంత ఉప్పు వేసి అన్ని బాగా కలియబెట్టి మూత పెట్టాలి.దింపేసి నిమ్మరసం
కొత్తిమిర వేసి కలిపి వేడి వేడిగా తినాలి. దీనికి కాంబినేషన్ ఆవకాయ.















