Tuesday, March 20, 2007

ఉగాది పచ్చడి



చింతపండు, బెల్లం,మామిడి తురుము, కొబ్బరి తురుము, సోంపు,జీలకర్ర పొడులు,వేప పువ్వు, సారపప్పు

ఇది తెలంగాణా స్టైల్ పచ్చడి.చింతపండు , బెల్లం విడివిడిగా నీళ్ళలో నానబెట్టాలి. చింతపండు పులుసు పలుచగా తీసుకుని. బెల్లం నీరు కలపాలి. ఇందులో మామిడి తురుము, కొబ్బరి తురుము, ఒకో స్పూను జీలకర్ర, సోంపు పొడులు, వేపపువ్వు, సారపప్పు కలిపి కడిగిన
కొత్త కుండలో వేసి పెట్టాలి. రెండు గంటల తర్వాత చల్లగా గ్లాసులో పోసుకుని షర్బత్‍లా తాగాలి.

వేరే వాళ్ళు చిక్కగా చేసుకుంటారు.

Monday, March 19, 2007

పెసర బొబ్బట్లు



పెసరపప్పు 250 gm
పంచదార 250 gm
రవ్వ 250 gm
మైదా 100 gm
యాలకుల పొడి 1 tsp
నెయ్యి అరకప్పు

పెసరపప్పును శుభ్రపరచుకొని గంట సేపు నీటిలో నాననివ్వాలి. నానిన పప్పును
మెత్తగా రుబ్బుకోవాలి. రుబ్బిన పప్పును ఆవిరిపై ఉడికించుకోవాలి. ఉడికిన
ముద్దను చల్లార్చి చిదిమి పొడి చేసుకుని పంచదారలో కొంచెం నీళ్ళు పోసి తీగ
పాకం పట్టి పెసరపప్పు పిండిని పకంలో చేర్చాలి. ఉడుకుతుండగా అందులో కొంచెం
నెయ్యి,యాలకుల పొడి వేసి గట్టి పడేవరకు వుంచాలి. తర్వత దించేయాలి.
చల్లారాక చిన్న చిన్న వుండలు చేసుకుని వుంచుకోవాలి.మైదా, రవ్వ కలిపి
నీళ్ళు పోసి పూరిపిండిలా తడిపి గంట నాననివ్వాలి. ఒక పాలిధిన్ పేపర్‌కు నూనె
రాసి పూరిపిండిని చిన్న వుండలుగా చేసి వెడల్పుగా వత్తుకుని మధ్యలో రవ్వ
ముద్దను పెట్టి అంచులు మూసి నూనె చేతితో చపాతీలా వత్తుకుని వేడి పెనంపై
నెయ్యి వేస్తూ రెండువైపులా కాల్చుకోవాలి. ఇవి వేడిగా తింటే ఒక రకం రుచిగానూ,
చల్లారాక తింటే ఒక రుచిగాను ఉంటాయి. ఎలా ఇష్టం ఉంటే అలా తినవచ్చు.

రవ్వ బొబ్బట్ట్లు




బొంబాయిరవ్వ 250 gm
పంచదార 250 gm
మైదాపిండి 250 gm
యాలకుల పొడి 1 tsp
నెయ్యి 50 gm
నూనె అర కప్పు

ముందుగా మందపాటి గిన్నెలో రెండు స్పూనుల నెయ్యి వేడి చేసి బొంబాయిరవ్వ పోసి
దోరగా వేయించుకోవాలి. మరో గిన్నెలో పంచదార యాలకులపొడి వేసి నీళ్ళు పోసి
మరిగిన తర్వాత రవ్వ పోసి ఉండకట్టకుండా నెయ్యేసి సన్నని సెగపై ఉడకనివ్వాలి.
చక్కగా మగ్గిన తర్వాత దింపేయాలి. మైదాపిండిలో కొంచెం నెయ్యిగాని నూనె గాని
వేసి కొంచెం నీళ్ళు పోసి పూరిపిండిలా కలుపుకొని గంటసేపు నాననివ్వాలి. తర్వాత
పిండిని చిన్న చిన్న ముద్దలు చేసుకుని వెడల్పుగా వత్తుకుని మధ్యలో రవ్వ పూర్ణం
పెట్టి అంచులు మూసి పాలకవరుపై నూనె వేసి వెడల్పుగా పూరీల్లా వత్తుకుని వేడి
పెనంపై నెయ్యి వేస్తు నిదానంగా దోరగా కాల్చుకోవాలి. ఎక్కువ వేపితే
కరకరలాడతాయి. ఇవి మెత్తగా ఉండాలి.

నువ్వు బొబ్బట్టు




నువ్వులు 250 gm
బెల్లం 250 gm
మైదాపిండి 250 gm
ఎండుకొబ్బరిపొడి అరకప్పు
యాలకుల పొడి 1 gm
నూనె అరకప్పు
నెయ్యి అరకప్పు


ముందుగా నువ్వులను శుభ్రపరచుకొని దోరగా వేయించుకోవాలి. పొడి చేసుకున్న బెల్లం,
నువ్వులు, కొబ్బరిపొడి కలిపి మెత్తగా దంచుకొని చిన్న చిన్న వుండలుగా చేసుకోవాలి.
మైదాపిండిలో కొంచెం నూనె, నీళ్ళు పోసి పూరిపిండిలా కలిపి రెండుగంటలు నాననివ్వాలి.
మైదాపిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని నూనె చేత్తో వెడల్పుగా వత్తుకొని మధ్యలో
నువ్వుల ఉండ పెట్టి అంచులు మూసేసి, చపాతీలా వత్తుకుని వేడి పెనంపై నెయ్యి వేస్తూ
కాల్చుకోవాలి.

కొబ్బరి బొబ్బట్టు



పచ్చి కొబ్బరి తురుము 250 gm
బెల్లం 250 gm
మైదాపిండి 250 gm
నూనె అర కప్పు
నెయ్యి అరకప్పు
యాలకులపొడి 1 tsp

కొబ్బరితురుము, పొడి చేసుకున్న బెల్లం కలిపి కొంచెం నీళ్ళు పోసి బాగా ఉడకనీయాలి.
మొత్తం ఉడికి గట్టిపడ్డాక యాలకులపొడి రెండు స్పూనుల నెయ్యి వేసి కలిపి చిన చిన్న
వుండలు చేసుకోవాలి. మైదాపిండిలో కొంచెం నూనె నీళ్ళు పోసి పూరి పిండిలా కలిపి
రెండుగంటలు నాననివ్వాలి. తరువాత ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని నూనె
చేతితో వెడల్పు చేసుకుని మధ్యలో పూర్ణం వుండ పెట్టి అంచులు మడిచి బొబ్బట్టులా
వత్తుకుని వేడెక్కిన పెనంపై వేసి నేయ్యి వేస్తు రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి.

శనగపప్పు బొబ్బట్లు




శనగపప్పు 500 gm
బెల్లం 500 gm
మైదాపిండి 250 gm
నూనె అర కప్పు
నెయ్యి అరకప్పు
యలకుల పొడి 1 tsp
సోంఫు పొడి 3 tsp

శనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి. తర్వాత నీళ్ళు
వార్చి పప్పును బెల్లంతో కలిపి మెత్తగా రుబ్బాలి.చివరలో యాలకులు,సోంఫు పొడులు
కలపాలి.ఈ పూర్ణాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి.తరువాత మైదాపిండిలో
కొంచెం నూనె వేసి పూరిపిండిలా కలుపుకోవాలి.ఈ పిండిముద్దను కనీసం ఒక గంట అయినా
నాననీయాలి. నానిన మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చేతితో వెడల్పు
చేసి మధ్యలో పూర్ణం ఉండను పెట్టి చుట్టూ అంచులు మడిచి నూనె చెయ్యి చేసుకుని ప్లాస్టిక్
కాగితం మీద పూర్ణం బయటకు రాకుండా వెడల్పుగా చపాతీలా ఒత్తుకోవాలి. పొయ్యి మీద
పెనం వేడి చేసి ఈ బొబ్బట్టును నేతితో రెండువైపులా ఎర్రగా కాల్చుకోవాలి. కాల్చుకుని
తీసుకున్న వేడి వేడి బొబ్బట్టుపై కాస్త వెన్న వేసుకు తింటే స్వర్గానికి బెత్తెడు దూరంలో ఉన్న
అనుభూతి కలుగుతుందా చూడండి.

Tuesday, March 13, 2007

వేడి వేసవి - చల్లని పానీయాలు




ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోండి.


ఇది వేసవికాలం. అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలో నీరు చెమట రూపంలో బయటకి వస్తుంది.
పెరిగిన ఉష్ణోగ్రత నుండి సహసిద్ధమైన విధానంలో మనల్ని మనం కాపాడుకునేందుకు నీరు
ఎక్కువగా త్రాగాలి.నీటితో పాటు ఇతర ద్రవపదార్థాలు సమృద్ధిగా తీసుకోవడం చాలా అవసరం.

* మజ్జిగ,నిమ్మరసం, కొబ్బరినీరు, పండ్లరసాలు, రాగిజావ, బార్లీ నీరు మొదలైనవి
తరచుగా తీసుకోవాలి. ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల వేసవిలో తలెత్తే
సమస్యలను నివారించవచ్చు వడదెబ్బ తగులకుండా తగిన శక్తిని పెంపొందించుకోవచ్చు.
కొద్దిపాటి శ్రద్ధ, ఆసక్తి వుంటే నిమిషాల వ్యవధిలో రుచికరమైన ద్రవపదార్థాలు తయరు
చేసి ఇంటిల్లిపాది ఆనందంగా సేవించవచ్చు.

* గుప్పెడు బార్లీ గింజలను నాలుగు గ్లాసుల నీళ్ళతో కలిపి కుక్కర్‌లో ఉడికించండి. వడ
కట్టి కొద్దిగా బెల్లం,ఉప్పు చేర్చి బార్లీ నీరు త్రాగండి.

* రాగిపిండిని రెండు స్పూన్లు తీసుకుని ఒక గ్లాసు నీళ్ళలో కలపండి. ఈ మిశ్రమాన్ని
రెండు గ్లాసుల మరుగుతున్న నీటిలో పోసి ఉండలు కట్టకుండా కలపండి. ఉడికిన
రాగిజావలో కొద్దిగా పాలు,బెల్లం కలిపి హాయిగా తాగండి. అభిరుచిని బట్టి మజ్జిగలో
కూడా కలిపి సేవించవచ్చు.

* సగ్గుబియ్యాన్ని నీళ్ళలో ఉడికించండి. పాలు, పంచదార లేక బెల్లం ఏలకులపొడి
వేసి తాగండి.

* పుచ్చకాయ ముక్కలలోనుండి గింజలు తీసేసి గ్రైండర్‌లో రసం చేసి చల్లచల్లగా తాగండి.

* కరివేపాకు, కొత్తిమిర, అల్లం సన్నగా తరిగి మజ్జిగలో కలపండి.కొద్దిగా ఉప్పు,
పచ్చిమిరప కాయలు కూడా కలపండి. మధురమైన రుచిలో వుండే మజ్జిగ సేవించి
వేసవి తాపము నుండి ఉపశమనం పొందండి.

* పది బాదం పప్పులను ఆరు గంటలపాటు నీటిలో నానబెట్టండి. తొక్క తీసి నీళ్ళతో
కలిపి మిక్సిలో వేయండి. ఆ బాదంపాలతో కొద్దిగా తేనె కలిపి అద్భుతమైన రుచితో
కూడిన పానీయం చేసుకోండి.

* బాగా పండిన 3 జామపండ్లను ముక్కలుగా కోసి మిక్సీలో వేయండి.రెందు గ్లాసుల
నీళ్ళు, ఒక స్పూను తేనె, కొద్దిగా నిమ్మరసం కలపండి.

* ఆరు ఖర్జూరపండ్లను గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి తగిన నీరు పోసి
మిక్సీలో వేయండి. కావాలంటే పాలు కూడా కలపొచ్చు. నిమ్మరసం, ఏలకులపొడి,
బెల్లం కలిపి తీసుకోండి.

* నాలుగు అరటిపండ్లు, రెందు గ్లాసుల నీరు మిక్సీలో వేసి తిప్పండి. కొద్దిగా బెల్లం,
ఏలకుల పొడి కలిపి సేవించండి.

* రెండు క్యారట్‌లు, ఒక బీట్రూట్ ముక్కలుగా చేసి నీరు కలిపి మిక్సీలో వేయండి.
రసాన్ని వడకట్టి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తగండి.

* 2 మామిడిపండ్లు రసం తీసి పంచదార, పాలు, ఏలకులపొడి కలిపి తాగండి.

కృత్రిమంగా తయారుచేసిన జ్యూసులకంటే సహజసిద్ధమైన విధానంలో ఇంట్లో
పరిశుభ్రంగా చేసిన ద్రవాలు ద్రవపదార్థాలు, తాగడం ఎంతో మేలు.

Monday, March 05, 2007

200....ఆవడలు


మినపప్పు 1 కప్పు
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి
పెరుగు 1 cup
ఉప్పు తగినంత
కారం 2 tsp
జీలకర్ర పొడి 1 tsp
కొత్తిమిర 2 tsp
పచ్చిమిర్చి 2

మినప్పప్పు శుభ్రం చేసి కడిగి నాలుగు గంటలు నీటిలో నానబెట్టాలి. తరువాత
నీరు తీసేసి మెత్తగా రుబ్బుకోవాలి.నూనె వేడి చేసి ఆ పిండితో వడలు చేసుకొని
ఎర్రగా వేయించాలి. ఈ వడలను గిన్నెలో నీళ్ళు పోసి అందులో వేసి ఉంచాలి.
పెరుగు చిలికి కారం,జీలకర్ర పొడి,సన్నగా తరిగిన పచ్చిమిర్చి,కొత్తిమిర,ఉప్పు
కలపాలి.వెడల్పాటి గిన్నెలో నీళ్ళనుండి తీసిన వడలు నీరంతా పిండేసి అమర్చి
పెరుగుని పోయాలి.పైన కొంచం కొత్తిమీర,బూందీతో అలంకరించి చల్లగా తినడమే.
ఎక్కువ చల్లగా కావాలంటే పెరుగుని అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి.

ఫ్రూట్ సలాడ్




అరటిపళ్ళు 4
నారింజ 1
ఆపిల్ 1
మామిడి 1
దానిమ్మ గింజలు 1/2 కప్పు
ద్రాక్ష 1/2 కప్పు
చిక్కటిపాలు లేక కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు
చక్కెర 1/4 కప్పు
యాలకుల పొడి 1 tsp
లేక వెనిల్లా ఎస్సెన్స్ 1/4 tsp
నిమ్మరసం 2 tsp

పళ్ళన్నీ చిన్న ముక్కలుగా కోసి నిమ్మరసం కలిపి చక్కెర, కండెన్స్డ్ మిల్క్
యాలకులపొడి వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో పెట్టి చల్లారాక తినడమే.

షాహీ టుక్రా




బ్రెడ్ 8
పాలు 1 లీటర్
చక్కెర 1 కప్పు
యాలకుల పొడి 1 tsp
కిస్మిస్ 10
జీడిపప్పు 5
కుంకుమపువ్వు చిటికెడు
నెయ్యి లేదా నూనె వేయించడానికి

బ్రెడ్‌ను నిలువుగా కాని త్రికోణాకారంగా కాని కట్ చేసి ఎర్రగా వేయించుకోవాలి.
పాలు చక్కెర కలిపి మరిగించి చిక్కబడి సగం అయ్యాకా యాలకుల పొడి,
కుంకుమపువ్వు కలిపి దింపేసి చల్లార్చాలి.వెడల్పాటి పళ్ళెంలో ఈ చిక్కటి
పాలు పోసి వేయించిన బ్రెడ్ ముక్కలు ఒకదాని పక్కన ఒకటి పెట్టాలి.కిస్మిస్,
సన్నగా కోసిన జీడిపప్పు వీటిపై చల్లాలి.కొద్దిసేపట్లో బ్రెడ్ ముక్కలు పాలన్నీ
పీల్చుకుంటాయి.

పనీర్ సాండ్‌విచ్


బ్రెడ్ 1 ప్యాకెట్
ఉల్లిపాయ 1
టొమాటో 1
పనీర్ 100 gm
కారం 1 tsp
ఉప్పు తగినంత
కొత్తిమిర 2 tsp
వెన్న 50 tsp

ఉల్లిపాయ,టొమాటో,కొత్తిమిర సన్నగా తరిగి,తురిమిన పనీరు,ఉప్పు,కారం
వేసి బాగ కలిపి వెన్న రాసిన బ్రెడ్ ముక్కలపై చెంచాడు పెట్టి వెడల్పుగా
సర్ది టోస్టర్లో కాని,ఓవెన్లో కాని,పెనంపై కాని రెండువైపులా వేయించాలి.దీనిని
సాస్‌తో పట్టు బట్టడమే.

పనీర్ బఠానీ కుర్మా



పనీర్ 200 gm
పచ్చి బఠానీలు 100 gm
ఉల్లిపాయలు 2
టొమాటోలు 3
పసుపు 1/2 tsp
కారం 1 tsp
పచ్చిమిర్చి 3
అల్లం వెల్లుల్లి 1 tsp
కొబ్బరి పొడి 3 tbsp
పెరుగు 1/2 కప్పు
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 3 tsp
గరం మసాలా 1 tsp
నూనె 3 tbsp

ఉల్లిపాయలు,టొమాటోలు,అల్లం వెల్లుల్లి,పచ్చిమిర్చి కలిపి ముద్దగా నూరి
పెట్టుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి ఈ ఉల్లిపాయ ముద్దను నిదానంగా
నూనె వదిలేవరకు వేయించాలి.ఇప్పుడు బఠానీలు వేసి నిదానంగా వేయించాలి.
అవసరమైతే అర కప్పు నీళ్ళు పోయాలి. ఇప్పుడు పసుపు,కారం,గరం మసాలా,
ఉప్పు,కొబ్బరిపొడి,కరివేపాకు,చిలికిన పెరుగు వేసి మళ్ళీ ఉడికించాలి.నూనె
తేలిన తర్వాత పనీర్ ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు వేసి ఉడికించి
కొత్తిమిర చల్లి దింపేయాలి.

పనీర్ టిక్కా




పనీర్ 200 gm
పెరుగు 1/4 cup
అల్లం వెల్లుల్లి 1 tsp
కారం 1 tsp
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
గరం మసాలా 1 tsp
జీలకర్ర పొడి 1 tsp
మిరియాల పొడి 1/4 tsp
నూనె వేయించడానికి
చిక్కటి పెరుగు చిలికి అల్లం వెల్లుల్లి ముద్ద,కారం,పసుపు,గరం మసాలా,జీలకర్ర,
మిరియాలపొడి,తగినంత ఉప్పు కలిపాలి. పనీర్‌ను నిలువుగా ముక్కలుగా కోసి
ఈ మసాలా ముద్దని అన్నింటికి బాగా పట్టించి 3 గంటలు ఫ్రిజ్‌లో పెట్టాలి.బాణలిలో
నూనె వేడి చేసి ఈ పనీర్ ముక్కలు ఒక్కొక్కటిగా వేసి ఎర్రగా వేయించాలి.ఇవి
గ్రీన్ చట్నీ కానీ టొమాటో సాస్‌తో కలిపి లాగించేయడమే.

పనీర్ పకోడీ




పనీర్ 200 gm
శెనగపిండి 150 gm
కారం 1 sp
ఉప్పు తగినంత
వాము 1 tsp
పచ్చిమిర్చి 2
కొత్తిమిర 2 tsp
వంట సోడా చిటికెడు
నూనె వేయించడానికి

ముందుగా శెనగపిండిలో ఉప్పు, కారం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమిర,
వాము,వంటసోడా వేసి బాగా కలియబెట్టి అర గంట పక్కన పెట్టాలి. పనీర్‌ను
అంగుళం సైజులో కోసి ఒక్కొక్కటి పిండిలో ముంచి వేడి నూనెలో ఎర్రగా
అయ్యేవరకు వేయించాలి.

పాలక్ పనీర్




పనీర్ 200 gm
పాలకూర 10 కట్టలు
ఉల్లిపాయలు 2
టొమాటోలు 3
అల్లం వెల్లుల్లి 1 tsp
కరివేపాకు 1 tsp
పసుపు 1/2 tsp
కారం 1 tsp
ఉప్పు తగినంత
గరం మసాలా 1 tsp
నూనె 3 tbsp

తరిగిన పాలకూరను ఐదునిమిషాలు నీటిలో ఉడికించాలి.చల్లారిన తర్వాత
మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి.పనీర్‌ను అంగుళం ముక్కలుగా కోసి నూనెలో
ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి.వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి
సన్నగా తరిగిన ఉల్లిపాయలు గోధుమ వర్ణం వచ్చేవరకు వేయించి అల్లం
వెల్లుల్లి,పసుపు,కారం,సన్నగా తరిగిన టొమాటోలు వేసి అవి మెత్తబడేవరకు
వేయించాలి.ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న పాలకూర ముద్దను ఇందులో వేసి
తగినంత ఉప్పు,గరం మసాలా కలిపి నిదానంగా చిక్కబడేవరకు ఉడికించాలి.
పనీర్ ముక్కలను వేసి మెల్లిగా కలియబెట్టి మరో ఐదు నిమిషాలు ఉడికించి
నూనె తేలగానె దింపేయాలి.

మిర్చీ పనీర్




పనీర్ 250 tsp
ఉల్లిపాయలు 2
సిమ్లా మిర్చీ 3
టొమాటో 2
అల్లం వెల్లుల్లి 1 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
పసుపు 1/2 tsp
కారం 1 tsp
ఉప్పు తగినoత
గరం మసాలా 1 tsp
నూనె 3 tbsp

ముందుగా వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు
మెత్తబడేవరకు వేయించి పసుపు,కారం,అల్లం వెల్లుల్లి,కరివేపాకు వేసి కొద్దిగా వేపి
తరిగిన సిమ్లా మిర్చీ,టొమాటోలు వేసి మెత్తబడేవరకు నిదానంగా వేయించాలి.
కూర నూనె వదిలేటప్పుడు అంగుళం సైజులో కోసి పెట్టుకున్న పనీర్ ముక్కలు,
తగినంత ఉప్పు,గరం మసాలా కలిపి మూతపెట్టి మరో ఐదు నిమిషాలు వేయించి
దింపేయాలి.

షాహీ పనీర్




పనీర్ 250 gm
ఉల్లిపాయలు 2
పచ్చిమిర్చి 2
అల్లం వెల్లుల్లి 1 tsp
పసుపు 1/2 tsp
కారం 1 tsp
గరం మసాలా 1 tsp
ఉప్పు తగినంత
కొత్తిమిర 2 tsp
పెరుగు 1/2 tsp
పాలు 1/2 tsp
నూనె 4 tbsp

పనీర్‌ను అంగుళం ముక్కలుగా కోసి వేడి నూనెలో బంగారు వర్ణం వచ్చేవరకు
వేయించి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు తరిగి అల్లం వెల్లుల్లి కలిపి ముద్దగా
నూరి పెట్టుకోవాలి.ఇంతకుముందు నూనెలోనే ఈ ఉల్లిపాయ ముద్ద బాగా
వేయించాలి నూనె వదిలేవరకు.తర్వాత పసుపు, కారం,ఉప్పు,గరం మసాలా
వేసి కొద్ది సేపు వేయించి పాలు,పెరుగు కలిపి చిలికి అందులో కలిపి మరిగించాలి.
కూర ఇగిరిపోయి చిక్కబడ్డాక పనీర్ ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు
ఉడికించి కొత్తిమిర చల్లి దింపేయాలి.


Sunday, March 04, 2007

రొయ్యలు చుక్కకూర




రొయ్యలు 500 gm
చుక్కకూర 10 కట్టలు
ఉల్లిపాయలు 2
అల్లం వెల్లుల్లి 2 tsp
పచ్చిమిర్చి 2
పసుపు 1 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
గరం మసాలా 1 tsp
కరివేపాకు 1 tsp
నూనె 4 tbsp

బాణలిలో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి అల్లం వెల్లుల్లి,
కరివేపాకు ,పసుపు, కారం వేసి కొద్ది సేపు వేయించి రొయ్యలు, తగినత ఉప్పు
వేసి కలియబెట్టి నీరంతా ఇగిరిపోయేదాక ఉంచాలి. ఇప్పుడు సన్నగా తరిగిన
చుక్కకూర కప్పుడు నీళ్ళు పోసి ఉడికించాలి. రొయ్యలు ఉడికి కూర చిక్కబడ్డాక
గరం మసాలా కలిపి దింపేయాలి.


రొయ్యలు టోమాటో కూర



రొయ్యలు 250 gm
ఉల్లిపాయలు 2
టోమాటోలు 200 gm
పచ్చిమిర్చి 2
అల్లం వెల్లుల్లి 2 tsp
పసుపు 1/2 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
గరం మసాలా 1tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 1 కట్ట
నూనె 3 tbsp

టోమాటోలు మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి సన్నగా
తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేపి అల్లం వెల్లుల్లి,కరివేపాకు,పసుపు,కారం వేసి
కొద్దిగా వేపి రొయ్యలు,ఉప్పు వేసి కలియబెట్టి నీరంతా ఇగిరిపోయేవరకు ఉంచి
కప్పుడు నీళ్ళు పోసి ఉడికించాలి. రొయ్యలు ఉడికిన తర్వాత రుబ్బిన
టోమాటోల ముద్ద,గరం మసాలా,వేసి నూనె తేలేవరకు నిదానంగా ఉడికించి
కొత్తిమిర చల్లి దింపేయాలి.

రొయ్యలు కుర్మా




రొయ్యలు 250 gm
ఉల్లిపాయలు 2
అల్లం వెల్లుల్లి 1 tsp
ధనియాల పొడి 2 tsp
కొత్తిమిర 1 కట్ట
కొబ్బరి పొడి 2 tbsp
గసగసాలు 2 tsp
గరం మసాలా 1 tsp
పెరుగు 1 కప్పు
పసుపు 1/2 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
పచ్చిమిర్చి 2
కరివేపాకు 1 tsp
నూనె 3 tbsp

కొబ్బరి, గసగసాలు కలిపి నూరి పెట్టుకోవాలి.నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు
ఎర్రగా వేపి అల్లం వెల్లుల్లి,కరివేపాకు,పసుపు,ధనియాల పొడి కారం వేసి కొద్దిగా
వేపి రొయ్యలు తగినంత ఉప్పు వేసి కలియబెట్టి నీరంతా ఇగిరిపోయేవరకు ఉంచాలి.
ఇప్పుడు కొబ్బరి ముద్ద,గరం మసాలా,కప్పుడు నీళ్ళు పోసి ఉడికించాలి.రొయ్యలు
ఉడికిన తర్వాత పెరుగు చిలికి అందులో కలిపి నూనె తేలేవరకు ఉంచి కొత్తిమిర
చల్లి దింపేయాలి.

రొయ్యల ఇగురు




పచ్చి రొయ్యలు 250 gm
ఉల్లిపయలు 4
పచ్చిమిర్చి 2
అల్లం వెల్లుల్లి 2 tsp
కరివేపాకు 2 tsp
కొబ్బరి పొడి 3 tbsp
గరం మసాలా 1 tsp
పసుపు 1/4 tsp
కారం 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp

రొయ్యలు వలిచి,శుభ్రంగా కడిగి వుంచుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి
సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేపి అల్లం వెల్లుల్లి,పసుపు,కారం,
కరివేపాకు వేసి కొద్దిసేపు వేపి రొయ్యలు,ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత
పెట్టాలి.నీరంతా ఇగిరిపోయాక కప్పుడు నీళ్ళు పోసి ఉడికించాలి. రొయ్యలు
ఉడికిన తర్వాత కొబ్బరిపొడి,గరం మసాలా కలిపి మరో ఐదు నిమిషాలు
ఉడికించి కొత్తిమిర చల్లి దింపేయాలి.

లివర్ సొయకూరతో




లివర్ 500 gm
ఉల్లిపాయలు 2
అల్లం వెల్లుల్లి 2 tsp
సొయకూర 3 కట్టలు
పసుపు 1 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
గరం మసాలా 1 tsp
కొబ్బరి పొడి 3 tbsp
ధనియాల పొడి 2 tsp
నూనె 4 tbsp
కొత్తిమిర 2 tsp
కరివేపాకు 1 tsp

బాణలిలో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి,అల్లం వెల్లుల్లి,
పసుపు,కారం,కరివేపాకు వేసి కొద్దిగా వేపి కార్జం ముక్కలు తగినంత ఉప్పు వేసి
కలియబెట్టి నీరు ఇగిరిపోయేవరకు వేయించాలి.ఇప్పుడు సన్నగా తరిగిన
సొయకూర,గ్లాసుడు నీళ్ళు పోసి కలియబెట్టి మూత పెట్టి ఉడికించాలి. ముక్కలు
ఉడికిన తర్వాత కొబ్బరిపొడి,గరం మసాలా,కొత్తిమిర చల్లి మరో ఐదు నిమిషాలు
వేయించి దింపేయాలి.

లివర్ కూర

లివర్(కార్జం) 500 gm
ఉల్లిపాయలు 3
పచ్చిమిర్చి 2
అల్లం వెల్లుల్లి 2 tsp
కరివేపాకు 2 tsp
పసుపు 1/2 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
కొబ్బరి పొడి 3 tsp
ధనియాల పొడి 3 tsp
గరం మసాలా 1 tsp
కొత్తిమిర 3 tsp
నూనె 4 tbsp


లివర్‌ను కడిగి ముక్కలు చేసి పెట్టుకోవాలి.బాణలిలో నూనె వేడి చేసి తరిగిన
ఉల్లిపాయలు ఎర్రగా వేయించాలి.పచ్చిమిర్చి,కరివేపాకు,పసుపు,కారం,అల్లం
వెల్లుల్లి వేసి కొద్దిగా వేపి కార్జం ముక్కలు,ఉప్పు వేసి తడి పోయేవరకు
వేయించాలి.ఇప్పుడు గ్లాసుడు నీళ్ళూ పోసి కలియబెట్టి ఉడికించాలి. ముక్కలు
ఉడికిన తర్వాత కొబ్బరిపొడి,గరం మసాలా,కొత్తిమిర కలిపి మరో ఐదు
నిమిషాలు ఉడికించి,నూనె తేలగానే దింపేయాలి.

పిట్ట కూర

కౌజు పిట్టలు 2
ఉల్లిపాయలు 2
అల్లం వెల్లుల్లి 1 tsp
కొబ్బరి పొడి 2 tbsp
జీడిపప్పు 6
ధనియాలు 2 tbsp
లవంగాలు 5
యాలకులు 3
దాల్చిన చెక్క 4
జీలకర్ర 1/2 tsp
గసగసాలు 2 tsp
పసుపు 1/2 tsp
ఉప్పు తగినంత
కారం 1 tsp
కొత్తిమిర 1 కట్ట
కరివేపాకు 2 tsp
నూనె 4 tbsp


ధనియాలు,లవంగాలు, చెక్క, యాలకులు కొంచెం వేయించి మెత్తగా పొడి చేయాలి.
పిట్టను బాగు చేసి కాల్చి, పసుపు వేసి కడిగి ముక్కలు కోయాలి. అల్లం వెల్లుల్లి,
కొబ్బరి,గసగసాలు,జీడిపప్పు కలిపి మెత్తగా ముద్దగా నూరాలి. మాంసం ముక్కల్లో ఉల్లిపాయలు,ఉప్పు,కారం,పసుపు,అల్లం ముద్ద,రెండు గ్లాసుల నీళ్ళు పోసి మెత్తగా
ఉడికించాలి.బాణలిలో నూనె వేడి చేసి పోపు గింజలు,కరివేపాకు వేసి వేయించి
వుడికించిన పిట్టకూర వేసి బాగా వేయించి పొడి చేసి పెట్టుకున్న మసాలా ,
కొత్తిమిర చల్లి రెండు నిమిషాలు వేయించి దింపేయాలి.

మటన్ చాప్స్

మటన్ చాప్స్ 500 gm
ఉల్లిపాయలు 3
అల్లం వెల్లుల్లి 2 tsp
పసుపు 1 tsp
కారం 1 tsp
ఉప్పు తగినంత
ఎండుమిర్చి3
మిరియాలు 1 tsp
కొత్తిమిర 1 కట్ట
నూనె 5 tbsp


అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి కలిపి ముద్దగా నూరాలి.చాప్స్ కడిగి శుభ్రంగా
వుంచాలి.వీటికి నూరిన మసాలా ముద్ద,ఉప్పు,పసుపు బాగా పట్టించాలి.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఈ చాప్సుకు సరిపడా నీళ్ళు పోసి వుడికించాలి.
వేరే బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా
వేయించాలి.వుడికించిన చాప్స్,మిరియాల పొడి,కొత్తిమిర కలిపి వేసి
వేయించి దింపాలి.

సొరచేప వేపుడు


సొర చేప 1 kg
ఉల్లిపాయలు 4
అల్లం వెల్లుల్లి 2 tsp
పచ్చిమిర్హ్చి 3
కరివేపాకు 2 tsp
కొత్తిమిర 4 tbsp
జీలకర్ర పొడి 2 tsp
మెంతిపొడి 1/2 tsp
గరం మసాలా 1 tsp
ధనియాల పొడి 3 tbsp
పసుపు 1 tsp
కారం పొడి 2 tsp
ఉప్పు తగినంత
నూనె 5 tbsp


ముందుగా సొరచేప ముక్కలు కడిగి పెద్ద గిన్నెలో నీళ్ళు పోసి 10 నిమిషాలు
ఉడికించాలి. చల్లారిన తర్వాత పైనపొట్టు, ముల్లుల్లు అన్నీ తీసేసి పొడి పొడిగా
చేసి పళ్ళెంలో పెట్టుకోవాలి.వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి సన్నగా
తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి పచ్చిమిర్చి,కరివేపాకు,అల్లం వెల్లుల్లి,
పసుపు,కారం,ధనియాల పొడి,జీలకర్ర మెంతిపొడి అన్నీ వేసి కొద్దిగా వేయించి
ఈ సొర పొడిని,తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మరో పదినిమిషాలు
వేయించి కొత్తిమిర చల్లి దింపేయాలి.

Saturday, March 03, 2007

పీతల పులుసు


పీతలు 1 kg
ఉల్లిపాయలు 4
పచ్చిమిర్చి 4
లవంగాలు 2
యాలకులు 2
దాల్చిన చెక్కలు 2
ధనియాలు 2 tbsp
కొబ్బరి పొడి 3 tbsp
గసగసాలు 2 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
కొత్తిమిర 3 tbsp
పసుపు 1 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
నూనె 8 tsp
మజ్జిగ 1 గ్లాసు
చింతపండు పులుసు 1 కప్పు

పీతలను కాళ్ళు తీసేసి కావలసిన సైజులో కోసుకుని శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు,
మజ్జిగ పోసి బాగా రాసి కడగాలి. 2 ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి,కొబ్బరి,గసగసాలు,
ధనియాలు,గరం మసాలా అన్ని కలిపి మెత్తగా నూరుకుని ఈ కడిగి ఉంచుకున్న
ముక్కలకు ఉప్పు,కారం పసుపు కలిపి పట్టించాలి.వెడల్పాటి గిన్నెలో నూనె వేడి
చేసి తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి ఎర్రగా వేయించి ఈ పీతల ముక్కలు వేసి
వేయించి గ్లాసుడు నీళ్ళు పోసి ఉడకనివ్వాలి.ఉడికిన తర్వాత చింతపండు పులుసు,
కొత్తిమిర,కరివేపాకు వేసి కొంచెం సేపు ఉడికించి దింపేయాలి.

పీతల వేపుడు


పీతలు 1 kg
అల్లం వెల్లుల్లి 2 tsp
ఉల్లిపాయలు 4
నూనె 8 tsp
కొబ్బలిపొడి 3 tbsp
గసగసాలు 2 tsp
మజ్జిగ 1 గ్లాసు
లవంగాలు 6
యాలకులు 6
దాల్చిన చెక్క 4
ధనియాలు 2 tbsp
కొత్తిమిర 10 రెమ్మలు
కరివేపాకు 2 రెమ్మలు
పసుపు 1 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
పచ్చిమిర్చి 3

పీతలు శుభ్రపరచి మీక కావలసిన సైజులో ముక్కలు చేసుకుని కడిగి పెట్టుకోవాలి.
ఈ ముక్కలలో ఉప్పు,పసుపు వేసి గ్లాసు మజ్జిగ పోసి కొంచెం సేపు రాసి కడగాలి.
అల్లం వెల్లుల్లి,ఉప్పు కారం,పసుపు 2 లవంగాలు,2 యాలకులు,రెందు దాల్చిన
చెక్కలు మెత్తగా ముద్దగా నూరుకొని ఈ కడిగి ఉంచుకున్న ముక్కలకి బాగా
పట్టించాలి. రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి. మిగిలిన
రెండు ఉల్లిపాయలు, మిగిలిన మసాలా కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. పొయ్యిమీద
వెడల్పాటి బాణలి పెట్టి నూనె వేడి చేసి ఉల్లి పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించి పీతల
ముక్కలను వేసి ఐదు నిమిషాలు వేయించి సగం గ్లాసుడు నీళ్ళు పోసి నిదానంగా
ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత నూరి ఉంచిన మసాలా ముద్దను వేసి కొత్తిమిర,
కర్వేపాకు సన్నగా తరిగి వేసి నీరంతా ఇగిరిన తర్వాత దించుకోవాలి.

వేట తలకాయ పులుసు

తలకాయ కూర మాంసం 500 gm
ఉల్లిపాయలు 2
పసుపు 1/2 tsp
కారం 2 tsp
ధనియాల పొడి 2 tbsp
అల్లం వెల్లుల్లి 2 tsp
కరివేపాకు 1 tsp
చింతపండు పులుసు 1/2 కప్పు
గరం మసాలా 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp

ముందుగా మాంసం ముక్కలు అర కప్పు నీళ్ళు,కొద్దిగా పసుపు వేసి కుక్కర్లో
రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి.లేకుంటే పదినిమిషాలు మామూలుగా
ఉడికించాలి. ఇప్పుడు దానిలోని ఎముకలన్ని మెల్లిగా తీసేయాలి.వేరే బాణలిలో
నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి అల్లం వెల్లుల్లి,పసుపు,
కారం ధనియాల పొడి వేసి కొద్దిగా వేపి, మాంసం ముక్కలు,ఉప్పు కరివేపాకు
వేసి కలియబెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత పులుసు అర కప్పు
నీళ్ళు పోసి ఉడికించి నూనె తేలాక గరం మసాలా కొత్తిమిర చల్లి దింపేయాలి.

మాంసం మెదడు కూర




మెదడు 1
ఉల్లిపాయ 2
పచ్చిమిర్చి 2
అల్లం వెల్లుల్లి 1 tsp
పసుపు 1/4 tsp
కారం 1 tsp
ధనియాల పొడి 1 tbsp
కొత్తిమిర 1 కట్ట
ఉప్పు తగినంత
గరం మసాలా 1 tsp
నూనె 3 tbsp

ముందుగా మెదడును శుభ్రం చేసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. నూనె వేడి చేసి
సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి అల్లం వెల్లుల్లి,పసుపు, కారం వేసి
కొద్దిగా వేపి ధనియాల పొడి,ఉప్పు వేసి కలియబెట్టి కప్పుడు నీళ్ళు పోసి ఉల్లిపాయలు
మెత్తగా ఉడకనివ్వాలి.తర్వాత మెదడు ముక్కలు వేసి మెల్లిగా కలిపి మరో పది
నిమిషాలు నిదానంగా ఉడకనిచ్చి గరం మసాలా, కొత్తిమిర చల్లి దింపేయాలి.

మాంసం చుక్కకూర

మాంసం 250 gm
చుక్కకూర 5 కట్టలు
ఉల్లిపాయలు1
పచ్చిమిర్చి 2
అల్లం వెల్లుల్లి 1 tsp
కొబ్బరిపొడి 3 tsp
ధనియాల పొడి 1 tsp
గసగసాలు 1 tsp
గరం మసాల 1 tsp
పసుపు 1/2 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp

కొబ్బరి గసగసాలు పొడి చేసి పెట్టుకోవాలి.నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు
ఎర్రగా వేయించి పసుపు,కారం,అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేపి మాంసం ముక్కలు,
తగినంత ఉప్పు వేసి కలియబెట్టి మూత పెట్టాలి.నీరంతా ఇగిరిపోయాక రెండు
కప్పులు నీరు పోసి ముక్కలు మెత్తగా ఉడికేవరకు ఉంచాలి. ఇప్పుడు శుభ్రం చేసి
తరిగిన చుక్కకూర,కొబ్బరి ముద్ద,గరం మసాలా అందులో కలిపి నూనె తేలేవరకు
ఉడికించి దింపేయాలి.