Friday, December 29, 2006

కొర్రలతో పాయసం

కొర్రలు అంటే అంధ్రా రాయలసీమ దిక్కు ఎక్కువగా పండుతుంది. అది బియ్యంతో
సమానం. అన్నం లాగే వండుకుంటారు.ఇడ్లీ, దోశ కూడా చేసుకుంటారు. ఇందులో
చక్కెర శాతం చాల తక్కువగా ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా
ఉపయోగకారి. వరి అన్నం బదులు కొర్రన్నం చాలా మంచిది. దీనిని ఇంగ్లీషులొ
foxtail millet అంటారు. పెద్దల అమావాస్య రోజు కొర్రలతో పాయసం చేసి
పెద్దలకు నైవేద్యం పెడతారు..


కొర్రలు 1 కప్పు
పాలు 500 ml
చక్కెర
లేదా బెల్లం 100 gm
యాలకులు 4
నెయ్యి 2 tsp


ముందుగా కొర్రలను శుభ్రం చేసుకుని గ్లాసుడు నీళ్ళు పోసి గంటసేపు నాననివ్వాలి.
తరువాత వాటిని మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. పాలు పోసి అవి మరుగుతుండగా
చక్కెర కాని బెల్లం కాని వేసి చిక్కపడేవరకు ఉడికించి నెయ్యి, యాలకులపొడి వేసి
కలిపి దింపేయాలి.

Sunday, December 24, 2006

తేనీరు - T - వండర్స్



జీవించడానికి ప్రతి ఒక్కరికి కావాలి నీరు. బ్రతకడానికి అవారం లేకపోయినా అత్యధిక
జనాభా తాగేది టీ. టీ కున్న శక్తిని తెలుగువారే బాగా గుర్తించినట్టున్నారు. అందుకే
"తేనీరు" అని పేరు పెట్టారు. అన్ని పానీయాలు నీటిని ఉపయోగించి చేసేవే అయినా
ఒక్క టీకి మాత్రమే నీరు కలిపి వచ్చేలా పేరు పెట్టి నీటి తర్వాత టీనే ముఖ్యపానీయమని
తెలియచెప్పారు.మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే టీదుకాణంలేని
ప్రదేశం ఉండదు. చిన్న గ్రామం మొదలు మహా పట్టాణాలవరకు ప్రతిచోటా టీ బడ్డీలు
ఉంటాయి. టీ లేకుండా పార్టీలుండవు. నలుగురిని ఒకచోట పిలవాలంటే మనం ఏర్పాటు
చేసేది టీ పార్టీ.సమావేశాల్లో, క్రికెట్ పోటీలలో కూడా మధ్యలో "టీ" బ్రేక్ ఉంటుంది.
అతిథులు ఇంటికి వచ్చినప్పుడు చేసే సత్కారంలో "టీ" తప్పనిసరి.


టీ మొక్కల పెంపకం, కాచడం మొట్టమొదటగా కనుగొన్నది చైనీయులే. మన
దేశంలోని ఈశాన్య భారతదేశంలో ముఖ్యంగా అస్సాంలో అన్నీ టీ తోటలే.
మద్యాహ్నం టీ తాగడం అనే సంస్కృతి హాలెండ్ లో మొదలైంది. మద్యాహ్నం
అవగానే బిస్కెట్లు, టీ తాగడం వల్ల సాయంకాలపు పనికి తగిన శక్తి వచ్చేది.
అలా ఆ అలవాటు ఇప్పుడు ప్రపంచ ప్రజలందరి అలవాటు అయింది. టీ,
కాఫీలలో ఏది మంచిది అంటే అది త్రాగేవారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది.
రెండింటిలోనూ కెఫైన్ అనే పదార్ధం ఉంటుంది. తాజాగా జరిగిన పరిశొధనలో
టీ క్యాన్సర్ కి విరుగుడుగా పనిచేసే రసాయనాలని కలిగివుందని తేలింది.
టీలో బి.కాంప్లెక్స్ విటమిన్లు, నికొటిక్ యాసిడ్లు ఉన్నాయి. టీలోని కెఫైన్
వల్ల తాగగానే ఉత్తేజమొస్తుంది. టీ నుండి వచ్చే చక్కని వాసన, వగరుకు
మూలం దానిలోని తైలాలు. టీకి వచ్చే రంగు "టానిన్" వల్ల వస్తుంది.
ఆకులలోని పాలిఫినాల్స్ వల్ల టీకి యాంటియాక్సిడెంట్ గుణం వచ్చింది.

టీ పానీయాన్ని టీ ఆకులు, టీ లేత చిగుళ్ళు, లేత కొమ్మలనుండి కాస్తారు. కోసిన
టి అకులను ప్రొసెస్ చేస్తారు. ఏమేరకు ప్రోసెస్ చేశారనేదాన్ని బట్టి టీ ఆకులు
భిన్నంగా ఉంటాయి. రుచిగూడా భిన్నంగా ఉంటుంది.టీ వల్ల రక్తనాళాలలో రక్తం
గడ్డ కట్టుకోదు. కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది.
టీలోని విటమిన్లు, లవణాలు, మిథైల్ గ్జాంతైన్ లు వయసు లక్షణాన్ని త్వరగా
రాకుండా చేస్తాయి.ఈ పానీయం తాగేవారికి వైరల్, బాక్టీరియా వ్యాధులు అంత
సులభంగా సోకవు. టీలో ఉన్నయాంటి యాక్సిడెంట్స్ పండ్లు, కాయగూరలలో
కూడా దొరకవు.



గ్రీన్ టీని పానీయంగా కాక ఔషధంగా భావిస్తారు, దీనివల్ల ఎన్నో లాభాలున్నాయి.
గ్రీన్ టీ అధికంగా తీసుకునేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. దీనిలో
పాలిఫినాల్స్ యాంటి యాక్సిడెంట్స్ గా పనిచేస్తాయి. ముఖంగా మెదడు భాగంలో
బాగా పనిచేస్తాయి. ఎల్.డి.ఎల్, కొలెస్టరాల్ ,సీరం ట్రైగ్లిసరైడ్స్ స్తాయిని తగ్గిస్తుంది.
రక్తంలోని ప్లేట్లెట్లను ఒక చోటకి చేరు అతుక్కుపోకుండా చేస్తుంది గ్రీన్ టీ. అధిక
రక్తపోటుకు కారణాలలో ఒకటి మూట్రపిండాలనుండి విడుదలయ్యే ఏంజియో
టెన్షన్, కన్వర్టింగ్ ఎంజైం ప్రభావాన్ని గ్రీన్ టీలోని రసాయనాలు అడ్డుకోవడం వల్ల
రక్తపోటు వీలైనంత తగ్గుతుంది. గ్రీన్ టీ దంతక్షయాన్ని ఆపగల శక్తి కలిగి ఉంది,
రక్తంలో చక్కెర స్తాయి తగ్గుతుంది, పలు వైరస్ ల పాలిట మృత్యువు, కొన్ని
మేలు చేసే బాక్టీరియాలను పెంచుతుంది.





బ్లాక్ టీ: పాలు లేకుండా చేసేది బ్లాక్ టీ. ఇది రక్తం గడ్దకట్టనీయదు. తద్వారా గుండె
పోటును నివారిస్తుంది. ఉదర, పేగు, రొమ్ము క్యాన్సర్లు రావడం తగ్గుతుందని
పరిశోధకుల భావన. ఇది వాపులను తెచ్చే జన్యుప్రభావాన్ని అడ్దుకుటుంది.
సూక్ష్మజీవులను సం హరించగల శక్తి కలది. ముఖ్యంగా చర్మ వ్యాధులు, విరేచనాలు,
న్యుమోనియాకారక సూక్ష్మ జీవులను సమర్ధతతో నిరోధిస్తుంది.





అల్లం టీ: అల్లం వేసి కాచే టీ. ఈ టీ తాగితే జీర్ణ క్రియ మెరుగవుతుంది. కీళ్ళ
నొప్పుల ఉపశమనానికి కూడా మంచిది. తల తిరుగుడు ఊపిరితిత్తుల్లో కఫం
వంటి ఇబ్బందుల నుండి కూడా బయట పడేస్తుంది ఈ అల్లం టీ.




జాస్మిన్ టీ: దీనివలన మల్లెలవాసన, గ్రీన్ టీ కున్న యాంటి యాక్సిడెంట్ గుణాలు
రెండు కలిసి వస్తాయి. ఇది తాగితే అలసిన శరీరం తేలికపడుతుంది. శరీరానికి కొత్త
ఉత్సాహాం వస్తుంది. జీర్ణ క్రియలో ఉన్న హెచ్చు తగ్గులు సరిదిద్దబడుతాయి. రక్తంలో
కొలెస్ట్రాల్ తగ్గించే గుణం, జీవితకాలం పెంచే శక్తి జాస్మిన్ టీ కి అధికంగా ఉంది.




మసాలా టీ: మసాలా టీలో శొంఠి, దాల్చిన చెక్క వేస్తారు. ఇది ఘాటుగా ఉండే టీ.ఈ
మసాలాదినుసులన్ని వేసి డికాక్షన్ బాగా మరిగించినందున ఆ దిసుసుల్లోని
రసాయనాలు టీలో చేరతాయి. దాల్చిన చెక్క రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగు
పరుస్తుంది. జీర్ణ క్రియ మెరుగవుతుంది.అంటు వ్యాధులు రాకుండా కాపాడుతుంది.


ఏది ఏమైనా దేవతలందరూ తాగేది అమృతమైతే భూలోకంలో ప్రజలందరూ తాగే అమృతం టీ.









Friday, December 22, 2006

వందవ టపా .. సగ్గుబియ్యం పాయసం


ఈ రోజు నాకు ఎంతో సంతోషకరమైన రోజు..ఇవాళా నా పుట్టిన రోజు ఇంకా ఈ

బ్లాగులో నా వందవ టపా ఇదే. రెండు విధాల పండుగను జరుపుకోవడం నా

అదృష్టం గా భావిస్తున్నాను. ఆదరిస్తున్న అందరికీ నా కృతజ్ఞతలు. అందరికి

కాస్త నోరు తీపి చెయనా.


సగ్గుబియ్యం 100 gm

పాలు 500 ml

పంచదార 150 gm

యాలకులు 4

జీడిపప్పు 6

నెయ్యి 3 gm



ముందుగా సగ్గుబియ్యం అరగంట నానబెట్టాలి.తరువాత అదే నీళ్ళలోపాలు

పోసి అవి పారదర్శకమయ్యేవరకు ఉడికించాలి. తరువాత పంచదార, యాలకుల

పొడి,నెయ్యి, జీడిపప్పు అన్ని వేసి కొద్దిసేపు ఉడికించి దింపేయాలి.

Thursday, December 21, 2006

అరిసెలు


బియ్యం 250 gm
బెల్లం 250 gm
నెయ్యి 3 gm
యాలకుల పొడి 1 tsp
నూనె వేయించడానికి


బియ్యం రెండు గంటలు నానబెట్టాలి. తరువాత బియ్యాన్ని తడి మీదనే మెత్తగా
పొడి చేసుకోవాలి ఆరనివ్వొద్దు. బెల్లం లో అరకప్పు నీరు పోసి ముదురుపాకం
పట్టుకోవాలి. యాలకులపొడి నెయ్యి వేసి కలిపి దింపేసి తడి బియ్యం పిండి వేసి
మొత్తం బాగా కలపాలి. నూనె వేడి చేసి, బియ్యం పిండిని చిన్న చిన్న ఉండలుగా
చేసుకుని, ప్లాస్టిక్ కాగితంపైగాని అరిటాకుపైగాని నెయ్యి రాసుకుని చేతితో
పూరీల్లాగా వత్తుకుని నూనెలో నిదానంగా ఎర్రగా వేయించుకోవాలి.ఇష్టముంటే
నెయ్యిలో కూడా కాల్చుకోవచ్చు.నూనెలో నుండి తీసి అరిసెలు వత్తే పీటపైగాని
రెండు చిల్లుల గరిటలతోగాని వత్తి నూనె అంతా తీసేసి విడిగా ఆరనివ్వాలి.

వడ


మినప్పప్పు 100 gm

పచ్చిమిర్చి 3

ఉప్పు తగినంత

నూనె వేయించడానికి



ముందుగా మినప్పప్పును రెండుగంటలపాటు నానబెట్టి, మిక్సీలో పచ్చిమిర్చితో

కలిపి మెత్తగా కాటుకలా రుబ్బుకోవాలి. తరువాత నూనె వేడి చేసి నిమ్మకాయంత

సైజులో పిండి ముద్ద తీసుకుని చేతితో తట్టి మధ్యలో చిల్లు పెట్టి నూనెలో నిదానంగా

ఎర్రగా వేయించి సాంబార్ లేదా చట్నీతో తినాలి.

చక్ర పొంగలి


బియ్యం 100 gm

బెల్లం 150 gm

యాలకులు 5

నెయ్యి 50 gm

జీడిపప్పు 8



ముందుగా బియ్యం కడిగి అరగంట నాననివ్వాలి. తర్వాత మెత్తగా ఉడికించాలి.

అందులో తరిగిన బెల్లం వేసి మొత్తం కరిగేవరకు ఉడికించాలి.జీడీప్పు నేతిలో

వేయించి, యాలకులపొడి మిగతా నెయ్యి మొత్తం అన్నంలో కలిపి దించేయాలి.

పొంగలి


బియ్యం 250 gm
పెసరపప్పు 100 gm
పచ్చిమిర్చి 3
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/2 tsp
మిరియాలు 6
కరివేపాకు 1 tsp
జీడిపప్పు 6
నెయ్యి లేదా నూనె 2 tbsp
ఉప్పు తగినంత



ముందుగా బియ్యం, పెసరపప్పు శుభ్రపరచి కడిగి అరగంట నానబెట్టాలి. నూనె లేదా
నెయ్యి వేడి చేసి ఆవాలు ,జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు, మిరియాలు,
పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా వేపి మూడు గ్లాసుల నీళ్ళు పోసి తగినంత ఉప్పు
వేయాలి. బియ్యం, పప్పులో నీళ్ళనీ వంపేసి మరుగుతున్న నీళ్ళలో వేసి కలపాలి.
అది మొత్తం మెత్తగా ఉడికాక గరిటతో మెదిపి దింపేయాలి.

పాలతో మైసూర్ పాక్





పంచదార 150 gm

శనగపిండి 150 gm

నెయ్యి 150 gm

పాలు అర కప్పు



పంచదార శనగపిండి, పాలని ఒక గిన్నెలో ఉండలు లేకుండా కలపాలి. అందులో అర
కప్పు నీళ్ళు పోసి కలిపి పొయ్యి మీద దళసరి గిన్నె పెట్టి అందులో ఈ మిశ్రమాన్ని పోసి
అడుగంటకుండా సన్నని సెగ మీద కలియబెడుతు ఉండాలి. మధ్య మధ్యలో కరిగించిన
నెయ్యి కొద్ది కొద్దిగా పోస్తూకలియబెడుతూ ఉండాలి.బాగా దగ్గర పడి నెయ్యి పూర్తిగా
అయిపోయేవరకు ఉంచి దానిని ఒక నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి బాగా నెరపి
కావల్సిన సైజులో కోసుకోవాలి. ఇది కూడా మృదువుగా ఉంటుంది.

కాజూ మైసూర్ పాక్


శనగపిండి 150 gm

పంచదార 200 gm

నెయ్యి 150 gm

జీడిపప్పు 150 gm



ముందుగా జీడిపప్పును బరకగా పొడి చేసుకోవాలి. దానిని శనగపిండిలో కలపాలి.
పొయ్యిమీద దళసరి గిన్నెగాని మూకుడుగానీ పెట్టి పంచదారలో అర కప్పు నీరు
పోసి లేత పాకం వచ్చేవరకు మరిగించి జీడిపప్పు, శనగపిండి మిశ్రమాన్ని వేసి
ఉండలు లేకుండా కలపాలి. అల కలుపుతూ మధ్య మధ్యలో కరిగించిన నెయ్యిని
గరిటతో పోస్తూ కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరపడి శనగపిండి మిశ్రమం గుల్ల
విచ్చి బుస బుస పొంగుతుంది. అప్పుదు దింపి నెయ్యి రాసిన పళ్ళెంలో పోసి
సమానంగా అయ్యేలా నెరిపి కావల్సిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి.
ఇది మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది.

కాలిఫ్లవర్ కూర


కాలిఫ్లవర్ 250gm
ఉల్లిపాయలు 2
టొమాటోలు 3
పచ్చిమిర్చి 2
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
కారం పొడి 1 tsp
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
గరం మసాలా 1 tsp
నూనె 3 tsp


ముందుగా కాలిఫ్లవర్ ను చిన్న చిన్న ముక్కలుగా కోసి ఉప్పు వేసిన వేడినీటిలో
పది నిమిషాలు ఉంచాలి. దీనివలన అందులో ఎవన్నా పురుగులుంటే
చచ్చిపోతాయి.నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మెత్త్పడేవరకు
వేయించాలి.పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు,పసుపు వేసి కొద్దిగా వేపి
కాలిఫ్లవర్ ముక్కలు, టొమాటో ముక్కలు, కారం, ఉప్పు వేసి బాగా కలిపి మూత
పెట్టాలి. చిన్న సెగపై నిదానంగా ఉడకనివ్వాలి. అవసరమనుకుంటే కప్పుడు
నీళ్ళు పోయాలి. చివరగా కొత్తిమిర, గరం మసాలా పొడి కలిపి దించేయాలి.

Wednesday, December 20, 2006

క్యాబేజీ బఠానీల కూర


క్యాబేజీ 250 gm
పచ్చి బఠానీలు 100 gm
ఉల్లిపాయలు 2
పచ్చిమిర్చి 2
అల్లం వెల్లుల్లి 1 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
కారం పొడి 1 tsp
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
గరం మసాలా 1 tsp
ఆవాలు 1/4tsp
జీలకర్ర 1/2 tsp
నూనె 3 tsp



ముందుగా క్యాబేజీని, ఉల్లిపాయలను సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెడల్పాటి
బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఉల్లిపాయలు,
పచ్చిమిర్చి వేసి అవి మెత్తపడేవరకు వేయించాలి. ఇప్పుడు పసుపు, అల్లం
వెల్లుల్లి, కరివేపాకు, బఠానీలు వేసి మరి కాస్త వేపి క్యాబేజి,కారం, ఉప్పు వేసి
బాగా కలిపి మూత పెట్టాలి. చిన్న సెగపై ఉడికిపోతుంది. తర్వాత కొత్తిమిర
చల్లి దింపేయాలి.

చోలె బటూర


కాబూలీ శనగలు 1 1/2 కప్పు
ఉప్పు తగినంత
వేయించిన జీలకర్ర 1 tsp
చాట్ మసాలా 1tsp
ధనియల పొడి 2 tsp
కారం పొడి 1/2 tsp
చింతపండు రసం 1/4 tsp
యాలకులు 3

దాల్చిన చెక్క 2
తేజ్ పత్తా 4
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 2
కొత్తిమిర 2 tsp
మైదా 1 కప్పు
గోధుమపిండి 2 కప్పులు
పెరుగు 1/4 కప్పు
నూనె 1 tsp
చక్కెర 1 tsp
ఉప్పు 1 tsp
వంట సోడా చిటికెడు
నూనె వేయించడానికి


గోధుమపిండి,మైదా కలిపి అందులో పెరుగు, సోడా,నూనె, ఉప్పు, చక్కెర కలిపి
చపాతీ పిండిలా కలిపి మూత పెట్టి ఉంచాలి. కాబూలీ శనగలు ఉప్పు కలిపిన
నీళ్ళలో కనీసం ఐదారు గంటలు నానపెట్టాలి.తర్వాత అందులో దాల్చినచెక్క,
యాలకులు తెజ్ పత్తా వేసి కుక్కర్లో ఉడకబెట్టలి.తర్వాత కొద్దిగా వెన్న వేడి
చేసి ఈ శనగల మిశ్రమాన్ని పోసి అందులో చింతపండు రసం, జీలకర్ర,
కారప్పొడి, చాట్ మసాల,ధనియాలపొడి, ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి
ముక్కలు, కొత్తిమిర వేయాలి. బాగా ఉడికి చిక్కగ అయ్యకా దింపేయాలి.
ఇప్పుడు పొంగిన చపాతీ పిండిని ఉండలుగా చేసుకుని పూరీలాగా వత్తుకుని
వేడి నూనెలో ఎర్రగా కాల్చి తీసి ఈ బటూర(శనగల కూర)తో వడ్డించాలి.

గ్రుడ్ల ఖుర్మా


గ్రుడ్లు 4
ఉల్లిపాయలు 100 gm
టొమాటొలు 3
పచ్చిమిర్చి 2
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
ఎందుకొబ్బరిపొడి 2 tsp
ధనియాలపొడి 2 tsp
గసగసాలు 1 tsp
గరం మసాలా 1 tsp
పెరుగు 50 gm
అల్లం వెల్లుల్లి 2 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp



ముందుగా గ్రుడ్లను ఉడకబెట్టి పెంకు తీసి చాకుతో గాట్లు పెట్టి ఉంచాలి. నూనె వేడి
చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు మెత్తపడేవరకు వేయించాలి. పసుపు, అల్లం
వెల్లుల్లి, కరివేపాకు, టొమాటో ముక్కలు వేసి అవి మెత్తపడేవరకు వేయించాలి.
కొబ్బరిపొడి, వేయించిన గసగసాలు, ధనియాలపొడి, గరం మసాలా పొడి, పెరుగు
కలిపి మెత్తగా రుబ్బుకొని ఉడుకుతున్న కూరలో కలపాలి. కొద్ది సేపు ఉడికిన
తర్వాత గ్రుడ్లు, కారం ,ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. నూనె తేలిన తర్వాత
కొత్తిమిర చల్లి దింపేయాలి.

గ్రుడ్ల కూర




గ్రుడ్లు 4
ఉల్లిపాయలు 3
టొమాటోలు 4
పచ్చిమిర్చి 2
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
కారం పొడి 1 tsp
పసుపు 1/2tsp
గరం మసాలా 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp



ముందుగా గ్రుడ్లను ఉడకబెట్టి పెంకు తీసి చాకుతో గాట్లు పెట్టి ఉంచుకోవాలి.
నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేవరకు
వేయించాలి.కరివేపాకు, అల్లం వెల్లుల్లి, పసుపు వేసి కాస్త వేపి టొమాటో
ముక్కలు, కారం, ఉప్పు, గరం మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టాలి.
టొమాటోలు మెత్తపడ్డాక అర కప్పు నీరు పోసి గ్రుడ్లను వేసి కలిపి మూత
పెట్టాలి.కూర బాగా ఉడికి నూనె తేలాక కొత్తిమిర చల్లి దింపేయాలి.

రొయ్యల కూర


తాజా రొయ్యలు 250 kg
ఉల్లిపాయలు 100 gm
టొమాటోలు 125 gm
పచ్చిమిర్చి 3
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
కారం పొడి 2 tsp
పసుపు 1/2 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
గరం మసాల పొడి 1 tsp
ఉప్పు తగినంత
నూనె 4 tbsp



ముందుగా వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు
మెత్తబడేవరకు వేయించాలి. తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు అల్లం
వెల్లుల్లి వేసి కొద్దిగా వేపిన తర్వాత శుభ్రపరచిన రొయ్యలు, కారం తగినంత
ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి.నీరంతా ఇగిరిపోయాక సన్నగా తరిగిన
టొమాటో ముక్కలు వేసి కలిపి, కప్పుడు నీళ్ళు పోసి ఉడకనివ్వాలి. నూనె
తేలిన తర్వాత గరం మసాల పొడి, కొత్తిమిర చల్లి దించేయాలి.

Tuesday, December 19, 2006

చికెన్ మసాలా కూర




చికెన్ 1 kg
ఉల్లిపాయ 3
అల్లం వెల్లుల్లి 2 tsp
కారం పొడి 2 tsp
పసుపు 1/2 tsp
ధనియాల పొడి 3 tbsp
గరం మసాలా 1 tsp
టొమాటో 200 gm
కొత్తిమీర 2 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp



ముందుగా టోమాటోలు,ఉల్లిపాయలు ముక్కలుగ కోసి విడివిడిగా రుబ్బుకోవాలి.
ఇప్పుడు వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముద్దను ఎర్రగా
అయ్యెవరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి వేయించాలి. ఇప్పుడు
టొమాటో ముద్దను వేసి వేయించాలి. కారం, పసుపు, ధనియాలపొడి వేసి కాస్త
వేయించి చికెన్ ముక్కలు తగినంత ఉప్పు వేసి అన్ని బాగా కలిపి మూత పెట్టాలి.
నిదానంగా నూనె తేలేవరకు ఉడికించాలి. కొత్తిమిర చల్లి దింపేయాలి.

చికెన్ కూర


చికెన్ 1 kg
ఉల్లిపాయలు 100 gm
పచ్చిమిర్చి 3
అల్లంవెల్లుల్లి 3 tsp
కారం పొడి 2 tsp
పసుపు 1/2 tsp
ధనియాలపొడి 2 tsp
గరం మసాలా 1 tsp
టోమాటో 3
కొత్తిమిర 1కట్ట
నూనె 4 tsp


ముందుగా నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు బంగారు రంగులో
కొచ్చేవరకు వేయించి పచ్చిమిర్చి,పసుపు, అల్లంవెల్లుల్లి, కారం పొడి వేసి
కొద్దిగా వేపి శుభ్రపరచిన చికెన్ ముక్కలు వేసి కలిపి తగినంత ఉప్పు,
గరం మసాలా, ధనియాల పొడి వేసి మొత్తం బాగా కలిపి మూత పెట్టాలి.
చిన్న సెగపై నీరు ఎక్కువ పోయకుండానె ఉడికిపోతుంది. కొత్తిమిర
చల్లి దించేయడమే.

చేప వేపుడు


కొఱమీను చేపలు 1 kg
కారం పొడి 2 tsp
పసుపు 1/2 tsp
ధనియాలపొడి 4 tsp
గరం మసాలా 1 tsp
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి


ముందుగా చేపను శుభ్రపరచి ఒక అంగుళం ముక్కలుగ కట్ చేసి పెట్టుకోవాలి.
దీనికి పెద్ద చేపలైతే బావుంటాయి ఎక్కువ ముల్లులుండవు. మసాలాలన్నీ
కలిపి కొద్దిగా నీళ్ళు చల్లి ఈ ముక్కలకు అన్ని వైపులా పట్టించి ఓ పది
నిమిషాలు అలా ఉంచి పెనంపైగాని నూనెలో గాని ఎర్రగా వేయించుకోవాలి.
కాస్త నిమ్మరసం చల్లి వడ్డించాలి.

తందూరీ చికెన్


చికెన్ 1 kg
పెరుగు 250 gm
నిమ్మకాయ 1
పుదీనా 1 కట్ట
కొత్తిమీర 1 కట్ట
గరం మసాలా 1 tsp
కారం పొడి 2 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
పసుపు 1/2 tsp
చాట్ మసాలా 2 tsp
రెడ్ ఆరెంజ్ కలర్ చిటికెడు
ఉప్పు తగినంత
నూనె 50 gm



ముందుగా చికెన్ ను శుబ్రంగా కడిగి, చర్మం తీసేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి,
కొద్ది సేపు నీరంతా పోయేలా ఆరనివ్వాలి.వాటికి కొంచం ఉప్పు, నిమ్మరసం పట్టించి
పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగును బాగా కలిపి అందులో పుదీనా, కొత్తిమీర,
మిగిలిన వస్తువులన్నింటిని కలిపి ముద్దగా రుబ్బుకొని ఈ చికెన్ ముక్కలను
కలిపి గంటపాటు నాననివ్వాలి. ఇప్పుడు ఈ ముక్కలను తీసి ఒక చువ్వకు గుచ్చి
బొగ్గులపొయ్యిమీద గాని తందూర్ ఒవెన్లో గాని పదిహేను నిమిషాలు తిప్పుతూ
ఎర్రగా కాల్చాలి.

Monday, December 18, 2006

స్వీట్ కార్న్ పాయసం

మొక్కజొన్నగింజలు 2 కప్పులు
బెల్లం 1 కప్పు
యాలకులు 4
బియ్యప్పిండి 2 tsp
పాలు 1/2 లీటరు


ముందుగా రెండు కప్పుల నీళ్ళలో మొక్కజొన్నగింజలు చిటికెడు ఉప్పు కలిపి
మెత్తగా ఉడికించాలి.ఇప్పుడు బెల్లం చేర్చి పూర్తిగా కరిగాక పాలు పోసి ఉడికించాలి.
తరువాత బియ్యంపిండిలో కాసిన్ని నీళ్ళు కలిపి ఉడుకుతున్న పాయసంలో వేసి
కలిపి చిక్కబడ్డాక యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి.

మొక్కజొన్న వడ

లేత మొక్కజొన్నగింజలు 2 కప్పులు
పచ్చిమిర్చి 4
అల్లం 1 ' ముక్క
కొత్తిమిర 1/4 కప్పు
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి


మొక్కజొన్నగింజలు, అల్లం పచ్చిమిర్చి కలిపి బరకగా రుబ్బి ఉప్పు, సన్నగా తరిగిన
కొత్తిమిర కలిపి వేడి నూనెలో వడల్లాగా వత్తుకుని ఎర్రగా కాల్చి వేడి మీద తినాలి.

కార్న్ ఇన్ కోన్

లేత మొక్కజొన్నలు 2 కప్పులు
ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు
టోమాటో ముక్కలు 1 కప్పు
పచ్చిమిర్చి 2
కొత్తిమిర 1/4 కప్పు
చాట్ మసాలా 1 tsp
ఐస్ క్రీం కోన్ లు 5
ఉప్పు తగినంత


పైన చెప్పిన వస్తువులన్ని కలిపి కోన్లలో నింపి పైన కాస్త కొత్తిమిర చల్లి
అప్పటికప్పుడే తినవచ్చు. కావాలంటే కాస్త నిమ్మరసం కూడా చేర్చుకోవచ్చు.

బేబీ కార్న్ కూర


బేబీ కార్న్ కండెలు 8 చిన్న ముక్కలు
ఉల్లిపాయ 2
జీలకర్ర 1/2 tsp
ఆవాలు 1/4 tsp
బిరియాని ఆకు 2
లవంగాలు 4
దాల్చినచెక్క 2
పచ్చిమిరపకాయ 1
అల్లం వెల్లుల్లి 1 tsp
కారం 1 tsp
ధనియాలు 1 tsp
జీలకర్ర పొడి 1 tsp
పసుపు 1/4 tsp
పెరుగు 1 కప్పు
ఉప్పు తగినంత
కొత్తిమిర 2 tsp
నూనె 3 tbp


బాణలిలో నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయముక్కలు వేసి కొద్దిగా వేపి
లవంగాలు, దాల్చినచెక్క,అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి మళ్ళి కొద్దిగా
వేయించాలి. కండె ముక్కలు , కారం, ధనియాలు, జీలకర్రపొడి, పసుపు, ఉప్పు
వేసి ముక్కలకు మసాలా పట్టేవరకు వేయించాలి. అరకప్పు నీరు పోసి,ముక్కలు
ఉడికేవరకు ఉంచాలి. తర్వాత గిలకొట్టిన పెరుగు వేసి కలియబెట్టి నూనె తేలేవరకు
ఉంచి కొత్తిమిర చల్లి దించేయాలి.

Saturday, December 16, 2006

మొక్కజొన్న పలావ్ , కుర్మా

బాస్మతి బియ్యం 3 కప్పులు
అన్ని రక్కల కూరగాయముక్కలు 1/2 కప్పు
లేత మొక్కజొన్న గింజలు 1/2 కప్పు
బిరియాని ఆకు 2
దాల్చిన చెక్క 1 " ముక్క
యాలకులు 4
లవంగాలు 5
షాజీరా 1 tsp
ఉల్లిపాయ 1 చిన్నది
పుదీనా 2 tsp
పచ్చిమిర్చి 2
పసుపు చిటికెడు
నెయ్యి 2 tsp
నూనె 2 tsp
ఉప్పు తగినంత


కుర్మా కోసం

ఉల్లిపాయలు 2
ధనియాల పొడి 1 tsp
జీలకర్ర పొడి 1 tsp
కారం పొడి 1 tsp
పంచదార 1/4 tsp
మీగడ 2 tsp
నెయ్యి లేదా నూనె 2 tsp
ఉప్పు తగినంత


ముద్దగా నూరాల్సినవి
వెల్లుల్లి 3రెక్కలు
అల్లం ముక్క 1/2"
యాలకులు 2
జీడిపప్పు 2 tsp
గసగసాలు 1 tsp



బియ్యం కడిగి పదినిమిషాలు నాననివ్వాలి. నూనె,నెయ్యి కలిపి వేడి చేసి బిరియాని
ఆకు, గరం మసాల వస్తువులు వేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు,
పచ్చిమిర్చి,పుదీన వేసి కాస్త వేపాలి. ఇప్పుడు కూరగాయలు, మొక్కజొన్న గింజలు
వేసి వేపి 6 కప్పుల నీళ్ళు పోసి తగినత ఉప్పు వేసి మరగనివ్వాలి. కడిగిన బియ్యం
నీళ్ళు ఒంపేసి అందులో వేయాలి.మొత్తం ఉడికినతర్వాత దింపేయాలి.

కుర్మా


నెయ్యి వేడి చేసి ఉల్లిపాయలను బంగారు రంగువరకు వేయించాలి నూరిన ముద్ద,
ధనియాలపొడి, జీలకర్ర పొడి, కారం తగినంత ఉప్పు కలిపి సన్న సెగపై నెయ్యి
మసాలా నుండి విడిపడేవరకు ఉడికించాలి కొంచం నీరు పోసి కలిపి దించి మీగడా
వేసి కలిపి కొత్తిమిర చల్లి ఈ పలావ్ తొ వడ్డించాలి.


పెరుగు చట్నీ


పెరుగు 1 కప్పు
ఉల్లిపాయ 1
కొత్తిమిర 2 tsp
ప చ్చిమిర్చి 1
ఉప్పు తగినంత


ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని చాల చిన్న ముక్కలుగా తరిగి పెరుగులో వేసి తరిగిన
కొత్తిమిర, ఉప్పు వేసి బాగా కలిపి ఈ పలావ్ తో కలిపి వడ్డించాలి.

మొక్కజొన్న ఉప్మా

బొంబాయి రవ్వ 2 కప్పులు
లేత మొక్కజొన్నగింజలు 1 కప్పు
పచ్చిమిర్చి 4
క్యారట్ ముక్కలు 1/4 కప్పు
ఆవాలు 1/2 tsp
జీలకర్ర 1/4 tsp
మినప్పప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
తరిగిన ఉల్లిపాయ 1
అల్లం 1' ముక్క
కరివేపాకు 1 రెబ్బ
కొత్తిమిర 2 tbsp
ఉప్పు తగినంత
నూనె 4 tbsp
నెయ్యి 2 tsp


ముందుగా నెయ్యి వేడి చేసి రవ్వ బాగా వేయించుకోవాలి.బాణలిలో
నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాకా పప్పులు
వేయాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు, క్యారట్
ముక్కలు వేసి కాస్త వేపాలి. ఇప్పుడు మొక్కజొన్న గింజలు కూడా
వేసి కొద్దిగా వేపి అరకప్పు నీళ్ళు పోసి మూత పెట్టి ఉడికించుకోవాలి.
తర్వాత మూడు కప్పుల నీళ్ళు పోసి తగినంత ఉప్పు వేసి మరగ
నివ్వాలి. నీళ్ళు బాగా మరుగుతుండగా వేయించిన రవ్వ మెల్లిగా
పోస్తూ ఉండలు కట్టకుండా కలుపాలి. ఇది సన్నటి మంటపై
ఉడకనిచ్చి కొత్తిమిర నిమ్మరసం చల్లి దించేయాలి.
ఇది చాల రుచిగా ఉంటుంది.

మొక్క జొన్న దోసె


మొక్క జొన్నలు 1 కప్పు
బియ్యం 1 కప్పు
ఉప్పు తగినంత



ముందుగా బియ్యం, మొక్కజొన్నలు బాగా కడిగి నలుగు గంటలు
నానబెట్టాలి. అవి నానిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి. తరువాత
వేడి పెనంపై దోసె వేసి చక్కగా దోరగా వేయించాలి. దీనిని కొబ్బరి
చట్నీకాని, పుదీనా చట్నీతో కాని తినొచ్చు

మొక్కజొన్న సమోసా


మొక్కజొన్నలు 1 కప్పు
తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు
ఉడికించి ఉంచుకున్న
ఆలుగడ్డ ముక్కలు 1 కప్పు
కారం పొడి 1 tsp
గరం మసాలా పొడి 1/2 tsp
ఆవాలు 1/4 tsp
నూనె వేయించడానికి
ఉప్పు తగినంత
మైదా 1కప్పు
బొంబాయిరవ్వ 1/2 కప్పు


ముందుగా మైదా రవ్వ కలిపి కాస్త ఉప్పు వేడి నూనె కాని, కరిగించిన
డాల్డా కాని వేసి పూరీపిండిలా కలిపి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో
నూనె వేసి అందులో కాస్త ఆవాలు వేసి ఉల్లిపాయ ముక్కలు,
మొక్కజొన్నలు కూడా వేసి బాగా వేగనివ్వాలి. తరువాత ఉడికిన
బంగాళాదుంప ముక్కలు గరం మసాలా పొడి, ఉప్పు, కారం వేసి బాగా
కలపాలి. ఇలా కూరను తయారుచేసుకోవాలి.ముందుగా కలిపి వుంచు
కున్న పిండిని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి. వాటిని మధ్యగా
కోసి ఒక్కో భాగాన్ని త్రికోణంగా మడిచి మధ్యలో కూరను వుంచి
సమోసాలా తయారుచేసుకుని, నూనెలో దోరగా బంగారు రంగు
వచ్చేవరకు వేయించి పుదీనా చట్నీతో తింటే రుచిగా ఉంటాయి.

మొక్క జొన్న సలాడ్


లేత మొక్కజొన్నలు 2 కప్పులు
తురిమిన క్యారట్ 1/2 కప్పు
క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు
కీరదోస ముక్కలు 1/2 కప్పు
తరిగిన పచ్చిమిర్చి 2
కరివేపాకు 1 రెబ్బ
నిమ్మరసం 1 స్పూను
ఉప్పు తగినంత
నూనె 1 స్పూను


మొక్కజొన్నలు బాగా కడిగి అందులోకి క్యారట్, క్యాప్సికం , దోసకాయ,
పచ్చిమిర్చిముక్కలు, తగినంత ఉప్పు నిమ్మరసం చేర్చి బాగా కలపాలి.
బాణలిలో నూనె వేడి చేసి అందులో ఆవాలు, కరివేపాకు వేసి తాళింపు
వెయ్యాలి. చలారాక సలాడ్ లో వేసి కొత్తిమిరతో అలంకరించాలి. దీనిని
అలాగే తినొచ్చు లేదా చపాతీ, రొట్టెలతో కూడా తినవచ్చు.

Wednesday, December 13, 2006

కొబ్బరి పచ్చడి




పచ్చి కొబ్బరి 1 కప్పు

పచ్చిమిర్చి 3

పుట్నాలపప్పు 1/4 కప్పు

అల్లం 1 ' ముక్క

పెరుగు 1/4 కప్పు

ఆవాలు 1/4 tsp

కరివేపాకు 1 రెబ్బ

నూనె 2 tsp



ఇవి అన్నీ కలిపి మెత్తగా రుబ్బి పోపు పెట్టుకోవాలి.

పుదీనా పచ్చడి





పుదీనా 1 కప్పు

చింతపండు 50 gm

నువ్వులు 50 gm

ఎండుమిర్చి 5

జీలకర్ర 2 tsp

ధనియాలు 2 tsp

ఆవాలు 1 tsp

కరివేపాకు 2 రెబ్బలు

ఉప్పు తగినంత

నూనె 3 tbsp



పుదీనా కడిగి ఆరబెట్టుకోవాలి.చింతపండు కొద్ది నీళ్లలో నానబెట్టాలి. ఒక స్పూను

నూనెలో ఎండుమిర్చి,జీలకర్ర,ధనియాలు వేపి పక్కన పెట్టి పుదీనా కూడా

వేయించాలి. నువ్వులు వేయించాలి. ఇవి అన్నియు కలిపి ఉప్పు వేసి మెత్తగా

రుబ్బి పోపు పెట్టుకోవాలి.

ఉసిరి ఆవకాయ




ఉసిరికాయలు 1 kg

నూనె 250 gm

ఉప్పు 250 gm

కారం పొడి 125 gm

పసుపు 25 gm

జీలకర్ర పొడి 25 gm

మెంతిపొడి 10 gm

ఆవ పొడి 100 gm

ఇంగువ చిటికెడు

ఆవాలు 1 tsp

జీలకర్ర 1 tsp

మెంతులు 1/2 tsp



ముందుగా ఉసిరికాయలను కడిగి తుడిచి వేడి నూనెలో కాస్త మెత్తపడేవరకు

వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఇంగువ వేసి ఆవాలు, జీలకర్ర,

మెంతులు వేసి చిటపటలాడాక దింపి చాలారాక కారం, పసుపు, జీలకర్ర పొడి,

మెంతిపొడి, ఆవపొడి ఉసిరికాయలు అన్నీ వేసి కలిపి జాడీలో పెట్టుకోవాలి.

కొత్తిమిర పచ్చడి



కొత్తిమిర 1 కప్పు
చింతపండు నిమ్మకాయంత
ఎండుమిర్చి 4
జీలకర్ర 2 tsp
ధనియాలు 2 tsp
మినపప్పు 1 tsp
శనగపప్పు 1 tsp
నూనె 3 tbsp
కరివేపాకు 2 రెబ్బలు
ఉప్పు తగినంత



కొత్తిమిర కడిగి సన్నగా తరిగి ఒక చెంచాడు నూనెలో కొద్దిగా వేపి
పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు,
పప్పులు వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇందులో కొత్తిమిర,
చింతపండు ఉప్పు కలిపి మళ్లీ మెత్తగా రుబ్బి పోపు పెట్టాలి.

నిమ్మ ఊరగాయ


నిమ్మకాయలు 1 kg
నిమ్మకాయలు 10
ఉప్పు 250 gm
పచ్చళ్ళ కారంపొడి 125gm
జీలకర్ర పొడి 1 tbsp
మెంతిపొడి 1 tsp
పసుపు 25 gm
నూనె 250 gm


ముందుగా నిమ్మకాయలు కోసి ఒక కిలో తూకం చేసి పెట్టుకోవాలి. ఇలా
తూకంతో పెట్టుకుంటే ఊరగాయ పాడవుతుందనే బెంగ ఉండదు.కొలతలన్ని
సరిగ్గా ఉంటాయి. ఈ ముక్కలలో పసుపు,ఉప్పు మిగతా నిమ్మకాయలతో
తీసిన రసం అందులో వేసి బాగ కలిపి మూతపెట్టాలి. అలా ఓ వారం
ముక్కలన్ని ఊరిన తర్వాత పోపు చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలనుకుంటే
అప్పుడు కొంచం కొంచం తీసి పోపు చేసుకు0టే ఊరగాయ రుచిగా ఎర్రగా
ఉంటుంది. నూనె కాచి అందులో కాస్త ఆవాలు జీలకర్ర ఇంగువ వేసి
చిటపటలాదాకా దింపి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కారం, జీలకర్ర,
మెంతిపొడి కలిపి ఈ నిమ్మ ముక్కల మిశ్రమాన్ని వేసి కలపాలి. అంతే.

ఎగ్ డ్రాప్ సూపు


బీన్స్,క్యాబేజీ,క్యారట్,కాప్సికం,బటానీలు 1 కప్పు

మిరియాలపొడి 1 tsp

ఉప్పు తగినంత

అజినొమొటో చిటికెడు

సొయాసాస్ 1/4 tsp

గ్రుడ్లు 2

కార్న్ ఫ్లోర్ 1 tbsp




ముందుగా కూరగాయలను చాల చిన్న ముక్కలుగా తరిగి మూడుగ్లాసుల నీరు

పోసి ఉడికించాలి. తర్వాత మిరియాలపొడి,ఉప్పు,సొయాసాస్,అజినొమొటో కలపాలి.

పావుకప్పు నీళ్ళలో కార్న్ ఫ్లోర్ను కలిపి అందులో పోసి వెంటనే కలపాలి ఉండలు

కట్టకుండా. ఇప్పుడు గ్రుడ్లను ఒక గిన్నెలో గిలక్కొట్టి మెల్లిగా మరుగుతున్న

సూపులో పోసి మెల్లిగా గరిటతో కలపాలి అప్పుడు గ్రుడ్డు మిశ్రమం దారాల్లాగా

వస్తుంది. ఒక నిమిషం మరిగించి దింపేయాలి.

కార్న్ సూపు


ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు

కూరగాయలు (బీన్సు, క్యాబేజీ,

క్యారట్,కాప్సికం)సన్నగా తరిగినవి 1/2 కప్పు

మిరియాల పొడి 1/2 tsp

అజినొమొటో చిటికెడు

కార్న్ ఫ్లోర్ 1 tbsp

ఉప్పు తగినంత

నూనె లేక వెన్న 1 tsp



ముందుగా కూరగాయలు చిన్న ముక్కలుగా తరిగి వెన్నలో కొద్దిగా వేపి

మూడు గ్లాసుల నీరు పోసి ఉడికించాలి.అందులోనే ఉడికించిన మొక్కజొన్న

గింజలు కలిపి మళ్ళి మూడు నిమిషాలు ఉడికించాలి. కార్న్ ఫ్లోర్ను పావు

కప్పు నీళ్ళలో కలిపి అందులో వేసి కలుపుతూ ఉండాలి. మిరియాలపొడి,

అజినొమొటో, ఉప్పు కలపాలి. చిక్కబడ్డాక దింపేయాలి.

Saturday, December 09, 2006

నూడిల్స్ సూపు


ఉడకబెట్టిన నూడిల్స్ 20 gm

తరిగిన క్యాబేజీ,క్యారట్,

కుక్కగొడుగులు 50 gm

ఉప్పు తగినంత

అజినొమొటొ చిటికెడు

సోయా సాస్ 1/4 tsp

నూనె 1 tsp

మిరియాల పొడి 1/4 tsp

కార్న్ ఫ్లోర్ 1 tbsp


ముందుగా నూనె వేడి చేసి తరిగిన కూరగాయలు కొద్దిగా వేయించి మూడు

గ్లాసులు నీళ్ళు పోసి పది నిమిషాలు మరిగించి ఉప్పు, నూడిల్స్,

మిరియాలపొడి, అజినొమొటొ, సోయా సాస్ కలిపాలి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్

పావు కప్పు నీళ్ళలో కలిపి మరుగుతున్న సూపులో పోసి త్వరగా ఉండలు

కట్టకుండా కలపాలి.ఓ నిమిషం మరిగించి దింపేయాలి. కావాలంటే ఉడికించి
సన్నగా ముక్కలు చేసిన చికెన్ ముక్కలు కూదా వేసుకోవచ్చు.

క్యారట్ సూపు


క్యారట్ 250 gm

ఉప్పు తగినంత

కార్న్ ఫ్లోర్ 1 tbsp

మిరియాలపొడి 1 tsp

కొత్తిమిర 1 tsp



క్యారట్ను ముక్కలుగా కోసి రెండుగ్లాసులు నీళ్ళు పోసి మెత్తగా ఉడికించాలి.

చల్లారాక గ్రైండ్ చేసి వడకట్టి మళ్ళీ మరిగించాలి. మరుగుతున్నప్పుడు ఉప్పు

మిరియాలపొడి కలిపి పావుకప్పు నీళ్ళలో కలిపిన కార్న్ ఫ్లోర్ మిశ్రమాన్ని

కలిపి మళ్ళీ మరిగించి సన్నగా తరిగిన కొత్తిమిర చల్లి దింపేయాలి. ఇది చాల

బలవర్ధకమైనది.

మటన్ సూపు



మటన్ ఎముకలు 250 gm

ఉప్పు తగినంత

మిరియాలపొడి 1 tsp

పచ్చిమిర్చి 2

కందిపప్పు పిడికెడు

కొత్తిమిర 2 tsp

పుదీన 2 tsp

నూనె 1 tsp



పై పదార్తాలన్ని కలిపి నీళ్ళు పోసి కుక్కర్లో ఐదు విజిల్స్ వచ్చేవరకు

ఉడికించి దింపిన తర్వాత వేడిగా ఆరగించండి. ఇది చాల బలవర్ధకం.

తక్కువ మసాలాలు కలిగినది.

టొమాటో సూపు


టొమాటోలు 100 gm
ఉప్పు తగినంత
మిరియాలపొడి 1/4 tsp
కార్న్ ఫ్లోర్ 1 tbsp
కొత్తిమిర 1 tsp

ముందుగా టోమాటోలను కప్పుడు నీళ్ళు పోసి మెత్తగా ఉడికించి,చల్లారిన
తర్వాత గ్రైండ్ చెసి వడకట్టాలి. ఆ రసాన్ని మళ్ళీ పొయ్యిమీద పెట్టి
మరిగించాలి.కార్న్ ఫ్లోర్ పావు కప్పుడు నీళ్ళలో కలిపి ఉంచుకోవాలి.
మరుగుతున్న సూపులో ఉప్పు, మిరియాలపొడి వేసి కలిపి ఈ కార్న్
ఫ్లోర్ మిశ్రమాన్ని వేసి త్వరగా ఉండలు కట్టకుండా కలపాలి. చిక్కపడిన
సూపులో వేయించిన బ్రెడ్ ముక్కలు సన్నగా తరిగిన కొత్తిమిర వేసి
వేడిగా ఆరగించడమే.

యాలకులు



భారతదేశం సుగంధ ద్రవ్యాలకు ప్రసిద్ది. అందులో అన్నిటికన్నా ఖరీదయినది కుంకుమపువ్వు. తర్వాతి స్థానం యాలకులది. వీటి జన్మస్థలం భారతదేశం. భారతదేశంలో మసాలాద్రవ్యాల రారాణిగా యాలకులను పేర్కొందురు.



భోజనం చేయగానే తాంబూలంలో, టీలో యాలకులు వేస్తారు. మిఠాయిలలో తప్పనిసరిగా యాలకులపొడి ఉండాల్సిందే.మనడేశంలో మూడురకాల యలకులు లభ్యమవుతాయి. నలుపు, తెలుపు. ఆకుపచ్చ.యాలకులు వాడని ఇల్లు ఉండదు మన దేశంలో.



యాలకులకు విశేష ఔషధగుణాలున్నాయి. జీర్ణవ్యవస్థకు మేలు చేసే లక్షణం వీటికి ఉంది. నోటి దుర్వాసన, అజీర్ణం, వాంతులకు విరుగుడుగా వాడతారు. పిత్తాశయం, పేగులో ఇబ్బందులకు, కడుపునొప్పి తగ్గడానికి ఉపకరిస్తాయి.యాలకులనూనె కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. తలతిరుగుడు వాంతులకు విరుగుడుగా పనిచేస్తుంది.దగ్గు, గొంతులోని భాధలకు ఉపశమన. పిల్లలకు వచ్చే కడుపునొప్పి అజీర్ణానికి వాముతో పాటు యాలకులు కలిపి వాడతారు.









యాలకుల సువాసన ఆహారపదార్థాలను బాగా తినేలా చేస్తాయి. అలా తిన్న ఆహారాన్ని యాలకులు త్వరగా జీర్ణం చేస్తాయి. ఆరోగ్యదాయకమైన యాలకుల ద్వారా శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది.యాలకుల మొక్క బెరడును తాజాగా తీసి నోటిలో వేసుకుని నమలితే కదిలిన పండ్లకు తిరిగి పట్టు వస్తుంది. దంతాలలో రక్తస్రావం ఆగిపోతుంది. బలపడతాయి. మొక్క బెరడుతో తీసిన కషాయం సైంధవలవణంతో కలిపి పుక్కిలిస్తే టాన్సిలైటిస్ తగ్గుతుంది.











Friday, December 08, 2006

మిర్చిఘాటు చాలా ఫేవరేటు


కారం, ఉప్పు లేని వంటకాలు అసలు ఊహించుకోగలమా. మన ఇళ్ళలో చేసే

ఏ వంటకమైనా కారం ఉండాల్సిందే. పప్పు, చారు, కూర, పచ్చడి, ఆవకాయ-

---కారం లేకుండా ఊహించను కూడా లేము. ప్రపంచంలో అత్యధికంగా

మిరపను పండించడమే కాదు ఎక్కువగా వినియోగించే దేశం భారతదేశమే.

మిరపలోని కారానికి ఆధారం అందులోని కాప్సిసిన్. మిరపలోని కాసాంధిన్

వల్ల దాని రంగులు మారిపోతాయి. మిరపతో రరకాల వంటకాల తయారిలో

ఆంధ్రులదే పైచేయి. పచ్చిమిరప, ఎండుమిరప రెండు విరివిగా వాడతారు.

మిరపలో పలురకాల మేలు చేసే ఔషధ గుణాలున్నాయి. దీనిలోని

యాంటీఅక్సిడెంట్స్ శరీరంలో అదనంగా శక్తిని కలిగిస్తాయి. అవి కొలెస్టరాల్,

మధుమేహం, శుక్లాలు, కీళ్ళనొప్పులు తొలగించడంలో ఆ యాంటీఅక్సిడెంట్స్

పనిచేస్తాయి. మిరప బాధానివారిణి కూడా. కండరాలలో ఏర్పడిన

ఇబ్బందులను తొలగిస్తుది. బొబ్బలు నయం చేస్తుంది. కడుపులో ఏర్పడిన

అల్సర్ లను తగ్గిస్తుంది. మిర్ప మూత్రపిండాల పనితీరును

మెరుగుపరుస్తుంది. ప్లీహం మీద ప్రభావం చూపుతుంది.బత్తాయిలో కన్నా

మిరపలో C విటమిన్ ఏడురెట్లు అధికం. జీర్ణం మందగించినా, రక్తపోటుకు,

నిద్రలేమి, ఫ్లూ జ్వరానికి మిరప ఔషధంగా పనిచేస్తుంది.

Wednesday, December 06, 2006

పరోటా


మైదా 100 gm

ఉప్పు చిటికెడు

నూనె 100 gm



ముందుగా మైదాలో ఉప్పు కలిపి నీళ్ళతో చపాతీ పిండిలా కలిపి ఒక స్పూను

నూనె వేసి కలిపి అరగంట పక్కన పెట్టుకోవాలి. పెద్ద నిమ్మకాయంత ముద్ద

తీసుకుని పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. ఇప్పుడు దానిపై నూనె

రాసి పిండి చల్లి చాపలా చూట్టాలి. మళ్ళీ చపాతీలా వత్తుకుని నూనె రాసి

పిండి చల్లి మళ్ళి చుట్టాలి. ఇప్పుడు పెనం వేడి చేసి ఈ పరోటాను నూనె వేస్తూ

రెండువైపులా కాల్చుకోవాలి. ఈ పరోటా పొరలు పొరలుగా వస్తుంది.ఇది

వేడి మీదనే బావుంటుంది చల్లారితే బలప్రయోగం చేయాల్సొస్తుంది

తినడానికి. ఏమీలేదు సాగుతుంది అంతే.

మసాలాపురీ


గోధుమ పిండి 100 gm

సెనగ పిండి 50 gm

కరివేపాకు

సన్నగా తరిగినది 2 tsp

కొత్తిమిర

సన్నగా తరిగినది 2 tsp

కారం పొడి 1 tsp

పసుపు 1/4 tsp

అల్లం వెల్లుల్లి 1 tsp

గరం మసాలా 1/2 tsp

ఉప్పు తగినంత

నూనె వేయించడానికి



గోధుమపిండిలో నూనె తప్ప మిగతావన్ని కలిపి నీళ్ళతో చపాతీ పిండిలా

కలిపి ఓ అరగంట పక్కన పెట్టుకోవాలి. ఇప్పుదు చిన్న నిమ్మకాయంత

ఉండలు చేసుకుని పూరీలా పలుచగా వత్తుకుని వేడి నూనెలో ఎర్రగా

కాల్చాలి.ఇవి ప్రయాణాలలోకి కాని పండగరోజు కాని చేసుకుంటారు

ఎక్కువగా .

Tuesday, December 05, 2006

పుల్కాలు




















గోధుమపిండి 100 gm

ఉప్పు చిటికెడు



గోధుమపిండిని ఉప్పు కలిపి జల్లించి నీళ్ళతో మృదువుగా తడిపి పెట్టుకోవాలి.
ఓ పదినిమిషాల తర్వాత పిండిని బాగ మర్ధించి చిన్న నిమ్మకాయ సైజులో

ఉండలుగా చెసుకుని పిండి చల్లుకుంటూ పలుచగా వత్తుకోవాలి. వేడి

పెనంపై వేసి ఒకవైపు కొంచం కాలాక తిరగేసి రెండో వైపు కొంచం కాలాకా

పెనంపైనుండి తీసి గ్యాస్ మంటపై పటకారు సాయంతో రెండువైపులా

కాల్చుకోవాలి. ఇది చాలా త్వరగా చేయాలి. ఇలా చేస్తే పుల్కాలు పూరీలాగా

పొంగుతాయి. నూనె లేకుండా తినాలనుకునేవాళ్ళు ఎక్కువగా

చేసుకుంటారు. ఇలా చేయడం వల్ల మృదువుగా ఉంటాయి. మొత్తం

పెనంపై చేస్తే గట్టిగా వస్తాయి.

పూరీ


గోధుమ పిండి 100 gm

ఉప్పు చిటికెడు

నూనె వేయించడానికి



గోధుమపిండిలో ఉప్పు కలిపి జల్లించి నీళ్ళతో కలిపి పదినిమిషాలు పక్కన

పెట్టుకోవాలి. ఈ పిండిని మళ్ళీ మర్ధించి చిన్న నిమ్మకాయల సైజులో

చేసుకుని నూనె అద్దుకుంటూ వత్తుకోవాలి. వేడి నూనెలో కాల్చాలి.

దీనికి పప్పు, వేపుడు, ఖుర్మా కాని హల్వా కాని కలిపి తినొచ్చు.

చపాతీ


గోధుమ పిండి 100 gm

ఉప్పు చిటికెడు

నూనె 50 gm



గోధుమ పిండి జల్లించి ఉప్పు కలిపి నీళ్ళు పోసి మెత్తగా కలుపుకోవాలి.

ఇది మృదువుగా ఉండాలి.ఈ పిండి ముద్దను ఓ అరగంట అలాగే ఉంచి

చపాతీలు చేస్తే బాగా వస్తాయి.పిండిని పెద్ద సైజు నిమ్మకాయంత

తీసుకుని చిన్న పూరి సైజులో వత్తుకుని నూనె రాసి పొడిపిండి చల్లి

మడత పెట్తి మళ్ళీ నూనె రాసి పిండి చళ్ళి మళ్ళీ మడత పెట్టాలి

త్రికోణాకారంలో.ఇప్పుడు దాని పిండి చల్లుకుంటూ పెద్దగా వత్తుకుని

వేడి పెనంపై నూనె వేస్తు కాల్చుకోవాలి రెండువైపులా. వీటిని ఒక

గిన్నెలోకాని డబ్బాలో కాని పెట్టి మూత పెట్టాలి లేకుంటే గట్టిపడతాయి.

ఎదైనా కూరగాని, పప్పు గాని కలిపి తింటే సరి.

Monday, December 04, 2006

జాంగ్రీ

















మినప్పప్పు 250 gm

బియ్యం గుప్పెడు

పంచదార 1/2 kg

మిఠాయిరంగు చిటికెడు

నెయ్యి లేక నూనె వేయించడానికి




మినప్పప్పును శుభ్రం చేసి బియ్యం కలిపి నీళ్ళు పోసి 4 గంటలు

నాననివ్వాలి. తర్వాత ఈ పప్పును కాటుకలాగా మెత్తగా రుబ్బుకోవాలి.

పంచదారలో కప్పుడు నీళ్ళు పోసి జిగురుపాకం చేసి మిఠాయిరంగు

వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక మందపాటి గుడ్డకు రంధ్రం చేసి

అంచులు కుట్టి అందులో ఈ పిండి వేసి నాలుగుమూలలు కలిపి

మూటలాగా పట్టుకుని వేడి నూనెలో చుట్టలుగా వత్తుకోవాలి. ఎర్రగా

కాలినతర్వాత తీసి పాకంలో వేయాలి. అలా అన్ని చేసుకుని

రెండుగంటలు పాకంలో నాననిస్తే జాంగ్రీలు గుల్ల విచ్చి పాకం బాగా

పీలుచుకుని మృదువుగా ఉంటాయి. జాంగ్రీ లేదా జిలేబీలు

చేయడానికి ప్లాస్టిక్ బాటిల్ వంటిది దొరుకుతాయి.అవి కూడా

ఉపయోగించుకోవచ్చు.

Friday, December 01, 2006

చేపల పులుసు


చేపలు 1 kg
ఉల్లిపాయలు 250gm
కొబ్బరిపొడి 75 gm
జీలకర్ర పొడి 1 tsp
మెంతి పొడి 1/2 tsp
ధనియాల పొడి 2 tbsp
కారంపొడి 2 tsp
పసుపు 1/2tsp
ఉప్పు తగినంత
చింతపండు 100 gm
అల్లం వెల్లుల్లి 1 tbsp
నూనె 5 tbsp



ముందుగా చేపలను శుభ్రం చేసుకుని అరంగుళం ముక్కలుగ కోసి
పెట్టుకోవాలి. చింతపండును అరకప్పు నీళ్ళలో నానబెట్టాలి. ఉల్లిపాయలు
సన్నగా తరిగి నూనెలో ఎర్రగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఉల్లిపాయలు, కొబ్బరిపొడి, ధనియాల పొడి, జీలకర్ర
మెంతిపొడి, కారం, పసుపు తగినంత ఉప్పు , అల్లం వెల్లుల్లి ముద్ద
అన్నీ కలిపి గ్రైండర్లో ముద్ద చేసుకోవాలి. చింతపండును చిక్కటి
పులుసు తీసి పెట్టుకోవాలి. వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి
కొద్దిగా జీలకర్ర మెంతులు వేసి చిటపటలాడాక చింతపండు
పులుసు నూరిన ముద్ద కలిపి పోయాలి. చిక్కగా ఉంటే కొద్దిగా
నీళ్ళు పోయాలి. ఇప్పుడు ఈ పులుసును బాగా మరగనివ్వాలి.
పులుపు వాసన పోయాక చేప ముక్కలు అందులో జాగ్రత్తగా
వేయాలి. చేప ముక్కలు పులుసులో ఉడికి నూనె తేలాక
దింపేయాలి. ఇది వేడిగా కాని చల్లగా కాని తినొచ్చు.
దీనికి జొన్న రొట్టె ఉంటె సూపర్