Wednesday, February 28, 2007

ఘాటైన మాంసం కూర



మాంసం 250 gm
ఉల్లిపాయలు 2
పసుపు 1/2 tsp
ఎండుమిర్చి 6-8
ఉప్పు తగినంత
ధనియాలపొడి 2 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
గరం మసాలా 1 tsp
నూనె 3 tsp
కొత్తిమిర 2 tsp

ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసి అరకప్పు నీటిలో నానపెట్టాలి. తర్వాత
వాటిని అదే నీటితో కలిపి మెత్తగా ముద్దగా నూరాలి. నూనె వేడి చేసి ఉల్లిపాయలు
ఎర్రగా వేయించి పసుపు,కారం ముద్ద, అల్లం వెల్లుల్లి, ధనియాలపొడి వేసి కొద్దిగా వేపి
మాంసం ముక్కలు ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి. కప్పుడు నీళ్ళు పోసి
కూర ఉడికి నూనె తేలాక కొత్తిమిర, గరం మసాలా చల్లి దింపేయాలి. ఇది కాస్త
ఘాటుగా ఉంటుంది.

మాంసం పులుసు కూర


మాంసం 250 gm
ఉల్లిపాయలు 2
అల్లం వెల్లుల్లి 2 tsp
కొబ్బరిపొడి 3 tsp
గరం మసాలా 2 tsp
ధనియాల పొడి 2 tsp
పసుపు 1 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
చింతపండు పులుసు అర కప్పు

ముందుగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి అల్లం వెల్లుల్లి,
పసుపు, కారం వేసి కొద్దిగా వేపి మాంసం ముక్కలు,ధనియాల పొడి, తగినంత
ఉప్పు వేసి కలియబెట్టి మూతపెట్టాలి. నీరంతా ఇగిరిపోయాక 2 కప్పులు నీళ్ళు
పోసి మెత్తగా ఉడికించాలి.తర్వాత కొబ్బరిపొడి,పులుసు, గరం మసాలా వేసి
నూనె తేలేవరకు ఉడికించి దింపేయాలి.

కోఫ్తా కూర

ఖైమా 250 gm
ఉల్లిపాయలు 2
టోమాటోలు 3
కొబ్బరి పొడి 3 tbsp
గరం మసాలా 1 tsp
ధనియాల పొడి 2 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
పసుపు 1 tsp
కారం 2 tsp
ఉప్పు తగినంత
కొత్తిమిర 2 tsp
నూనె 4 tbsp

శుభ్రపరచిన ఖైమాలో నీళ్ళు పిండేసి సగం పసుపు,కారం,అల్లం వెల్లుల్లి,గరం
మసాలా, కొబ్బరి పొడి,ఉప్పు, కొత్తిమిర వేసి గ్రైండర్లోకాని రోట్లో కాని రుబ్బుకొని
(మరీ మెత్తగా ఉండకూడదు.అన్ని బాగా కలిసేటట్టు ఉంటే చాలు) చేతికి కొద్దిగా
నూనె రాసుకుని చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. వెడల్పాటి బాణలిలో
నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి మిగిలిన పసుపు,
కారం,అల్లం వెల్లుల్లి, ధనియాల పొడివేసి కొద్దిగా వేపి ఖైమా ఉండలు వేసి
మెల్లిగా విడిపోకుండా వేయించాలి. నీరంతా ఇగిరిపోయాక టోమాటోలు,
తగినంత ఉప్పు వేసి కలిపి ఉడికించాలి. ఉండలు ఉడికాక కొత్తిమిర,గరం
మసాలా కలిపి దింపేయాలి.

ఖైమా బఠానీ కూర


ఖైమా 250 gm
పచ్చి బఠానీలు 100 gm
ఉల్లిపాయలు 2
అల్లం వెల్లుల్లి 2 tsp
టోమాటోలు 3
పసుపు 1/2 tsp
కారం 1 1/2 tsp
ఉప్పు తగినంత
ధనియాల పొడి 2 tbsp
గరం మసాలా 1 tsp
నూనె 3 tbsp

ముందుగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి, పసుపు, అల్లం
వెల్లుల్లి, కారం, ధనియాల పొడి వేసి కొద్దిగా వేయించి శుభ్రపరచిన ఖైమా, తగినంత
ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి.నీరంతా ఇగిరిపోయాక బఠానీలు వేసి
మళ్ళీ వేయించాలి. సన్నగా తరిగిన టోమాటోలు వేసి మెత్తబడేవరకు వేయించి
కప్పుడు నీళ్ళు పోసి ఉడికించి నూనె తేలాక గరం మసాలా కలిపి దింపేయాలి.

ఖైమా బంగాళదుంప


ఖైమా 250 gm
బంగాళదుంప 150 gm
ఉల్లిపాయలు 2
అల్లం వెల్లుల్లి 2 tsp
పసుపు 1/2 tsp
కారం పొడి 1 1/2 tsp
ఉప్పు తగినంత
గరం మసాల 1 tsp
కొత్తిమీర 2 tsp
ధనియాల పొడి 2 tbsp
నూనె 3 tbsp

ముందుగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి పసుపు, అల్లం
వెల్లుల్లి, కారం వేసి కొద్దిగా వేపి శుభ్రపరచిన ఖైమాను,తగినంత ఉప్పు వేసి బాగా
కలియబెట్టి మూత పెట్టాలి.నీరంతా ఇగిరిపోయాక అరకప్పు నీళ్ళు పోసి ఉడికించాలి.
తొక్క తీసి ముక్కలు చేసిన బంగాళదుంపలు, ధనియాల పొడి అందులో కలిపి
అవి ఉడికేవరకు ఉంచి గరం మసాలా. కొత్తిమిర కలిపి దింపేయాలి.ఈ కూర
చపాతీలు, అన్నంలోకి బావుంటుంది. ఇంకోవిధంగా అంటే సన్నగా తరిగిన మెంతి
కూర,టోమాటోలు కూడా వేసుకోవచ్చు.

గోంగూర మాంసం




మాంసం 250 gm
గోంగూర 10 కట్టలు
ఉల్లిపాయలు 2
అల్లం వెల్లుల్లి 2 tsp
గరం మసాల 1 tsp
పసుపు 1/2 tsp
కారంపొడి 1 1/2 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp

ముందుగా గోంగూర శుభ్రపరచి రెండు నిమిషాలు ఉడికించి తీసి పక్కన పెట్టాలి.
చల్లారిన తర్వాత దానిని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. నూనె వేడి చేసి తరిగిన
ఉల్లిపాయలు ఎర్రగా వేయించి అల్లం వెల్లుల్లి, పసుపు, కారం వేసి కొద్దిగా వేపి
మాంసం ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి.
నీరంతా ఇగిరిపోయాక రెండు కప్పులు నీళ్ళు పోసి మెత్తగా ఉడికేవరకు ఉంచాలి.
తర్వాత గోంగూర ముద్ద వేసి కలిపి ఉడికించాలి. కూరంతా ఇగిరిపోయాక గరం
మసాలా కలిపి దింపేయాలి.కావాలంటే నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు
మాంసం ఉడికేటప్పుడు. బావుంటుంది.

Monday, February 26, 2007

హైదరాబాదీ ఫిర్నీ



బాస్మతి బియ్యం 5 tbsp
పాలు 500 ml
యాలకుల పొడి 1 tsp
కుంకుమపువ్వు చిటికెడు
చక్కెర 100 gm
నెయ్యి 2 tsp
జీడిపప్పు 10
కిస్మిస్ 10
బాదాం పిస్తా 10

ముందుగా బియ్యం కడిగి బరకగా పొడి చేసికోవాలి. ఈ తడి బియ్యం పిండిని
పాలల్లో వేసి ఉడికించాలి. చిక్కబడ్డాక చక్కెర కుంకుమపువ్వు వేసి కరిగేవరకు
ఉడికించి నేతిలో వేయించిన పలుకులు,యాలక్కుల పొడి వేసి కలపాలి. ఇది
వేడిగా కాని చల్లగా కాని బావుంటుంది.

పెసరపప్పు పాయసం



పెసరపప్పు 100 gm
చక్కెర 150 gm
పచ్చి కొబ్బరి 1/2 కప్పు
జీడిపప్పు 10
యాలకులపొడి 1 tsp
బాదాం 10
కిసిమిస్ 10
పాలు 2 గ్లాసులు
నెయ్యి 3 tbsp

ముందుగా పెసరపప్పును మెత్తగా ఉడికించి పచ్చికొబ్బరి, పంచదార వేసి
కొద్దిసేపు ఉడికించాలి.తరువాత నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్,
యాలకుల పొడి,వేడిపాలు పోసి కలిపి దింపేసి బాదాం ముక్కలతో
అలంకరించాలి.

బియ్యంతో పాయసం




బియ్యం 1 కప్పు
నీళ్ళు 2 కప్పులు
పాలు 2 కప్పులు
యాలకుల పొడి 1 tsp
నెయ్యి 3 tbsp
జీడిపప్పు 10
కిస్మిస్ 10

ముందుగా బియ్యం కడిగి అరగంట నానబెట్టి మెత్తగా ఉడికించాలి. తర్వాత
వేడి పాలు,చక్కెర కలిపి ఉడికించాలి. చిక్కబడ్డాక యాలకుల పొడి,నెయ్యిలో
వేయించిన జీడిపప్పు,కిస్మిస్ నెయ్యితో కలిపి అందులో వేసి కలిపి దింపేయాలి.

సేమ్యా పాయసం



సేమ్యా 100 gm
పాలు 3కప్పులు
నీళ్ళు 1కప్పులు
చక్కెర 1 కప్పు
యాలకుల పొడి 1 tsp
జీడిపప్పు 10
కిస్మిస్ 10
కుంకుమపువ్వు చిటికెడు
నెయ్యి 3 tbsp

ముందుగా సేమ్యాను నెయ్యిలో దోరగా వేయించాలి.పాలు నీళ్ళు కలిపి
మరిగించి ఈ సేమ్యాను కలపాలి.సేమ్యా ఉడికిన తర్వాత చక్కెర కలిపి
కరిగేంతవరకు ఉడికించి యాలకులపొడి,జీడిపప్పు,కిస్మిస్,కుంకుమపువ్వు
కలిపి దింపేయాలి. ఇది వేడిగా కాని చల్లగా కాని బావుంటుంది.

రవ్వ పాయసం

రవ్వ 1 కప్పు
చక్కెర 1 1/2 కప్పు
నీరు 2 కప్పులు
పాలు 3 కప్పులు
యాలకుల పొడి 1 tsp
నెయ్యి 2 tsp
కిస్మిస్ 10
జీడిపప్పు 10

ముందుగా నెయ్యి వేడి చేసి రవ్వను దోరగా వేయించాలి. వేరే గిన్నెలో నీళ్ళు
మరగబెట్టి అందులో రవ్వ మెల్లిగా పోస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ
ఉండాలి.ఇప్పుడు పాలు పోసి కలుపుతూ ఉండాలి. తరువాత చక్కెర వేసి
కరిగేవరకు కలుపుతూ ఉండాలి.యాలకుల పొడి, నేతిలో వేయించిన కిస్మిస్,
జీడిపప్పు కలిపి దింపేయాలి. చివరలో ఇంకో రెండు చెంచాల నెయ్యి వేస్తే
రుచిగా ఉంటుంది.

Friday, February 23, 2007

బెండకాయ టొమాటో కూర



బెండకాయలు 250 gm
టొమాటోలు 3
ఉల్లిపాయ 1
అల్లం వెల్లుల్లి 1 tsp
పసుపు 1/4 tsp
కారం పొడి 1 tsp
గరం మసాలా 1 tsp
కరివేపాకు 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp

బెండకాయలను అరంగుళం ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. వెడల్పాటి
బాణలిలో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు
వేయించి పసుపు,కారం,అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేయించి తరిగిన
టోమాటోలు కూడా వేసి అవి మెత్తబడేవరకు వేయించి బెండకాయ
ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలియబెట్టి మూత పెట్టి చిన్న
మంటపై ఉడికించాలి.అవసరమనుకుంటే పావు కప్పు నీరు పోయాలి.
గరం మసాలా పొడి కలిపి దించేయాలి.

బెండకాయ వేరైటీ వేపుడు


బెండకాయలు 250 gm
సాంబారు పొడి 5 tbsp
ఉప్పు తగినంత
నూనె 5 tbsp

బెండకాయలను నిలువుగా చీల్చి అందులో తగినంత ఉప్పు కలిపిన
సాంబారు పొడి కూరి వేడి నూనెలో ఎర్రగా వేయించాలి. నంజుకోడానికి
కరకరలాడుతూ బావుంటాయి.

మసాలా బెండకాయ వేపుడు


బెండకాయలు 250 gm
ఉప్పు తగినంత
కారం పొడి 1 tsp
పసుపు 1/4 tsp
ధనియాల పొడి 3 tsp
సెనగపిండి 3 tbsp
నూనె 5 tbsp

నూనె, బెండకాయలు తప్ప మిగతావన్ని కలిపి పెట్టుకోవాలి.
బెండకాయలను నిలువుగా చీల్చిఈ మసాలా పొడిని అందులో
కూరాలి. అన్ని బెండకాయలు అలానే చేసికోవాలి. వెడల్పాటి
బాణలిలో నూనె వేడి చేసి ఈ బెండకాయలను చిన్న మంటపై
ఎర్రగా వేయించుకోవాలి.ఎక్కువగా కలపకూడదు.బెండకాయలు
విరిగిపోతాయి.

బెండకాయ క్రంచీస్


బెండకాయలు 1/2 kg
పసుపు 1/4 tsp
కారం పొడి 1tsp
ఉప్పు తగినంత
నూనె వేయించడానికి

బెండకాయలను సన్నని చక్రాలుగా కోసి వేడి నూనెలో ఎర్రగా
వేయించాలి. ఈ ముక్కలకు వేడి మీదనే ఉప్పు,కారం,పసుపు
వేసి బాగా కలియబెట్టి తినడమే.

బెండకాయ పులుసు



బెండకాయలు 1/4 kg
ఉల్లిపాయ 1
టొమాటో 2
చింతపండు పులుసు 1/4 కప్పు
పసుపు 1/4 tsp
కారం పొడి 1 tsp
గరం మసాలా 1 tsp
అల్లం వెల్లుల్లి 1 tsp
కరివేపాకు 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp

బెండకాయలను చిన్న ముక్కలుగా కోసి ఉంచుకోవాలి.నూనె వేడి చేసి
తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించి పసుపు, కరివేపాకు,
అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేపి బెండకాయ ముక్కలు,కారం,తగినంత
ఉప్పు వేసి కలియబెట్టి మూత పెట్టి ముక్కలు మెత్తబడేవరకు ఉంచాలి.
ఇప్పుడు టొమాటో ముక్కలు, పులుసు,అరకప్పు నీళ్ళు పోసి కలియ
బెట్టి మరో పదినిమిషాలు నిదానంగా చిన్న మంటపై ఉడికించాలి.

బెండకాయ వేపుడు



బెండకాయలు 1/2 kg
పసుపు 1/4 tsp
కరివేపాకు 1 tsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
కారంపొడి 1 tsp
నూనె 3 tbsp

బెండకాయలను సన్న ముక్కలుగా కోసుకోవాలి. వెడల్పాటి నాన్‌స్టిక్
ప్యాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు,జీలకర్ర వేసి చిటపటలాడాక
కరివేపాకు బెండకాయ ముక్కలు పసుపు వేసి మెల్లిగా కలిపి మూత
పెట్టకుండా కరకర లాడేటట్టు వేయించి ఉప్పు, కారం వేసి కలిపి మళ్ళీ
కొద్ది సేపు వేయించి దింపేయాలి.

నాటుకోడి ఇగురు


నాటుకోడి 1 kg
ఉల్లిపాయ 2
కరివేపాకు 1 tsp
అల్లం వెల్లుల్లి 2 tsp
పసుపు 1 tsp
కారం పొడి 2 tsp
గరం మసాలా 1 tsp
ధనియాల పొడి 2 tbsp
కొబ్బరి పొడి 3 tbsp
కొత్తిమీర 2 tsp
ఉప్పు తగినంత
నూనె 4 tbsp

ముందుగా నాటుకోడిని మంటపై కొద్దిగా కాల్చి పసుపు రాసి కడిగి
ముక్కలు చేయాలి. ఇలా చేస్తే నీసు వాసన ఉండదు రుచిగా
ఉంటుంది.నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు ఎర్రగా వేయించి,
పసుపు,కారం,అల్లం వెల్లుల్లి వేసి కొద్ది సేపు వేపి కోడి ముక్కలు
వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి.నీరంతా ఇగిరిపోయాక
ధనియాల పొడి,కొబ్బరిపొడి,గరం మసాలా వేసి కలిపి రెండుకప్పులు
నీరు పోసి(కుక్కరులో ఐతే కప్పు నీరు సరిపోతుంది) ఉడికించుకోవాలి.
ముక్కలు ఉడికి దగ్గర పడ్డాక కొత్తిమీర చల్లి దింపేయాలి.

రాగి ముద్ద


రాగి పిండి 1 కప్పు
బియ్యం పిడికెడు
ఉప్పు 1/4 tsp
నీళ్ళు 4 కప్పులు
నెయ్యి 1 tsp

ముందుగా కడిగిన బియ్యం,ఉప్పు,నెయ్యి,నీళ్ళు కలిపి ఉడికించాలి.
అన్నం మెత్తబడ్డాక రాగిపిండి పోసి కలిపి మూత పెట్టి కొద్ది సేపు
ఉడికిన తర్వాత గరిటతో కాని,పప్పు గుత్తితో కాని మెత్తగా ఉండలు
లేకుండా మెదిపి మళ్ళీ గట్టిపడేవరకు నిదానంగా ఉడికించాలి.
కొద్దిగా చలారిన తర్వాత తడిచేత్తో ముద్దలుగా చేసుకుని నెయ్యి
వేసుకొని తినాలి.దీనికి కాంబినేషన్ నాటుకోడి ఇగురు, బచ్చలి
కూర పప్పు లేక సాంబారు.

Thursday, February 22, 2007

శుభప్రదాయిని తులసి



భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధన అనాదికాలం నుంచి వున్నదే.
వైజ్ఞానికంగా చూసినా ఈ ఆరాధన సముచితమైనదే. హిమాలయాలు,
చిత్రకూటం, వింధ్య పర్వతాలు, నల్లమల అడవులు, నీలగిరులు
మొదలైన అనేక ప్రదేశాలలో మహత్తరమైన వనమూలికలు ఎన్నో
లభిస్తున్నాయి. భరతఖండంలోని అనేక సంప్రదాయక కుటుంబాలలో
తులసిని పవిత్ర భావంతో ఆరాధిస్తుంటారు కారణం ఏమిటీ? అని
ప్రశ్నించుకుంటే 'తులసిని అర్చించే ఇంటిలో రోగాణువులు ప్రవేశించ
లేవు. యమ కింకరులు ఆ ఇంటి వైపు దృష్టిసారించలేరు ' అని
పురాణాలలో చెప్పడం గోచరిస్తుంది.ఇక్కడ యమకింకరులు అంటే
పాములు, తేళ్ళు, జెర్రులు మొదలైన ప్రాణాంతక విషకీటకాలు అని
చెప్పుకోవాలి. తులసి చెట్టు దాపులోకి విషజంతువులు ప్రవేశించలేవు
ఎందుకంటే తులసి ఘాటుకు విషకీటకాలు వికర్షితమవుతాయి.
తులసికి కాలుష్యాన్ని హరించి వాతావరణాన్ని శుభ్రం చేసే గుణముంది.







భారతదేశంలో ఇంచుమించు ప్రతి ఇంటిలోనూ తులసి ఆరాధన
వుంటుంది.మన ధార్మిక, పౌరాణిక గ్రంధాలలో తులసి విశిష్టతలను
ప్రత్యేకంగా వివరించారు.సైన్సు రిత్యా తులసిలో రోగనిరోధక శక్తి
అధికం. తులసిదళంలో ఆక్సిజన్ ఎక్కువ పాళ్ళలో వుంటుంది.
ఆయుర్వేదపితామహుడైన చరకుడు ఎక్కిళ్ళు, దగ్గు, ఉబ్బసం,
ఊపిరితిత్తుల వ్యాధులువిషానికి విరుగుడు మొదలైన వాటికి
విరుగుడుగా చరకసంహితలో రాశాడు. తులసిలో ఎన్నో
రకాలున్నాయి. వాటిలో కృష్ణ తులసి, లక్ష్మి తులసి, విష్ణు తులసి
ముఖ్యమైనవి. ఏ రకమైన తులసిలో అయినా ఔషధగుణాలున్టాయి.
తులసివనం క్షయ అంటే టిబీ వ్యాధిపీడితులకు శానిటోరియం
వంటిదిగా చెప్పవచ్చు. దీని నుండి వెలువడే గాలి పీలిస్తే ఊపిరి
తిత్తులు పరిశుభ్రపడతాయి. మరణశయ్యపై వున్నవారికి తులసి
తీర్థం ఇవ్వడం సంప్రదాయం. ప్రాచీనకాలంలో గృహనిర్మాణ
సమయంలో తులసి మొక్క క్రింద ఉండే మన్నును పసుపు బట్టలో
చుట్టి ఒక పాత్రలో వుంచి దానిని ఇంటి పునాదిలో పెట్టే ఆచారం
వుండేది. అలా చేస్తే పిడుగుల బారి నుంచి ఇంటికి రక్షణ
కలుగుతుందని నమ్మిక



మలేరియా వ్యాధికి తులసి దివ్యౌషధంగా చెబుతారు. తులసిని
తీసుకోవడం వల్ల స్థూల కాయం తగ్గుతుంది. రక్తపోటు అదుపులో
వుంటుంది. ముఖంపై ఏర్పడే మొటిమలు, మచ్చలు, కాలిన గాయాలు
షేవింగ్ సమయంలో పడే గాట్లను రూపు మాపే శక్తి వుండడం వల్ల
తులసిని సౌందర్యప్రదాయినిగా కూడా పేరుకొంటారు. తులసి ఆకులను
నూరి మెత్తటి గుజ్జులాగా చేసి ముఖానికి పట్టించి ఆరాక కడిగేసుకుంటే
ముఖ వర్చస్సు పెరుగుతుంది. ఇన్ని విశిష్టతలున్నాయి గనుకనే
తులసిని పూజించడంలో అనౌచిత్యమేమీ లేదని చెప్పవచ్చు. వైద్య
శాస్త్రం కూడా తులసిలో ఔషధగుణాలున్నాయన్న విషయం
అంగీకరించింది. కాబట్టి దానిలోని మంచిని గ్రహించడం అందరికీ
మంచిదే.

Wednesday, February 21, 2007

వంకాయ మెంతికూరతో

వంకాయలు 250 gm
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 5
మెంతికూర అరకప్పు
టొమాటోలు 3
అల్లంవెల్లుల్లి 1 tsp
ఆవాలు 1/2 tsp
జీలకర్ర 1/2 tsp
కరివేపాకు 1 tsp
పసుపు 1/2 tsp
నూనె 3 tbsp

ముందుగా వంకాయలను ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో వేసి
ఉంచుకోవాలి.పచ్చిమిర్చి,మెంతికూర సన్నగా తరిగి పెట్టుకోవాలి.
నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలను మెత్తబడేవరకు
వేయించి పచ్చిమిర్చి,మెంతికూర,పసుపు,అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి.వంకాయముక్కలు,తగినంత ఉప్పు వేసి బాగా
కలియబెట్టి మూత పెట్టాలి. చిన్న మంటపై నిదానంగా
ఉడకనివ్వాలి.

వంకాయ అల్లంతో

వంకాయలు 250 gm
ఉల్లిపాయలు 2
అల్లం 2"ముక్క
పచ్చిమిర్చి 6
పసుపు 1/2 tsp
కొత్తిమిర పావు కప్పు
నూనె 3 tbsp
ఆవాలు 1/2 tsp

ముందుగా వంకాయలను చిన్న ముక్కలుగా కోసి ఉప్పు నీళ్ళలో
వేసి ఉంచాలి. అల్లం,కొత్తిమిర,పచ్చిమిర్చి కలిపి ముద్దగా నూరి
పెట్టుకోవాలి.నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడాక తరిగిన
ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించి నూరిన అల్లం ముద్ద,
పసుపు వేసి మళ్ళీ కొద్దిగా వేపాలి.ఇప్పుడు వంకాయ ముక్కలు,
తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి. చిన్నమంటపై
నిదానంగా నూనెలోనే మగ్గనివ్వాలి. ఈ కూర మంచి సువాసనతో
రుచిగా ఉంటుంది.

నువ్వు వంకాయ

వంకాయలు 250 gm
శెనగపప్పు 3 tbsp
నువ్వులు 2 tbsp
ఎండుమిర్చి 5
జీలకర్ర 1 tsp
మెంతులు 1/4 tsp
ధనియాలు 3 tsp
పసుపు 1/4 tsp
కొత్తిమిర 2 tsp
ఉప్పు తగినంత
నూనె 4 tbsp

వంకాయలు, నూనె, తప్ప మిగతా వస్తువులు అన్ని కొద్దిగా వేపి,
బరకగా పొడి చేసుకోవాలి.వంకాయలు నాలుగు పక్షాలుగా కోసి
ఉప్పునీళ్ళలో వేసి ఉంచుకోవాలి. వంకాయలలో కొద్దిగా మసాలా
పొడిని కూరి పెట్టుకోవాలి.నూనె వేడి చేసి ఈ కూరిన వంకాయలను
వేసి మూత పెట్టాలి.నిదానంగా చిన్న మంటలో మగ్గనివ్వాలి.అవి
సగం మగ్గిన తర్వాత మిగతా పొడి కూడా కలిపి మళ్ళి మూత పెట్టి
నూనెలోనే ఉడకనివ్వాలి.చివరలో కొత్తిమిర చల్లి దింపేయాలి.

వంకాయ పెరుగుతో కూర

వంకాయలు 250 gm
ఉల్లిపాయ 1
పచ్చిమిర్హ్చి 2
అల్లం 1/2" ముక్క
పసుపు 1/2 tsp
కారం పొడి 1 tsp
గరం మసాలా 1 tsp
కరివేపాకు 1 tsp
పెరుగు 1 కప్పు
కొత్తిమిర 2 tsp
నూనె 3 tbsp


ముందుగా వంకాయలను చిన్న ముక్కలుగా కోసి ఉప్పు వేసిన
నీళ్ళలో వేసి ఉంచాలి. నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు వేసి
ఎర్రగా వేయించి పచ్చిమిర్చి,తరిగిన అల్లం,కరివేపాకు,పసుపు,
కారం వేసి కొద్దిగా వేపి వంకాయముక్కలు తగినంత ఉప్పు వేసి
కలియబెట్టి మూత పెట్టాలి.నిదానంగా ఉడకనివ్వాలి.చివరగా
చిలికిన పెరుగు కలిపి కొత్తిమిర, గరం మసాలాపొడి వేసి కలిపి
దింపేయాలి.ఇది చపాతీలలోకి బావుంటుంది.

గుత్తివంకాయ కూర



గుండ్రటి వంకాయలు 250 gm
ఉల్లిపాయలు 100 gm
పచ్చిమిర్చి 2
అల్లం వెల్లుల్లి 1 tsp
కొబ్బరిపొడి 2 tbsp
వేరుశెనగగుళ్ళు 3 tsp
నువ్వులు 2 tsp
జీలకర్ర 1 tsp
మెంతులు 1/4 tsp
చింతపండు పులుసు అర కప్పు

ముందుగా చిన్న గుండ్రటి వంకాయలను తీసుకుని నాలుగు పక్షాలుగా
కోసి ఉప్పు వేసిన నీళ్ళలో వేసి ఉంచాలి. రెండు స్పూనుల నూనె వేడి
చేసి తరిగిన ఉల్లిపాయలను మెత్తబడేవరకు వేయించి ఉంచుకోవాలి.
వేరుశెనగగుళ్ళు, నువ్వులు, జీలకర్ర, మెంతులు కొద్దిగా వేయించి
కొబ్బరిపొడితో కలిపి పొడి చేసుకుని అందులో చింతపండు పులుసు,
వేయించిన ఉల్లిపాయలు,ఉప్పు,కారం,పసుపు,అల్లం వెల్లుల్లి కలిపి
ముద్దగా నూరిపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో వంకాయను తీసుకుని
ఈ మసాలా ముద్దను కొద్దిగా అందులో కూరి పక్కన పెట్టుకోవాలి.
నూనె వేడి చేసి అర స్పూను జీలకర్ర,మెంతులు వేసి ఎర్రబడ్డాక ఈ
మసాలా కూరిన వంకాయలను నిలువుగా చీల్చిన పచ్చిమిరప
కాయలను వేసి మూతపెట్టాలి. వంకాయలు కాస్త మెత్తబడ్డాక
మిగిలిన మసాలా ముద్దలో కప్పుడు నీళ్ళు కలిపి పలుచగా చేసి
అందులో పోయాలి.ఈ కూరను నిదానంగా ఉడకనివ్వాలి.నూనె
తేలిన తర్వాత దింపేయాలి.

వంకాయ కొబ్బరి వేపుడు

వంకాయలు 250 gm
ఉల్లిపాయలు 2
తురిమిన పచ్చి కొబ్బరి 3 tbsp
పసుపు 1/4 tsp
కారం 1/2 tsp
అల్లం వెల్లుల్లి 1/2 tsp
జీలకర్ర 1/4 tsp
ఆవాలు 1/4 tsp
కరివేపాకు 1 tsp
నూనె 3 tbsp

ముందుగా వంకాయలను నిలువుగా సన్నటి ముక్కలుగా కోసి
ఉప్పు వేసిన నీళ్ళలో వేసి ఉంచాలి. నూనె వేడి చేసి తరిగిన
ఉల్లిపాయలు వేసి కొద్దిగా ఎర్రబడేవరకు వేయించి పసుపు, కారం,
కరివేపాకు,అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేయించాలి. ఇప్పుడు
వంకాయ ముక్కలు,తగినంత ఉప్పు,కొబ్బరి వేసి బాగా కలియబెట్టి
మూత పెట్టాలి. ఇది నిదానంగా ఉడకనివ్వాలి.దింపేముందు
కొత్తిమిర చల్లుకోవచ్చు.

వంకాయ కందిపప్పు కూర

వంకాయలు 250 gm
కందిపప్పు 50 gm
ఎండుమిరపకాయలు 5
జీలకర్ర 1 tsp
ధనియాలు 2 tsp
ఉల్లిపాయ 1
అల్లం వెల్లుల్లి 1 tsp
పచ్చిమిర్చి 2
కరివేపాకు 1 tsp
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp

ముందుగా కందిపప్పును కొద్దిగా వేపి కుక్కర్లో మరీ మెత్తబడకుండా
ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించి పెట్టుకోవాలి. ఎందుమిరపకాయలు,
జీలకర్ర,ధనియాలు కొద్దిగా వేపి పొడి చేసుకోవాలి.వెడల్పాటి బాణలిలో
నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు వేసి మెత్తబడేవరకు వేయించి
కరివేపాకు, తరిగిన పచ్చిమిర్చి,పసుపు,అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా
వేయించాలి. ఇప్పుడు తరిగిన వంకాయ ముక్కలు వేసి బాగా
కలియబెట్టి మూతపెట్టాలి.కొద్దిగా మగ్గిన తర్వాత మసాలాపొడి,
కందిపప్పు తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టి మూత పెట్టాలి.చివరగా
కొత్తిమిర కాని తురిమిన కొబ్బరి కాని వేసుకోవచ్చు. ఇది
చపాతీలోకి బావుంటుంది.

Friday, February 16, 2007

బంగాళదుంప బటానీ కూర


బంగాళదుంపలు 250 gm
పచ్చి బటానీలు 100 gm
టొమాటోలు 100 gm
ఉల్లిపాయలు 1
పచ్చిమిర్చి 2
పసుపు 1/2 tsp
కారం పొడి 1 tsp
కరివేపాకు 1 tsp
అల్లం వెల్లుల్లి 1 tsp
ఉప్పు తగినంత
కొత్తీమిర 2 tsp
గరం మసాల 1 tsp
నూనె 3 tbsp

ముందుగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి కలిపి
మెత్తబడేవరకు వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి,పసుపు,కారం,
కర్వేపాకు,బటానీలు వేసి బాగా కలిపి కొద్దిసేపు వేపాలి.ఇప్పుడు
చెక్కు తీసి ముక్కలుగా చేసిన బంగాళదుంపలు,తగినంత ఉప్పు
వేసి కలియబెత్తి మూత పెట్టాలి. కొద్దిసేపు వేగిన తర్వాత సన్నగా
తరిగిన టొమాటో ముక్కలు కూడా వేసి కలియబెట్టి కప్పుడు నీళ్ళు
పోసి నూనె తేలేవరకు ఉడికించాలి.కొత్తిమీర,గరం మసాలా చల్లి
దింపేయాలి.

బంగాళదుంప పుట్టు


బంగాళదుంపలు 250 gm
ఉల్లిపాయలు 2
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమీర 2 tsp
పసుపు 1/2 tsp
కారం పొడి 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp

ముందుగా బంగాళదుంపలను పావు స్పూను పసుపు,తగినంత
ఉప్పు వేసి కాస్త మెత్తబడేవరకు ఉడికించాలి. చల్లారిన తర్వాత చెక్కు
తీసి చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి
ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు తరిగిన ఉల్లిపాయలు
వేసి అవి మెత్తబడేవరకు వేయించాలి.ఇప్పుడు బంగాళదుంప ముక్కలు
కారం పొడి వేసి బాగా కలియబెట్టి మూతపెట్టాలి.ముందే ఉప్పు వేసాం
కాబట్టి మళ్ళీ వేసే అవసరముండదు.కావాలంటే రుచి చూసి వేసుకో
వచ్చు. ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర చల్లి దింపేయాలి.ఇది దోశ,
పూరీ, చపాతీలోకి బావుంటుంది.

బంగాళదుంప ఖుర్మా


చిన్న బంగాళదుంపలు 250 gm
ఉల్లిపాయలు 2
పచ్చిమిర్చి 2
పసుపు 1/4 tsp
కారం పొడి 1 tsp
కొబ్బరి పొడి 3 tbsp
గసగసల పొడి 1 tbsp
గరం మసాలా 1 tsp
ఉప్పు తగినంత
అల్లం వెల్లుల్లి 1 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమీర 2 tsp
నూనె 3 tbsp

ముందుగా నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు
వేయించాలి.ఇప్పుడు పచిమిర్చి ముక్కలు, కరివేపాకు,అల్లం వెల్లుల్లి,
పసుపు, కారం పొడి వేసి కొద్దిగా వేపి, చెక్కు తీసిన బంగాళ
దుంపలను,తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.కొద్దిగా వేగిన
తర్వాత కప్పుడు నీళ్ళు పోసి ఉడికించాలి.కొబ్బరి,గసగసాలు,గరం
మసాలా పొడి కలి ముద్దగా నూరి ఉడుకుతున్న కూరలో కలపాలి.
నూనె తేలేవరకు ఉడికించి కొత్తిమీర చల్లి దింపేయాలి.

Thursday, February 15, 2007

బంగాళదుంప కూర


బంగాళదుంపలు 250 gm
ఉల్లిపాయలు 100 gm
పచ్చిమిర్చి 2
పసుపు 1/4 tsp
కారం పొడి 1 tsp
కొబ్బరి పొడి 3 tsp
అల్లం వెల్లుల్లి 1 tsp
గరం మసాలా 1/2 tsp
ఉప్పు తగినంత
కరివేపాకు 1 tsp
కొత్తిమిర 2 tsp
నూనె 3 tbsp

బాణలిలో నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు
వేయించి పసుపు,అల్లం వెల్లుల్లి ముద్ద,కారం,కరివేపాకు వేసి
కొద్దిగా వేపి చదరపు ముక్కలుగా కోసిన బంగాళదుంపలను,
తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.నీరంతా ఇగిరిపోయాక
కప్పుడు నీళ్ళు,కొబ్బరి పొడి,గరం మసాలా వేసి కలిపి నూనె
తేలేవరకు నిదానంగా ఉడికించి కొత్తిమిర చల్లి దింపేయాలి.

బంగాళదుంప కాలిఫ్లవర్ కూర



బంగాళదుంపలు 250 gm
కాలిఫ్లవర్ 1
ఉల్లిపాయలు 2
టొమాటోలు 100 gm
అల్లం వెల్లుల్లి 1 tsp
పచ్చిమిర్చి 2
పసుపు 1/4 tsp
కారం పొడి 1 tsp
గరం మసాలా 1/2 tsp
కరివేపాకు 1 tsp
కొత్తిమీర 2 tsp
నూనె 3 tbsp
ఉప్పు తగినంత


ముందుగా ఉల్లిపాయలు తరిగి ఉంచుకోవాలి. కాలిఫ్లవర్ చిన్న
ముక్కలుగా చేసుకుని ఉప్పు వేసిన గోరు వెచ్చటి నీళ్ళలో వేసి
పెట్టుకోవాలి. బంగాళదుంపలను ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయలను బంగారు
రంగు వరకు వేయించి పచ్హిమిర్చి,కరివేపాకు, పసుపు,కారం,
అల్లం వెల్లుల్లి వేసి కొద్దిగా వేపి కాలిఫ్లవర్ ముక్కలు వేసి
రెండు నిమిషాలు వేయించాలి. ఇప్పుడు బంగాళదుంపలు,
టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
నీరంత ఇగిరిపోయాక కప్పుడు నీళ్ళు పోసి ఉడకనివ్వాలి.
ముక్కలన్ని ఉడికాక గరం మసాలా,కొత్తిమిర చల్లి దింపేయాలి.

Thursday, February 01, 2007

అరటిదూట-పప్పు కూర

అరటిదూట జానెడు ముక్క
పెసరపప్పు 100 gm
ఉల్లిపాయ 1
అల్లం చిన్న ముక్క
పచ్చిమిర్చి 8
నూనె 2 tbsp
పోపు గింజలు 2 tsp
కరివేపాకు 2 రెబ్బలు
ఉప్పు తగినంత

ముందుగా చెప్పిన విధంగా అరటిదూటను శుభ్రం చేసి ముక్కలు
కోసుకోవాలి. ముక్కలలో కొంచెం ఉప్పు వేసి ఒక పొంగు వచ్చేవరకు
ఉడికించి వార్చుకోవాలి. పెసరపప్పు అరగంటపాటు నానబెట్టి,
నీరు ఓడ్చాలి.ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం సన్నగా ముక్కలు
కోసుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత పోపు గింజలు
వేసి వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కరివేపాకు
వేసి కొంచెం వేగాక అరటిదూట ముక్కలు, పెసరపప్పు, తగినంత
ఉప్పు వేసి కలిపి ఎర్రగా వేయించుకోవాలి.

ఆవ పెట్టిన అరటిదూట కూర

అరటిదూట జానెడు ముక్క
సెనగపప్పు 1 tsp
మినపప్పు 1 tsp
కారం 1/2 tsp
ఆవాలు 1/4 tsp
ఎండుమిర్చి 2
జీలకర్ర 1/2 tsp
చింతపండు చిన్న నిమ్మకాయంత
కరివేపాకు 3 రెబ్బలు
ఆవ పొడి 1 tsp
నూనె 50 gm
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత

అరటిదూట ముందు పైపెచ్చు తీసి చిన్న చిన్న చక్రాలుగా కోసి పీచు
వేలుకు చుట్టుకుంటూ లాగితే పీచు వస్తుంది. అప్పుడు చిన్న చిన్న
ముక్కలుగా కోసుకోవాలి. కొంచెం నీళ్ళలో ఉప్పు వేసి ముక్కలు వేసి
ఉడికించుకోవాలి. దించేటప్పుడు పసుపు వేసి కలిపి దించి వార్చాలి.
బాణలిలో నూనె పోసి, కాగిన తర్వాత ఎండుమిర్చి ముక్కలు వేయించి,
సెనగపప్పు, మినపప్పు, అవాలు వేసి అవి వేగాక, కరివేపాకు,
అరటిదూట ముక్కలు వేసి రెండునిమిషాలు వేయించి, చిక్కటి
చింతపండు పులుసు పోసి 5 నిమిషాలు వేయించి దింపేయాలి. ఒక
స్పూను ఆవ పొడిని ఒక స్పూను నూనెతో కలిపి కూరలో కలుపుకోవాలి.

అరటిపువ్వు- కొబ్బరి కూర


అరటిపువ్వు 1
పచ్చి కొబ్బరి చిప్ప 1
ఉల్లిపాయ 1
పచ్చిమిర్చి 8
అల్లం చిన్న ముక్క
ఉప్పు తగినంత
పసుపు చిటికెడు
నూనె 100 gm
పోపు గింజలు 2 tsp
కరివేపాకు 2 రెబ్బలు

అరటిపువ్వు ముందు చెప్పిన విధంగా శుభ్రం చేసి ఉడికించి
పెట్టుకోవాలి.చిల్లుల పళ్ళెములో వార్చి ఉంచాలు. ఉల్లిపాయ
సన్నగా తరగాలి. కొబ్బరి, పచ్చిమిర్చి, అల్లం ఉప్పు కలిపి మెత్తగా
నూరి పెట్టుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి పోపుగింజలు,
కరివేపాకు వేసి అవి చిటపటలాడాకా ఉల్లిపాయలు వేయించి
అరటి పువ్వు ముద్దను వేసి వేపాలి. అన్నీ వేగిన తర్వాత కొబ్బరి
ముద్ద వేసి కలిపి వేయించి దింపాలి.

అరటిపువ్వు పెసరపప్పు కూర


అరటిపువ్వు 1
పెసరప్ప్పు 1 కప్పు
ఉల్లిపాయలు 2
అల్లం ముక్క చిన్నది
పచ్చిమిర్చి 6
నూనె 100 gm
ఉప్పు తగినంత
పసుపు 1/4 tsp
పోపుగింజలు 2 tsp
కరివేపాకు 2 రెబ్బలు

పెసరపప్పు నానబెట్టుకోవాలి. అరటిపువ్వు దొప్పలు తీస్తే చిన్న చిన్న
కాయలు వుంటాయి. వీటిని విడదీస్తే అందులో పుల్లలు లాంటివి చిన్న
చిన్న డొప్పలు ఉంటాయి. పుల్లలు ఏరి పారేయాలి. పుల్లలు విడ
దీయటానికి రావు. దానికి తలలు తీసేస్తే చాలు. అన్నీ వేరు చేసి ఈ
కాయలు కచ్చా పచ్చాగా దంచి కొంచెం నీరు పోసి కడిగి మరల కొంచెం
నీరు పోసి పొయ్యి మీద పెట్టాలి. కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు వేసి
కలిపి, దించి నీరు వార్చాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత
పోపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయ, అల్లం పచ్చిమిర్చి ముక్కలు
వేసి బాగా వేయించి, వార్చిన అరటిపువ్వు వేసి పైన పెసరపప్పు
వేసి తగినంత కారం, పసుపు, ఉప్పు వేసి కలిపి వేయించి దింపేయాలి.

అరటికాయ ముద్ద కూర


అరటికాయలు 3
పోపు గింజలు 2 tsp
కరివేపాకు 2 రెబ్బలు
వెల్లుల్లి 4 పాయలు
ఎండుమిర్చి 2
ఉప్పు తగినంత
కారం 1/2 tsp
పసుపు చిటికెడు
నూనె 50 gm

అరటికాయలు చెక్కు తీసి ముక్కలుగా తరిగి ఒక పొంగు వచ్చేవరకు
ఉడకబెట్టి చిల్లుల పళ్ళెములో వార్చాలు. బాణలిలో నూనె వేసి కాగిన
తర్వాత పోపుగింజలు, కరివేపాకు వేసి చిటపటలాడాక వెల్లుల్లి,
ఎండుమిర్చి వేసి పసుపు,ఉప్పు,కారం వేసి కాస్త వేపి అరటికాయ
ముక్కలు వేసి కలిపి వేయించాలి.

అరటికాయ -ఉల్లికారం


అరటికాయలు 4
నూనె 50 gm
ఉల్లిపాయలు 1/4 కిలో
పసుపు 1/4 tsp
కారం 1 tsp
ఉప్పు తగినంత
అల్లం వెల్లుల్లి 1 tsp
ధనియాలు 1 tsp
గసగసాలు 1 tsp

అరటికాయలు పెచ్చు తీసి చక్రాలుగా తరిగి మజ్జిగలో వేసి, బాణలిలో
నీరు పోసి, అరటికాయ ముక్కలు వేసి ఒక పొంగు వచ్చేవరకు
ఉడికించి దించేసి చిల్లుల పళ్ళెములో వార్చాలి. ఉల్లిపాయలు,
అల్లం వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు కలిపి మెత్తగా నూరాలి..
బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముద్ద వేయించి అరటిముక్కలు
వేసి ఉప్పు,కారం పసుపు వేసి కలిపి మూత వుంచి వేగిన తర్వాత
దించేయాలి.

అరటికాయ పెసరపప్పు కూర

అరటికాయలు 3
పెసరపప్పు 100 gm
పోపు గింజలు 2 tsp
ఎండుమిర్చి 2
కరివేపాకు 2 రెబ్బలు
పసుపు 1/4 tsp
కారం 1 tsp
ఉప్పు తగినంత
నూనె 50 gm


అరకాయలు పెచ్చు తీసి మజ్జిగలో చక్రాలుగా కాని ముక్కలుగా కాని
తరిగి వేయాలి. పెసరపప్పు 10 నిమిషాలు నానబెట్టాలి.బాణలిలో నూనె
వేడి చేసి పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడాక
అరటి ముక్కలు, నానబెట్టిన పెసరపప్పు వేసి కలపాలి.కొంచెం వేగిన
తర్వాత పసుపు, తగినంత ఉప్పు, కారం వేసి కలిపి మూత బెట్టి
ఉడకనివ్వాలి. ముక్కలు, పప్పు ఉడికిన తర్వాత కొత్తిమిర చల్లి
దింపేయాలి.

అరటికాయ వేపుడు

అరటికాయలు 3
మజ్జిగ 2 కప్పులు
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
కారం 1 tsp
నూనె 2 tbsp
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
కరివేపాకు 1 రెబ్బ
కొత్తిమిర 1 కట్ట

అరటికాయ పై పెచ్చు తీసి, చక్రాలుగా కాని,చిన్న ముక్కలుగా కాని
తరిగి మజ్జిగలో వేయాలి, లేకుంటే నల్లబడతాయి. బాణలిలో నూనె వేసి
కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర,కరివేపాకు వేసి అవి చిటపటలాడాకా
అరటిముక్కలు వేసి పసుపు,కారం,ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి.
మధ్య మధ్యలో కదుపుతూ ఎర్రగా వేగిన తర్వాత దింపాలి.